చూసేయ్ జాగా.. వేసెయ్ పాగా
ABN, First Publish Date - 2022-12-15T23:17:35+05:30
ప్రొద్దుటూరులో ఏ మాత్రం ఖాళీ జాగా కనబడినా కబ్జారాయుళ్లు వదలడంలేదు. ఇక పేదల కోసం ఇచ్చిన స్థలానికి ఒక్కో జాగాకు రెండు, మూడు పట్టాలు సృష్టించి స్థలాన్ని ఆక్రమించే యత్నాలు సాగిస్తున్నారు. వివరాల్లోకెళితే..
రాజకీయ పార్టీలు, సంఘాల పేరుతో పెత్తనం
ఆక్రమణల్లో అమృతానగర్
పట్టించుకోని అఽధికారులు
ప్రొద్దుటూరు, డిసెంబరు 15: ప్రొద్దుటూరులో ఏ మాత్రం ఖాళీ జాగా కనబడినా కబ్జారాయుళ్లు వదలడంలేదు. ఇక పేదల కోసం ఇచ్చిన స్థలానికి ఒక్కో జాగాకు రెండు, మూడు పట్టాలు సృష్టించి స్థలాన్ని ఆక్రమించే యత్నాలు సాగిస్తున్నారు. వివరాల్లోకెళితే.. పట్టణ పేదల కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమృతానగర్‌లో సుమారు 8 వేల మందికి ప్లాట్లు కేటాయించారు. అయితే ప్రభుత్వం పక్కాగృహాలు నిర్మించి ఇచ్చే స్థానంలో అవకతవకలు జరగడంతో కొన్నేళ్ల కింద టే 17 మందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి అమృతానగర్‌లో గృహాల నిర్మాణానికి ఫుల్‌స్టాప్ పడింది. అయితే కొందరు పేదలు ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాల్లో గృహాలు నిర్మించుకోగా మరికొందరి ప్లాట్లు ఆక్రమణలకు గురవుతున్నాయి.
ఒక బృందంగా ఏర్పడి నకిలీ పట్టాలు తయారు చేయడం, వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో అధికారుల పాత్ర కూడా కొంత మేర ఉన్నట్లు బల మైన ఆరోపణలు వినిపించాయి. ఒక్కో ప్లాటుపై సుమారు రెండుకు పైగా పట్టాలు ఉండడంతో అందులో ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలియ ని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా రాజకీయ పార్టీల నేతలు కూడా కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిక్కచ్చిగా ఎవరైతే అర్హులున్నారో వారికే స్థలాన్ని కేటాయించాల్సి ఉన్నప్పటికీ అధికారులు కూడా మీనమేషాలు లెక్కిస్తుండడంతో నిజమైన లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది.
రాజకీయ పార్టీలు,
సంఘాల పేరుతో పెత్తనం
ప్రముఖ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల పేరుతో కొందరు పెత్తనం చెలాయిస్తున్నారు, పట్టణంలో ఎక్కడ ఖాళీ జాగా కనబడినా దానిని ఆక్రమించేందుకు గద్దల్లా వాలిపోతున్నారు. దీన్ని నివారించాల్సిన అధికారులు సైతం పరిస్థితులకనుగుణంగా న్యాయ, అన్యాయాలు పరిశీలించకుండానే ఎటువైపు బలముంటే అటు వైపు వత్తాసు పలుకుతున్నారనేది సమాచారం. దీంతో చాలా సందర్భా ల్లో నిజమైన స్థల యాజమానులు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పేదలకు కేటాయించిన స్థలాల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల హవా కొనసాగుతూనే ఉంది. అమృతానగర్ లో కొన్నేళ్లగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకు లు, ప్రజా సంఘాల పేర్లు చెప్పుకుంటున్న నేతలు పేదల స్థలాలపై దృష్టి సారిస్తున్నారు. కొందరు నకిలీ పత్రాలు పెట్టుకుని నిజమైన లబ్ధిదారులకు తెలియకుండానే వారు స్థలాలను విక్రయిస్తున్న పరిస్థితులున్నాయి.
ఇదే అమృతానగర్‌లో కొందరు పాత్రికేయుల స్థలాలు సైతం కబ్జారాయుళ్లు నకిలీ పత్రా లు సృష్టించడం, వారికి ముఖ్యమంత్రి కార్యాలయంలోని కీలక అధికారి మద్దతునివ్వడం లాంటి సం ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి. అయితే స్థానికంగా ఉన్న పాత్రికేయులు అధికారుల సహా య సహాకారాలతో తమ ప్లాట్లను నిలుపుకోగలిగా రు. అంతో ఇంతో పలుకుబడి ఉండే పాత్రికేయుల పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్యుల పరిస్థితి ప్రశ్నార్ధకంగానే మారుతుంది. తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా నిజమైనదా, కాదా అన్నది నిరూపించుకునేందుకు వారికి కష్టతరమవుతోంది. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండాపోతోందని వాపోతున్నారు.
ఆక్రమణల్లో అమృతానగర్
అమృతానగర్‌లో 8వేల ప్లాట్లు పేదల కోసం కేటాయించినా ఇందులో చాలా వరకు నిరుపయోగంగానే ఉన్నాయి. ఇలాంటి ప్లాట్లను ఆక్రమణదారులు చేజిక్కించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఏ మాత్రం ఖాళీ జాగా కనబడినా వీరు రాజకీయ నేతల పేర్లు, ప్రజా సంఘాల నేతల మద్దతుతో ఆ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అమృతానగర్‌లో ప్లాట్లు వేయగా, మిగిలిన కొద్దిపా టి స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వదిలేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థలం తమదేనంటూ ఓ ప్రజాసంఘం నాయకులు పనులు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తమకు అన్ని అనుమతులున్నాయని చెబుతున్నా కొందరు వాటికి సం బంధించి ఆధారాలు మాత్రం చూపడం లేదు. ఇటీ వల ఓ రాజకీయ పార్టీలో చేరిన కొందరు ప్రజా సంఘాల నేతలు ఆక్రమణల పర్వానికి తెర లేపిన ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
దీంతో భూ కబ్జారాయుళ్లకు అడ్డు చెప్పేవారే కరువయ్యారు. ఈ విషయమై ఆంధ్రజ్యోతి తహసీల్దారు నజీర్‌అహ్మద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. అమృతానగర్‌కు సంబంఽధించిన సర్వేయరు రాఘవ మాట్లాడుతూ 2009లో ప్రభుత్వం తమకు పట్టా ఇచ్చిందని కొందరు ఈ నెల 6వతేదీన తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారని తెలిపారు. దీంతో సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారికి పరిశీలన కోసం పంపించినట్లు తెలిసిందన్నారు. అయితే ఉన్నఫళం గా రెండో శనివారం, ఆదివారం సెలవు కావడంతో ఈ లోపు ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోందన్నారు. తమ వద్ద ఉన్న రికార్డుల మేరకు ప్రస్తుతం అమృతానగర్‌లో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలం ఎవరికీ కేటాయించలేదని, దీనిపై ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు చెప్పారు.
Updated Date - 2022-12-15T23:17:37+05:30 IST