రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ABN, First Publish Date - 2022-08-05T05:25:34+05:30
రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో రహస్యంగా సాగుతున్న విచారణ
రాజంపేట, ఆగస్టు 4 : రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అన్నిశాఖల సిబ్బంది వద్ద ఉన్న సెల్ఫోన్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు రహస్యంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్‌లో జరిగిన వ్యవహారాలు, పన్నుల వసూళ్లు, సిబ్బంది జీత బత్యాలు, నెలసరి ఖర్చులు తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తు న్నారు. ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్, ఎస్ఐలు వై.కృష్ణమరాజు, నగేష్‌తో పాటు 15 మంది సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయ ప్రధాన గేటుకు తాళాలు వేసి అన్ని విభాగాల్లో విచారణ కొనసాగి స్తున్నారు. పది సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడంతో గతంలో అధికారులు ఇష్టానుసారం అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్‌లో భారీ అవకతవకలు, నెలసరి బిల్లులు, జమా ఖర్చులు, ఇంటి పన్ను, ఆస్తి పన్నుల విషయంలో కొందరు అధికారుల చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొందరు అధికారులు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆయా సెక్షన్ అధికారులను లోబరుచుకొని అవినీతికి పాల్పడ్డారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులపై ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. మున్సిపల్ గేటుకు తాళాలు వేసి అన్ని విభాగాల్లో సోదాలు జరుగుతుండటంతో వివరాలు బయటకు రావ డం లేదు. ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ జనార్ధన్‌రెడ్డిని వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఇటీవల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని, అదే సమయంలో రాజంపేటలో సోదాలు జరుగుతున్నాయన్నారు. అన్ని రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలిస్తారని... ఇంతకుమించి తనకేమీ తెలియదన్నారు.
Updated Date - 2022-08-05T05:25:34+05:30 IST