పోలీసులతో రాజ్యమేలతారా?
ABN, First Publish Date - 2022-10-17T09:50:25+05:30
రాష్ట్రంలో అధికార పార్టీ పోలీసులతో రాజ్యమేలాలని చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో జనసేన నేతల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. జనసేనాని పవన్ కల్యాణ్ జనవాణి
జనవాణిపై ఆంక్షలా?.. పవన్ బసచేసిన హోటల్లో సోదాలా?
అరెస్టు చేసిన జన సైనికులను తక్షణమే విడుదల చేయాలి
పార్టీల అధినేతలు కార్లో కూర్చోవాలో, నిల్చోవాలో
పోలీసులు నిర్ణయిస్తారా?.. చంద్రబాబు ఫైర్.. పవన్‌కు ఫోన్
జనసేనానికి పురందేశ్వరి, కన్నా, ఎమ్మెల్సీ మాధవ్ సంఘీభావం
ప్రభుత్వ తీరుపై సీపీఐ, లోక్‌సత్తా జేపీ ఆగ్రహం
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికార పార్టీ పోలీసులతో రాజ్యమేలాలని చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో జనసేన నేతల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. జనసేనాని పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ చేసిన కుట్రలు దుర్మార్గమని, ఆయన బస చేసిన హోటల్లో సోదాలు, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఆదివారం పవన్‌కు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. విశాఖ పర్యటన నేపథ్యంలో తనకు పోలీసులు నోటీసులివ్వడం, ఆంక్షలు పెట్టడం, జనసేన నేతలను అరెస్టు చేసిన తీరును పవన్ వివరించారు. పవన్‌కు నోటీసులివ్వడం సరికాదని, ఆయన పర్యటనపై ఆంక్షలు తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని ఖండించారు. పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు, అరెస్టులను ఖండించినందుకు పవన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి పవన్‌తో మాట్లాడారు.
జనసేన నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండించారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్వయంగా పవన్‌ను విశాఖలో కలిసి సంఘీభావం తెలిపారు. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కూడా విశాఖలో చోటు చేసుకున్న ఘటనలను ఖండించారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. వారికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ‘నాడు చంద్రబాబు అమరావతి పర్యటనలో ఆయన బస్సుపై వైసీపీ కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో, లాఠీలతో దాడి చేస్తే.. అది వారి భావ స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కు, నో కేస్ అని నాటి డీజీపీ సెలవిచ్చారు. ఇప్పుడు విశాఖలో మీ మంత్రులపైన దాడి జరిగితే హత్యాయత్నం కేసులా? దారుణం కదూ..’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ట్విటర్‌లో సీఎంను నిలదీశారు.
Updated Date - 2022-10-17T09:50:25+05:30 IST