కన్నాతో మనోహర్ భేటీ
ABN, First Publish Date - 2022-12-15T03:32:21+05:30
బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. బుధవారం రాత్రి గుంటూరులోని కన్నా నివాసానికి వచ్చిన మనోహర్.. ఆయనతో కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు.
గుంటూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. బుధవారం రాత్రి గుంటూరులోని కన్నా నివాసానికి వచ్చిన మనోహర్.. ఆయనతో కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. గతంలో కాంగ్రె్‌సలో ఉన్నప్పటి నుంచీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం మిత్రపక్షాల్లో కొనసాగుతున్నారు. గతంలో కూడా ఒకట్రెండు సార్లు ముఖాముఖీ సమావేశమైన సందర్భాలున్నాయి. తాజా భేటీకి ప్రత్యేకత లేదని, మామూలుగానే కలిశామని ఇద్దరు నేతలూ అంటున్నా.. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాగా.. బీజేపీలో కొనసాగుతున్న కన్నా కొంతకాలంగా ఆ పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల బహిరంగంగానే ధ్వజమెత్తారు. అన్ని విధాలుగా పాలనలో విఫలమైన జగన్ ప్రభుత్వాన్ని వీర్రాజు నాయకత్వంలోని బీజేపీ నిలదీయలేకపోతోందని కన్నా, ఇంకొందరు ముఖ్య నేతలు ఆక్షేపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నాను టీడీపీలో చేర్చుకుని ఆయన సీనియారిటీకి తగిన ప్రాధాన్యం కల్పించాలని టీడీపీ నాయకత్వం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆయన టీడీపీలో చేరడం ఖాయమని కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకోవైపు.. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీచేయాలని మనోహర్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన, కన్నా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Updated Date - 2022-12-15T03:32:22+05:30 IST