DL Ravindra Reddy: జగన్.. ఇంత అవినీతా? సిగ్గుపడుతున్నా: డీఎల్
ABN, First Publish Date - 2022-12-22T03:43:54+05:30
తన స్నేహితుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం బాగుపడుతుందని భావించానని.. కానీ ఇంత అవినీతికి పాల్పడతారని నా జీవితంలో అనుకోలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.
ఇసుక, లిక్కర్, మైనింగ్, ఎర్రమట్టి.. దేనినీ వదలడం లేదు
వివేకా హత్య కేసులో జనవరి 3 నుంచి ఊహించని మలుపు
అప్పుల ఊబిలో ఆంధ్ర.. బాగుచేయడం బాబుకే సాధ్యం!
పవన్ కల్యాణ్ నిజాయితీపరుడు.. ఇద్దరూ కలిసి పోటీచేయొచ్చు..
వైసీపీకి సింగిల్ డిజిటే నేనింకా ఆ పార్టీలోనే ఉన్నా..
విద్యార్థులకిచ్చే ట్యాబ్‌లలో పెద్ద అవినీతి: మాజీ మంత్రి డీఎల్
కడప (మారుతీనగర్), డిసెంబరు 21: తన స్నేహితుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం బాగుపడుతుందని భావించానని.. కానీ ఇంత అవినీతికి పాల్పడతారని నా జీవితంలో అనుకోలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆయన ఇంత అవినీతిపరుడైనందుకు సిగ్గుపడుతున్నానని తెలిపారు. బుధవారమిక్కడ కడప ప్రెస్‌క్లబ్‌లో డీఎల్ మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, మినరల్స్, చివరకు ఎర్రమట్టిని సైతం వదలకుండా కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ల ద్వారా కోట్లాది రూపాయలను చేరవేసుకుంటున్నారని ఆరోపించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి బాగుచేయాలంటే ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అడిగిన వారికి, అడగని వారికీ జగన్ ప్రభుత్వం పప్పుబెల్లాలు పంచినట్లుగా డబ్బులను విచ్చలవిడిగా పంచుతోందని.. దీంతో ఖజానా ఖాళీ అయిందని అన్నారు. ప్రస్తుతం అప్పులతో కాలం వెళ్లదీసే పరిస్థితులు దాపురించాయని చెప్పారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం గాడితప్పిన నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చంద్రబాబు తిరిగి పుంజుకునేలా చేశారని గుర్తుచేశారు. జనవరి 3 తర్వాత వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఊహించని మలుపు తిరుగుతుందని చెప్పారు. అందులో పెద్దలెవరున్నారు.. చేతులు మారిన రూ.60-70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో బయటకు రానున్నట్లు తెలిపారు. తానిం కా వైసీపీలోనే ఉన్నానని.. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని.. అది వైసీపీ తరఫున గానీ.. ఇతర పార్టీల తరఫున గానీ ఉండొచ్చని చెప్పారు.
జనసేన అధ్యక్షు డు పవన్ కల్యాణ్ నిజాయితీపరుడని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దిగజారిపోయిన రాష్ట్ర పరిస్థితిని వా రిద్దరూ కలిసి పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నానని చెప్పా రు. ‘ఇటీవల మైదుకూరులో చీప్ లిక్కర్ తాగి ఆరుగురు లివర్ చెడిపోయి చనిపోయారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వచ్చేది గొప్ప. 175కు 175 వస్తాయని వారనుకోవడంలో తప్పులేదు. కాకపోతే జనంలోకి వెళ్తే తెలుస్తుంది. సంక్షేమ పథకాలతోనే గెలుస్తామని అనుకోవడం కుదరదు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా పసుపు కుంకుమ కింద మహిళల ఓట్లకోసం డబ్బుల పందేరం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతం నవరత్నాల పేరుతో వైసీపీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా.. ఇంట్లో నుంచి వాళ్ల అబ్బ సొమ్ము తెచ్చి ఇవ్వడం లేదు’ అని చెప్పారు. విద్యార్థులకు ల్యాబ్‌ట్యాబ్‌లిస్తామని ఇచ్చిన హామీని అటకెక్కించి రూ.1,466 కోట్ల ఖర్చుతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారని.. ఇందులో పెద్ద అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. డబ్బు సంపాదన కోసం కడప జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి సోదరులు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. 1,466 కోట్లను జగన్‌రెడ్డి తన స్వార్థం, అవినీతి కోసం ఖర్చు చేసే బదులు, అందులో కేవలం 200 కోట్లను ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలుగా అందిస్తే మరింత మెరుగైన విద్యను విద్యార్థులకు అందించగలరని చెప్పారు.
Updated Date - 2022-12-22T03:43:55+05:30 IST