ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JAGAN GOVT Electricity Charges: జగనన్న కరెంటు బాదుడు 31 వేల కోట్లు!!

ABN, First Publish Date - 2022-12-16T02:28:02+05:30

జనాన్ని విద్యుత్‌ చార్జీలతో జగన్‌ ప్రభుత్వం బాదేస్తోంది. వారి నుంచి గత మూడున్నరేళ్లలో రూ.16,611 కోట్లు లాగేసింది చాలక.. వచ్చే ఏడాది ఇంకో రూ13,487.54 కోట్ల భారం వేసేందుకు సంసిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటికే వివిధ రూపాల్లో 16,611 కోట్ల వడ్డన

తాజాగా మరో 13,487 కోట్ల భారానికి రెడీ

ఆదాయ వ్యయాల మధ్య భారీ

లోటు ఉందని ఈఆర్‌సీకి నివేదన

జనవరిలో వర్చువల్‌గా

ఏఆర్‌ఆర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ

5లోగా లిఖితపూర్వకంగా

అందజేయాలని ఏపీఈఆర్‌సీ సూచన

బహిరంగ విచారణ జరపకపోవడంపై ప్రజాసంఘాల నిలదీత

(అమరావతి-ఆంధ్రజ్యోతి): జనాన్ని విద్యుత్‌ చార్జీలతో జగన్‌ ప్రభుత్వం బాదేస్తోంది. వారి నుంచి గత మూడున్నరేళ్లలో రూ.16,611 కోట్లు లాగేసింది చాలక.. వచ్చే ఏడాది ఇంకో రూ13,487.54 కోట్ల భారం వేసేందుకు సంసిద్ధమైంది. తమ ఆదాయ వ్యయాల మధ్య 13,487 కోట్ల వ్యత్యాసం ఉందంటూ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి 2023-24 సంవత్సరానికి వార్షిక నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను సమర్పించిన సంగతి తెలిసిందే. దీనర్థం ఈ మొత్తాన్నీ వినియోగదారుల నుంచి వసూలు చేసుకుంటామని అభ్యర్థించడమేనని విద్యుత్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. మూడున్నరేళ్లలో జగన్‌ సర్కారు ఏడు దఫాలుగా రూ.16,611 కోట్ల మేర విద్యుత్‌ చార్జీల భారం మోపిం ది. ఇందులో సర్దుబాటు(ట్రూఅప్‌) చార్జీల వాటా రూ.6,881 కోట్లు. మిగతాది చార్జీలు పెంచడం ద్వారా భారం వేశారు. ఇంకోవైపు.. తమకు వచ్చిన నష్టాల కింద రూ.1,068 కోట్ల మేర ట్రూఅప్‌ చార్జీలను ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలని ఈఆర్‌సీని డిస్కమ్‌లు ఇదివరకే అభ్యర్థించాయి. దీనిపై కమిషన్‌ నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఈలోపే మరో రూ.13,487.54 కోట్ల భారానికి డిస్కమ్‌లు రంగం సిద్ధం చేసేశాయి. చడీచప్పుడు లేకుండా హైదరాబాద్‌లో ఉన్న ఏపీఈఆర్‌సీకి సమర్పించాయి. ఇవన్నీ కలిపితే జనంపై మొత్తం భారం 31,166 కోట్లకు చేరుకుంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

గడచిన మూడున్నరేళ్లుగా చార్జీలు పెంచలేదని ప్రభుత్వం పదే పదే బుకాయిస్తోందని.. కానీ వినియోగదారులకు తెలియకుండా దొంగ దెబ్బతీస్తోందని మండిపడుతున్నారు. ఇంకోవైపు.. ఏఆర్‌ఆర్‌పై ప్రజాభిప్రాయ సేకరణను వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహిస్తామంటూ ఏపీఈఆర్‌సీ ప్రకటించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలపై అభ్యంతరాలుంటే వచ్చే నెల 5వ తేదీలోగా సంబంధిత డిస్కమ్‌ల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరుకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని.. నకలును ఈఆర్‌సీకి పంపాలని సూచించింది. దీనిపై నిపుణులు మండిపడుతున్నారు. ప్రజల సమక్షంలో వారి అభిప్రాయాలు సేకరించకుండా ఏఆర్‌ఆర్‌కు ఎలా ఆమోదం తెలుపుతారని ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. విద్యుత్‌ వినియోగదారులకు సబ్సిడీలు, చార్జీల మోతపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగ విచారణలకు ఈఆర్‌సీ చెల్లుచీటీ ఇచ్చిందని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ.13,487 కోట్ల భారంపై ప్రజాభిప్రాయ సేకరణకు బహిరంగ వేదికలను ఏర్పాటు చేయకుండా.. వీడియో కాన్ఫరెన్సుతో సరిపుచ్చాలనుకోవడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. ఏఆర్‌ఆర్‌లో ప్రభుత్వం ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీల ప్రస్తావన లేకపోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

500 యూనిట్లు దాటి వాడితే స్మార్ట్‌ మీటర్లు

గతంలో నెలకు 200 యూనిట్లు దాటిన ప్రతి వినియోగదారునికీ స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని డిస్కమ్‌లు భావించాయి. అయితే.. దీనిపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుందని భయపడి.. సడలింపు ఇచ్చాయి. 500 యూనిట్లు దాటి వాడుకున్నవారు.. స్మార్ట్‌ మీటర్లు కావాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించాయి.

పరిశ్రమలకు వాత..

తాజా ఏఆర్‌ఆర్‌లో గృహ, వాణిజ్య విద్యుత్‌ సరఫరా టారి్‌ఫలో ఎలాంటి మార్పులూ లేనప్పటికీ హెచ్‌టీ వినియోగదారులైన పరిశ్రమలు అధిక విద్యుత్‌ వాడితే వాత తప్పదని డిస్కమ్‌లు స్పష్టం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రానికి పరిశ్రమల రాక అంతంత మాత్రంగా ఉంది. ఉన్నవి కూడా పారిపోతున్న పరిస్థితి. ఈ దశలో ప్రభుత్వ రాయితీలు పొందుతున్న హెచ్‌టీ పరిశ్రమలను హెచ్‌టీ-3 కేటగిరీగా పరిగణిస్తూ వాటికి ప్రత్యేక శ్లాబును నిర్ణయించడం గమనార్హం. గృహ, వాణిజ్య వినియోగదారుల టారి్‌ఫలో ఎలాంటి మార్పులూ లేవని చెబుతూనే మూడు డిస్కమ్‌ల పరిధిలో రూ.13,487.54 కోట్లు లోటు ఉన్నట్లు పేర్కొన్నాయి.

నష్టాలు ఎందుకు పెరుగుతున్నాయి?

డిస్కమ్‌ల వార్షిక ఆదాయ, వ్యయాల నడుమ భారీ లోటు ఎందుకు వస్తోందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు కొని.. అధిక ధరకు ప్రజలకు సరఫరా చేస్తున్నాయని.. అలాంటప్పుడు నష్టాలకు ఆస్కారం ఎక్కడిదని నిలదీస్తున్నారు. డిస్కమ్‌లు తమ ఏఆర్‌ఆర్‌లో విద్యుత్‌ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4.65గా పేర్కొన్నాయి. అయితే గత ఏడాది ధర రూ.4.24. అంటే 41 పైసలు అధికంగా ఉంది. ఇదే సమయంలో ప్రసార నష్టాలను గణనీయంగా తగ్గించుకుంటున్నామని అవి ప్రచారం చేసుకుంటున్నాయి. 2022-23లో 0.52 శాతం మేర నష్టాలుంటాయని ఊహిస్తూ ఈఆర్‌సీ ఆమోదం పొందాయి. వాస్తవంలోకి వచ్చేసరికి నష్టాలు 0.63 శాతానికి చేరుకున్నాయి. 2023-24లో 0.60 శాతం మేర ప్రసార నష్టాలు ఉంటాయని ఈఆర్‌సీకి ఈఆర్‌సీకి నివేదించాయి. 2022-23లో యూనిట్‌కు రూ.2.03 మేర నెట్‌వర్క్‌ వ్యయం ఉంటుందని ఈఆర్‌సీకి ప్రతిపాదనలు పంపి ఆమోదింపజేసుకున్నాయి. తర్వాత రూ.2.24కి పెంచా యి. 2023-24లో ఇప్పుడు దానిని మరింత ఎక్కువగా చూపుతూ యూనిట్‌కు రూ.2.47గా ప్రతిపాదించాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ నెట్‌వర్క్‌ వ్యయాలు, ప్రసార నష్టాలూ తగ్గాల్సిందిపోయి ఎందుకు పెరుగుతున్నాయని నిపుణులు అడుగుతున్నారు.

2022-23లో వినియోగదారులకు యూనిట్‌కు రూ.7.09 చొప్పున సరఫరా చేస్తామని ప్రతిపాదించిన డిస్కమ్‌లు రూ.7.92కి పంపిణీ చేసినట్లు తాజా ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి. 2023-24లో యూనిట్‌కు రూ.7.96 చొప్పున సరఫరా చేస్తామని ప్రతిపాదించాయి. ఇంకోవైపు.. డిస్కమ్‌లు స్థిరచార్జీల పేరుతో వినియోగదారుల నుంచి డబ్బులు గుంజేస్తున్నాయని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గృహ వినియోగదారులపై నెలకు రూ.10, కమర్షియల్‌ వినియోగదారుల నుంచి రూ.75, హోర్డింగ్‌ల నుంచి రూ.100, పరిశ్రమల నుంచి రూ.75, కుటీర పరిశ్రమల నుంచి రూ.20, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించే విద్యుత్‌కు రూ.75 , మత సంబంధ వినియోగం నుంచి రూ.30 ఇలా స్థిర ఛార్జీల కింద నెలనెలా వసూలు చేస్తున్నాయి.

మూడున్నరేళ్లలో బాదుడు ఇలా.. (రూ.లలో)

500 యూనిట్లు పైబడితే 1,300 కోట్లు

90 పైసలు పెంపు

శ్లాబులు పెంచి 1,500 కోట్లు

కిలోవాట్‌కు రూ.10 పెంచడం ద్వారా 2,600 కోట్లు

ఇంధన సర్‌చార్జీ 700 కోట్లు

ఇంధన సర్దుబాబు (ట్రూఅప్‌) 2,542 కోట్లు

సర్దుబాటు చార్జీలు 3,569 కోట్లు

గృహ విద్యుత్‌ చార్జీల పెంపు 4,300 కోట్లు

మొత్తం 16,611 కోట్లు

Updated Date - 2022-12-16T08:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising