కులవృత్తులు కుదేలు
ABN, First Publish Date - 2022-12-07T03:55:06+05:30
‘బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. వారి సంక్షేమానికి కోట్లు ఖర్చు చేస్తున్నాం’... ప్రభుత్వ పెద్దలు తరచూ చెప్పే ఈ మాటలు వినడానికి ఎంతో బాగుంటాయి. వాస్తవంలోకి వచ్చేసరికి పరిస్థతి భిన్నంగా ఉంది.
బీసీల సంక్షేమాన్ని విస్మరించిన జగన్ సర్కారు
గతంలో ఉన్న స్వయం ఉపాధి పథకాలకు గండి
యాదవులకు గొర్రెల కొనుగోలు సాయమేదీ?
రజక, నాయీ బ్రాహ్మణులకు ‘ఆదరణ’ కరువు
గౌడ, శెట్టి బలిజల పరిస్థితీ ఇదే తీరు
చేనేతల సాయంలో కోతలు.. 30% మందికే ‘నేస్తం’
నవరత్నాల పేరుతో బీసీలను మభ్యపెట్టే యత్నం
రెక్కాడితే కానీ డొక్కాడదు.. శతాబ్దాలుగా కులవృత్తులే జీవనాధారం. బీసీ కులాలలో కొన్ని వర్గాల
పరిస్థితి ఇది. కొందరి పరిస్థితి మరీ దయనీయం.
ఆదుకోవాల్సిన ప్రభుత్వం మాటల్లోనే ఆర్భాటం!
ఆచరణ అంతంతే. పేరుకు బీసీ కులాలకు
కార్పొరేషన్లను ఏర్పాటు చేసి.. నిధులు
కేటాయించకుండా వారి సంక్షేమాన్ని గాలికొదిలేసింది.
వైసీపీ సర్కారు వచ్చాక బీసీ కులవృత్తుల వారికి గతంలో ఉన్న పథకాలకు మంగళం పాడేసింది. యాదవులకు గొర్రెల కొనుగోలు యూనిట్లను అటకెక్కించింది. నాయీ బ్రాహ్మణులు, రజకులకు ‘ఆదరణ’ పనిముట్లు రద్దు చేసింది. కల్లు గీత కార్మికులకు రుణాలు, ప్రమాద బీమా సదుపాయం ఆపేసింది. చేనేత వృత్తివారికి 30 శాతం మందికి కూడా నేతన్న నేస్తం అందించడం లేదు. నవరత్నాల పేరుతో అన్ని వర్గాలకూ అందే ప్రయోజనాలనే బీసీల ఖాతాలో వేసి కోట్లు ఖర్చు చేస్తున్నట్టు గొప్పలు చెబుతోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. వారి సంక్షేమానికి కోట్లు ఖర్చు చేస్తున్నాం’... ప్రభుత్వ పెద్దలు తరచూ చెప్పే ఈ మాటలు వినడానికి ఎంతో బాగుంటాయి. వాస్తవంలోకి వచ్చేసరికి పరిస్థతి భిన్నంగా ఉంది. బీసీ కులవృత్తుల స్వయం ఉపాధికి చేస్తున్న సాయం నామమాత్రమే. ఎన్నికల ముందు ఎన్నో ఆశలు కల్పించిన వైసీపీ అధికారంలోకి రాగానే మరచిపోయింది. గత టీడీపీ హయాంలో అందుతున్న ప్రయోజనాలను రద్దు చేసింది. నవరత్నాల పేరుతో బీసీలకు అన్యాయం చేస్తోందని ఆయా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. యాదవ, రజక, చేనేత వృత్తి కులాలను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్న భావనలో ఉన్నారు. పేదరికంలో మగ్గుతున్న యాదవులకు ప్రభుత్వం చేసింది శూన్యమని వాపోతున్నారు. రజక, నాయీ బ్రాహ్మణులకు ఆదరణ పనిముట్లను నిలిపేసి, వారి స్వయం ఉపాధి పథకాలను ఎత్తేసిందని చెబుతున్నారు. గౌడ, అగ్నికుల క్షత్రియ కులాలకు కూడా గతంలో అందుతున్న పలు పథకాలను రద్దు చేశారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్... బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శిస్తున్నారు.
యాదవుల సంక్షేమమేదీ?
రాష్ట్రంలో ఉన్న 137 బీసీ కులాల్లో యాదవులు అత్యధిక శాతం ఉన్నారు. దాదాపు 80లక్షల మంది ఉన్నట్టు ఆ వర్గంవారు చెబుతున్నారు. గతంలో యాదవులు, కురుబలకు స్వయంఉపాధి ద్వారా గొర్రెల కొనుగోలుకు రుణాలు అందించేవారు. గొర్రెల పెంపకం దారులకు ప్రత్యేకంగా సొసైటీలు ఏర్పాటు చేసి జిల్లా, రాష్ట్ర స్థాయిలో సహకారం అందించారు. గొర్రెలకు అవసరమైన మందులు ఈ సొసైటీకి ఉచితంగా సరఫరా చేసేవారు. చంద్రబాబు హయాంలో ప్రతి గ్రామంలో స్వయం ఉపాధి పథకాలు అందించారు. యాదవులు గొర్రెల కొనుగోలు యూనిట్లు భారీగా పొందారు. ఎన్బీసీఎ్ఫడీసీ ద్వారా బ్యాంకులు రుణాలివ్వకపోయినా ప్రభుత్వం పూచీకత్తుతో గొర్రెల కొనుగోలుకు రుణాలు అందించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి సహకారం అందడం లేదని వాపోతున్నారు. గతంలో ఉన్న పథకాలను రద్దు చేసి నవరత్నాల్లో ఆ ప్రయోజనాలు చూసుకోమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదని చెబుతున్నారు. మాంసం అభివృద్ధి, గొర్రెల పెంపకం విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహం అన్ని వర్గాలకు విస్తరించిందని, కులవృత్తిలో ఉన్న యాదవులకు ప్రత్యేకంగా కల్పిస్తున్న ప్రయోజనాలేవీ లేవంటున్నారు. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తప్ప ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు.
అందని ‘ఆదరణ’
రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులు సుమారు 2 లక్షల మంది ఉన్నారు. వారిలో 70 శాతం మంది కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వం ఆదరణ ద్వారా పనిముట్లు అందించి కొంతమేర ఊరట కలిగించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని చెబుతున్నారు. స్వయం ఉపాధి రుణాలివ్వడం ద్వారానే నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి సాధ్యమంటున్నారు. క్షవరవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నవారికి కనీసం రూ.5 లక్షలు పూచీకత్తు లేని రుణాలిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. సంగీత కళాశాల ఏర్పాటుచేసినా అందులో నాదస్వరం తప్ప మరేదీ లేదంటున్నారు. హెయిర్ సెలూన్, మెన్ బ్యూటీపార్లర్ లాంటి షాపులకు ఇతర కులాలకు అనుమతిచ్చి తమ వర్గం ఉపాధిని దెబ్బతీస్తున్నారని జాతీయ నాయీ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి కిన్నెర మాలకొండయ్య అన్నారు. ఒకరిద్దరికి పదవులిచ్చి మొత్తం నాయీ బ్రాహ్మణుల కులానికి ఎంతో చేశామని చెప్పుకోవడం తగదన్నారు.
రజకులదీ అదే పరిస్థితి
రాష్ట్రంలో రజకులు దుర్భర జీవితం గడుపుతున్నారు. వారిలో అత్యధిక శాతం కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో రజకులకు 90 శాతం సబ్సిడీతో ఆదరణ పనిముట్లు అందించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిలిపేశారు. గతంలో పలుచోట్ల రజకులకు రూ.10 లక్షల వ్యయంతో దోబీఘాట్లు నిర్మించారు. కులవృత్తిలో అనేక సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు ఆ పథకాలన్నింటికీ స్వస్తి పలికారు. రజక యువతకు స్వయం ఉపాధి కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శిస్తున్నారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
నేతన్న నేస్తంలో కోతలు
రాష్ట్రంలో సుమారు 3.5 లక్షల మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. జగన్ ప్రభుత్వం కేవలం 80వేల మందికే నేతన్న నేస్తం అందిస్తోంది. నూలు వడికే వారు, రాట్నం తిప్పేవారు, రంగులద్దే వారందరూ చేనేత కార్మికులే. వారికెవరికీ సాయం అందడం లేదు. చేనేతలకు సొంత మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు గత ప్రభుత్వం ప్రోత్సాహమిస్తే... ఈ ప్రభుత్వం మగ్గం యజమానులకే సాయం అందిస్తోంది. పైగా వ్యవసాయ భూమి, సొంతిల్లు, విద్యుత్ వినియోగం తదితరాలతో పాటు నూలు కొనుగోలు బిల్లు అనే కొత్త నిబంధనతో నేతన్న నేస్తంలో కోతలు పెడుతున్నారు. జీఎస్టీ 12 శాతానికి పెంచి చేనేతల నడ్డివిరుస్తున్నారని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గీత కార్మికులకు నిరాదరణ
గత ప్రభుత్వం నిరుపేద గీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి ఏటా 70కోట్ల బడ్జెట్ కేటాయించి ఖర్చు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1175 కల్లుగీత సొసైటీలకు సహకారమందించింది. సుమారు 30వేల మందికి పైగా గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కులాలకు చెందినవారికి రూ.25వేల నుంచి 2లక్షల వరకు రుణాలందించింది. చంద్రన్న బీమా ద్వారా ప్రమాద బీమా కల్పించింది. ఇప్పుడా పథకాలేవీ అందడం లేదు. ఈ సామాజికవర్గానికి చెందినవారు మంత్రి అయినప్పటికీ ఆ వర్గానికి పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. పేరుకు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి కొంతమందికి పదవులివ్వడంతోనే ఆయా కులాల అభివృద్ధి జరిగిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారని, ప్రభుత్వ విధానాలతో బీసీలు సంతృప్తిగా లేరని విమర్శిస్తున్నారు.
Updated Date - 2022-12-07T03:55:07+05:30 IST