ఉచిత వసతిపై పిల్లిమొగ్గలు
ABN, First Publish Date - 2022-06-30T09:45:30+05:30
రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన సచివాలయ, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతిపై వైసీపీ సర్కారు పిల్లిమొగ్గలు వేసింది.
- రద్దు చేస్తున్నట్టు బుధవారం ఉదయం సర్క్యులర్
- మరో 2 నెలల పొడిగింపంటూ రాత్రి ప్రకటన
- విభజన సమయంలో వచ్చిన ‘ఉద్యోగులకు’ సౌకర్యం
అమరావతి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన సచివాలయ, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతిపై వైసీపీ సర్కారు పిల్లిమొగ్గలు వేసింది. ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్టు బుధవారం ఉదయం ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే వెనక్కి తగ్గింది. మరో రెండు నెలలు (1-7-2022 నుంచి 31-8-2022 వరకు) ఉచిత వసతి పొడిగిస్తున్నట్టు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం మరో ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన ఉచిత వసతి సౌకర్యం రద్దు చేస్తున్నామని, గురువారం ఎట్టిపరిస్థితుల్లోనూ ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం మొదట ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగులు ఉంటున్న ప్లాట్లను ఖాళీ చేసి, మంచి స్థితిలో అప్పగించాలని ఆదేశించింది. ఏదైనా నష్టం జరిగితే ఉద్యోగులదే బాధ్యత అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. వారినుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉచిత వసతిని మరో రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - 2022-06-30T09:45:30+05:30 IST