ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలుపెరుగని ప్రస్థానం

ABN, First Publish Date - 2022-09-12T08:46:32+05:30

2019 మే 30... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అమరావతి ఉద్యమానికి  1000  రోజులు
  • 2019 డిసెంబరు 17న ‘మూడు’పై ప్రకటన
  • మరుసటి రోజునే మొదలైన ఉద్యమం
  • ఆది నుంచీ సర్కారు ఉక్కుపాదం
  • విరిగిన లాఠీలు, భారీగా కేసులు
  • సహిస్తూ, భరిస్తూ సాగుతున్న రైతులు
  • వైసీపీ మినహా అన్ని పార్టీల మద్దతు
  • అన్ని ప్రాంతాల ప్రజల సంఘీభావం
  • ‘అరసవల్లి’కి మహాపాదయాత్ర నేటి నుంచే


అమరావతికి మా మద్దతు’ అని ప్రకటించిన వైసీపీయే అధికారంలోకి వచ్చింది. కానీ నమ్మి భూములిచ్చిన రైతుల ప్రపంచాన్ని తలకిందులు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు భవ్యమైన, దివ్యమైన రాజధానిగా నిలబడుతుందని భావించిన అమరావతి స్వప్నాన్ని భగ్నం చేసింది.

అమరావతి రైతులు పిడికిలి బిగించి, రాజధాని పరిరక్షణకు నడుం కట్టి నేటికి వెయ్యి రోజులు!

అలుపెరుగని ఉద్యమ పథంలో ఎన్నో మలుపులు! అణచివేతలు, అవమానాలు! అయినా... పిడికిలి సడలించలేదు. అడుగు వెనక్కి వేయలేదు! అమరావతి ఉద్యమ ప్రస్థానంపై ప్రత్యేక కథనాలు 

(గుంటూరు - ఆంధ్రజ్యోతి): 2019 మే 30... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ క్షణం నుంచే అమరావతిని పక్కకు పడేశారు. ‘ప్రజావేదిక’ కూల్చివేతతో ము న్ముందు తన వైఖరి ఎలా ఉండనుందో సంకేతాలు పం పారు. చివరికి... 2019 డిసెంబరు 17న శాసనసభ వేదికగా ‘మూడు రాజధానులు’ అని కొత్త ప్రకటన చేశారు. ‘అమరావతి’ పునాదులను అప్పుడే, అక్కడే తవ్వేశారు!

పిడికిలి బిగించి... జగన్‌ చేసిన ‘మూడు రాజధానుల’ ప్రకటనపై అమరావతి రైతులు భగ్గుమన్నారు. ఆ మరుసటి రోజునే... అంటే 2019 డిసెంబరు 18వ తేదీన ‘సేవ్‌ అమరావతి’ ఉద్యమం పురుడుపోసుకుంది. మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలైన ఈ ఉద్యమం క్రమంగా మొత్తం రాజధాని గ్రామాలకు విస్తరించింది. అమరావతి రైతుల ఉద్యమానికి వైసీపీ మినహా ఇతర అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలవడం విశేషం!


సహించి... జయించి...

న్యాయమైన డిమాండ్లు, కోరికల సాధనకోసం ఆందోళనలు, ఉద్యమాలు చేయడం సర్వసాధారణం. ప్రభుత్వం వీలైతే వాటిని సానుకూలంగా పరిష్కరిస్తుంది. లేదా చర్చలు జరిపి... ఏది చేయగలం, ఏది చేయలేం అని చెబుతుంది. కానీ... అమరావతి ఉద్యమంపై జగన్‌ సర్కారు గతంలో ఏ ప్రభుత్వమూ, ఎవరిపట్లా వ్యవహరించని వైఖరి ప్రదర్శించింది. అమరావతిపై మంత్రులు విచ్చలవిడిగా దాడి చేశారు. శ్మశానం, ఎడారి, కుల రాజధాని, దయ్యాల రాజధాని అంటూ విచక్షణారహితంగా విమర్శిస్తున్నారు. రూ.10వేల కోట్ల వ్యయంతో జరిగిన పనులు కళ్లముందే కనిపిస్తున్నా... ‘అక్కడ ఒక్క ఇటుకా పడలేదు’ అని పదేపదే అబద్ధాలు చెప్పారు. అన్ని నిజాలూ తెలిసినా అదేపనిగా దాడి చేశారు. ఇక... అమరావతి రైతులు ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసులు అడ్డుకున్నారు. లాఠీ చార్జీలు చేశారు. వందల కొద్దీ కేసులు పెట్టారు. దళితులపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. ఇక... అమరావతి వద్దు అంటూ పోటీ ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఇన్ని అవమానాలు, అణచివేతలను సహిస్తూ, భరిస్తూ  అమరావతి రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. గమ్యం ముద్దాడటమే తమ లక్ష్యమని తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి లో అమరావతికి మద్దతు కూడగట్టడంలో విజయం సాధించారు. ఒక్క వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలూ అమరావతికి మద్దతుగా నిలిచాయి.


మరో యాత్ర... 

‘అమరావతి ఉద్యమం ఆ 29 గ్రామాలకే పరిమితం. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారి మద్దతు లేదు’ అనే దుష్ప్రచారాన్ని చెరిపివేస్తూ రాజధాని రైతులు తిరుపతిదాకా పాదయాత్ర జరిపారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో జరిపిన ఈ పాదయాత్రకు దారిపొడవునా జనం జేజేలు పలికారు. అమరావతికి తమ సంఘీభావం ప్రకటించారు. అమరావతికి మద్దతుగా తిరుపతిలో నిర్వహించిన సభ విజయవంతమైంది. అదే సమయంలో... ప్రభుత్వ ప్రాయోజిత అమరావతి వ్యతిరేక సభ ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు... అమరావతి ఉద్యమం వెయ్యి రోజులకు చేరిన సందర్భంగా సోమవారం ‘అమరావతి నుంచి అరసవల్లి’ యాత్రను ప్రారంభిస్తున్నారు. ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ... కోర్టు అనుమతి జారీ చేసింది. ఆ వెంటనే... మంత్రులు అమరావతిపై మరోసారి విషం చిమ్మడం ప్రారంభించారు.


మా పొలాల్లో రాజధాని పెట్టండి... అని వాళ్లు అడగలేదు!

మా భూములు ఇచ్చేస్తాం... అని వాళ్లంతట వాళ్లు ముందుకు రాలేదు.

రాష్ట్రం నడిబొడ్డున ఉందని, ఒక నూతన నగర నిర్మాణానికి అనుకూలమని ప్రభుత్వమే అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

‘మీ భూములు ఇవ్వండి. మేం భవిష్యత్తు ఇస్తాం. మీరు చేసిన త్యాగానికి ఫలితం ఉంటుంది’ అని ప్రభుత్వమే భరోసా ఇచ్చింది.

నమ్మి భూములిచ్చారు. మూడేళ్లు అంతా బాగా గడిచింది. ప్రభుత్వం మారింది. వారి ప్రపంచం తలకిందులైంది. ‘అమరావతికి మా మద్దతు’ అని ప్రకటించిన వైసీపీయే అధికారంలోకి వచ్చింది. 

‘అమరావతి దేవతల రాజధాని’ అని అప్పటి ప్రభుత్వం గొప్పగా చెప్పింది.

‘కాదు... అది దెయ్యాల రాజధాని’ అని నేటి ప్రభుత్వం చెబుతోంది.

‘అమరావతి ప్రజా రాజధాని’ అని నాటి ప్రభుత్వం పేర్కొంది. 

‘కాదు... అది కుల రాజధాని’ అని నేటి ప్రభుత్వం అంటోంది.

మధ్యలో నలిగిపోతున్నది, నాశనమై పోయింది.... అమరావతి భవిష్యత్తు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు భవ్యమైన, దివ్యమైన రాజధానిగా నిలబడుతుందని భావించిన అమరావతి స్వప్నం భగ్నమై నేటికి వెయ్యి రోజులు! 

అమరావతికి జేజేలు పలికిన నోటితోనే... అది ఎడారి, శ్మశానం, కుల రాజధాని అంటూ... అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట ప్రభుత్వ పెద్దలు మూడుముక్కలాట మొదలుపెట్టి  నేటికి వెయ్యి రోజులు!

‘కట్టడం కాదు... కూల్చడమే గొప్ప’ అనే వికృత సిద్ధాంతం పురుడు పోసుకుని నేటికి వెయ్యి రోజులు!

అమరావతి రైతులు పిడికిలి బిగించి, రాజధాని పరిరక్షణకు నడుం కట్టి నేటికి వెయ్యి రోజులు!

అలుపెరగని ఉద్యమ పథంలో ఎన్నో మలుపులు! అణచివేతలు, అవమానాలు! అయినా... పిడికిలి సడలించలేదు. అడుగు వెనక్కి వేయలేదు!


మూడు ముక్కలాటలో ఆగిన గుండెలు

అమరావతి కోసం 214 మంది బలిదానం

(గుంటూరు-ఆంధ్రజ్యోతి): జగన్‌ సర్కారు మొదలుపెట్టిన మూడు ముక్కలాటతో అమరావతి ప్రాంతంలో వందల మంది అన్నదాతలు అశువులుబాశారు. తీవ్ర మనోవేదనతో ఆ గుండెలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 214 మంది మరణించారు. ఈ మూడేళ్లలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 82 మంది చనిపోగా, 42 మంది రైతు కూలీలు ఉన్నారు. వీరితోపాటు కౌలుదారులు, అనుబంధ వృత్తులవారూ అనేకమంది బలైపోయారు. రాజధాని కేవలం ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమన్న ప్రభుత్వ వాదన సరికాదని రైతుల మరణాలు రుజువు చేస్తున్నాయి. మొత్తం మరణాల్లో 70 మంది ‘నచ్చని వర్గం’ నుంచి చనిపోగా, మిగిలిన 144 మంది ఇతర సామాజిక వర్గాలకు చెందినవారే. వీరిలో బీసీలు 23 మంది, ఎస్సీలు 21 మంది, ముస్లింలు 11 మంది, ఎస్టీలు ముగ్గురు ఉన్నారు. గత వెయ్యి రోజులుగా అమరావతి గ్రామాల్లో పదుల సంఖ్యలో మరణించారు.

Updated Date - 2022-09-12T08:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising