ఎన్నిక విషయంలో జాప్యం ఎందుకు?
ABN, First Publish Date - 2022-12-15T03:30:17+05:30
ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్(ఏపీహెచ్‌సీఏఏ) నూతన ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎన్నిక నిర్వహించే విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రస్తుత కార్యవర్గాన్ని హైకోర్టు నిలదీసింది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే స్టే ఉత్తర్వులు ఎత్తివేస్తాం
ఏపీహెచ్‌సీఏఏకు హైకోర్టు ధర్మాసనం హెచ్చరిక
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్(ఏపీహెచ్‌సీఏఏ) నూతన ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎన్నిక నిర్వహించే విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రస్తుత కార్యవర్గాన్ని హైకోర్టు నిలదీసింది. ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించింది. న్యాయస్థానం ముందు దాఖలు చేసిన మెమోను పరిశీలిస్తే ఎన్నికల నిర్వహణకు ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఇదే తీరు కొనసాగితే గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించాలని అడ్‌హాక్ కమిటీని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా న్యాయవాదులను రెండుగా విభజిస్తున్నారని, దీనివల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అభిప్రాయపడింది. ఏపీహెచ్‌సీఏఏ తరఫున సీనియర్ న్యాయవాది సి. మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. ఎన్నికల నిర్వహణ విషయంలో సవరించిన మెమో దాఖలు చేస్తామన్నారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదావేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది.
ఏపీహెచ్‌సీఏఏ ఎగ్జిక్యూటివ్‌బాడీ కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎన్.విజయ్‌భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా ఏపీహెచ్‌సీఏఏ కార్యకలాపాల నిర్వహణకు అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేశామని బార్ కౌన్సిల్ హైకోర్టుకు నివేదించింది. ఆ వివరాలు నమోదు చేసిన సింగిల్ జడ్జి తక్షణం అసోసియేషన్ నుంచి బాధ్యతలను తీసుకోవాలని అడ్‌హాక్ కమిటీని ఆదేశిస్తూ వ్యాజ్యంపై విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సింగిల్ జడ్జి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీహెచ్‌సీఏఏ అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, కార్యదర్శి కె.నర్సిరెడ్డి అప్పీల్ వేశారు. బుధవారం జరిగిన విచారణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏపీహెచ్‌సీఏఏ మెమో దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం పడుతుందని అందులో పేర్కొనడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. విజయ్‌భాస్కర్ తరఫున న్యాయవాది సీతారాం చాపర్ల వాదనలు వినిపిస్తూ... ఏపీహెచ్‌సీఏఏ స్వతంత్ర బాడీ కాదన్నారు. అందులోని సభ్యులందరూ ప్రభుత్వంలో స్టాండింగ్ కౌన్సిళ్లుగా పనిచేస్తున్నారన్నారు.
Updated Date - 2022-12-15T03:30:18+05:30 IST