దొంగల స్వైరవిహారం.. మూడు ఇళ్లలో చోరీలు
ABN, First Publish Date - 2022-06-13T05:41:52+05:30
యడ్లపాడు పరిధిలో మైదవోలు వెళ్ళు మార్గం పక్కగా ఉన్న బీసీ కాలనీలో శనివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు స్వైరవిహారం చేశారు.
69 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.18,500 అపహరణ
యడ్లపాడు, జూన్ 12 : యడ్లపాడు పరిధిలో మైదవోలు వెళ్ళు మార్గం పక్కగా ఉన్న బీసీ కాలనీలో శనివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు స్వైరవిహారం చేశారు. మూడు వేర్వేరు ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లోని వారు డాబాలపై నిద్రిస్తున్న విషయాన్ని పసిగట్టి, తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలు, అల్మరాలు పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్ళారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు. కాలనీలోని బత్తుల సుజాత, తుర్లపాటి శారద, దాట్ల వెంకటేశ్వరరాజులకుటుంబాలు శనివారం రాత్రి తమ ఇళ్లకు తాళాలువేసి డాబాలపై నిద్రించారు. తెల్లవారు జామున సుమారు 4.30 గంటల సమయంలో నిద్రలేచి కిందకు వచ్చిన బత్తుల సుజాత ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించింది. ఆందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉందని, అందులోని 48 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు కనిపించడం లేదని తెలిపింది. అలాగే వీరి వెనుక బజారులోని దాట్ల వెంకటేశ్వరరాజు, ప్రక్క వీధిలోని తుర్లపాటి శారదల ఇళ్లలోనూ దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంకటేశ్వరరాజు ఇంట్లోని బీరువాను పగలగొట్టి 8 గ్రామలు బంగారు ఆభరణాలు, రూ.3 వేల నగదు, తుర్లపాటి శారద బీరువాలో ఉంచిన 13 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.500 నగదుతో పాటు గ్యాస్ సిలిండర్‌ను దొంగలు ఎత్తుకెళ్ళారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఇన్‌చార్జి డీఎస్‌పీ రవిచంద్ర, చిలకలూరిపేట రూరల్ సీఐ అచ్చియ్యలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం ద్వారా ఆధారాలను సేకరించారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.
Updated Date - 2022-06-13T05:41:52+05:30 IST