చూస్తూనే.. టైం పాస్!
ABN, First Publish Date - 2022-05-14T05:30:00+05:30
తక్కువ సమయంలో అందించే వినోదం పట్ల ఎక్కువమంది ఆకర్షితులవటం కొత్త విషయం కాదు. గతంలో రోజుల పాటు జరిగే నాటకాలు, ఆ తర్వాత మూడు గంటలపాటు ఉండే సినిమా పట్ల ఆసక్తిని చూపేవారు.
తక్కువ నిడివి వీడియోలపై మోజు
షార్ట్స్, రీల్స్ చూడటానికే ఎక్కువ సమయం
రోజుకు 5 ట్రిలియన్ వీక్షణలు
సగటున ప్రతి వ్యక్తి 6 గంటలకు పైగా షార్ట్స్నే చూస్తున్నారు
ఆశ్చర్యం వ్యక్తం చేసిన యూ ట్యూబ్
షార్ట్స్ చేసేవారికే కూడా ప్రోత్సాహాకాలు
మెదడుపై తీవ్ర ప్రభావం తప్పదంటున్న నిపుణులు
ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్లు షార్ట్స్, రీల్స్ పేరిట వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వీటి హవా నడుస్తోంది. ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్, ఫేస్బుక్, కొన్ని రకాల యాప్‌లు షార్ట్ వీడియోలను ప్రోత్సహిస్తున్నాయి. వీటి పుణ్యమా అని ప్రతి ఒక్కరూ తమలో ఉన్న ప్రావీణ్యాన్ని ప్రపంచానికి చూపగలుగుతున్నారు. ఇదే సమయంలో చాలామంది వీటికి బానిసలు కూడా అవుతున్నారు.
వస్తువులకు బందీలు అయ్యేవారు కూడా బానిసలే అని గ్రీకు తత్త్వవేత్త డయాజినస్ అన్న మాటలు స్మార్ట్ ఫోన్‌ను అతిగా వినియోగించేవారికి సరిగ్గా సరిపోతాయి. చేతిలోకి వచ్చిన అద్భుతాన్ని సద్వినియోగం చేసుకోకుండా అనవసర విషయాలపై ఆసక్తిని చూపుతూ విలువైన కాలాన్ని వృధా చేయడంతో పాటు మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. కొంతమంది అయితే వీడియోలు చూస్తూ రోజువారి పనులకు కూడా మర్చిపోతున్నారు. రోజులో మూడొంతులు స్మార్ట్ ఫోనుతోనే గడుపుతుంటారు. కొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి స్వయంగా వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు.
గుంటూరు(తూర్పు), మే14: తక్కువ సమయంలో అందించే వినోదం పట్ల ఎక్కువమంది ఆకర్షితులవటం కొత్త విషయం కాదు. గతంలో రోజుల పాటు జరిగే నాటకాలు, ఆ తర్వాత మూడు గంటలపాటు ఉండే సినిమా పట్ల ఆసక్తిని చూపేవారు. స్మార్ట్ఫోను వచ్చాక వినోదాల నిడివి గంటల నుంచి నిమిషాలకు కుదించిబడింది. టిక్‌టాక్‌ను నిషేధించిన తరువాత 2020 సెప్టెంబర్‌లో యూ ట్యూబ్ భారతదేశంలోకి 15 నుంచి 60 సెకన్ల పాటు వీడియోలు చేసుకునేలా తన ఛానల్లో ప్రొట్రైట్ మోడ్‌ను ఏర్పాటు చేసింది. కేవలం వీడియోలు చేసేవారు తమ ప్రావీణ్యంను ప్రపంచానికి చూపేందుకు మాత్రమే వీటిని వినియోగించుకోవాలని నిబంధనలను రూపొందించింది. కానీ రానురాను యూ ట్యూబ్‌లో వచ్చే సాధారణ వీడియోలకంటే రీల్స్, షార్ట్స్నే ఎక్కువమంది చూస్తున్నారు. తక్కువ నిడివి, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వీడియోలు ఉండటం, మధ్యలో ఎటువంటి వాణిజ్య ప్రకటనలు లేకపోవడం వంటి కారణాలతో వీటి పట్ల ఆసక్తి పెరిగింది. దీంతో ఈ ఏడాది జనవరి 25 నాటికి రోజుకు 5 ట్రిలియన్ వీక్షణలు కేవలం షార్ట్స్, రీల్స్ ద్వారానే అందుతున్నాయి. సగటున ప్రపంచంలో ప్రతి వ్యక్తి రోజుకు 480 నిమిషాల పాటు షార్ట్స్ చూస్తే ఇన్ని వీక్షణలు సాధ్యమవుతాయని యూ ట్యూబే స్వయంగా తెలపడం విశేషం.
సాధారణ వీడియోల పట్ల తగ్గిన ఆసక్తి..
రీల్సు, షార్ట్స్ వచ్చాక మామూలు వీడియోలను చూసే వారిసంఖ్య తగ్గినట్టు యూ ట్యూబ్ ధ్రువీకరించింది. 40 శాతం మంది నిమిషాల వ్యవధి కల వీడియోలు చూడటం మానేశారని స్వయంగా యూ ట్యూబే వెల్లడించడం గమనార్హం. ఏవైనా ముఖ్యమైన అంశం ఉంటే తప్ప కనీసం రెండు నిమిషాల నిడిని ఉన్న వీడియోలు చూడటానికి కూడా చాలామంది ఆసక్తి చూపడం లేదని తెలిపింది. కొంతమంది అయితే నిడివిని చూసిన తరువాతే వీడియోను చూడటానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది.
35 రకాల వీడియోలు..
షార్ట్స్, రీల్సులో వచ్చే వీడియోలు దాదాపుగా 35 రకాలుగా ఉంటున్నాయని యూ ట్యూబ్ గుర్తించింది. ముఖ్యంగా డబ్స్మాష్, పాటలకు నృత్యాలు చేయడం, చిన్నపాటి జోక్‌లు, పెద్ద వీడియోలకు ప్రోమో చిత్రాలు. ఇతరుల చేసే వీడియోలకు గొంతును అందించడం, ఒకే విధంగా భిన్నమైన చోట్ల జరిగే సంఘటలను ఒక చోటకు చేర్చడం, చారిత్రక విషయాల గురించి వివరించడం వంటివి ఎక్కువుగా ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరగవచ్చని అభిప్రాయ పడింది.
ఎక్కువశాతం కుటుంబ సభ్యులే..
షార్ట్స్, రీల్సు చేసేవారిలో ఎక్కువశాతం కుటుంబ సభ్యులే ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో అయితే ఈ సంఖ్య కాస్త ఎక్కువుగానే ఉంటుంది. భార్యభర్తలు, తండ్రీకూతుళ్లు, తల్లీకొడుకులు, తాతా మనవళ్లు, స్నేహితులు ఇలా దగ్గరి వ్యక్తులు మాత్రమే షార్ట్స్, రీల్సు చేస్తున్నారు. వీడియోలు చేసేవారి కంటే షార్ట్స్ చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు భారతదేశంలో స్మార్ట్ఫోను ఉన్న ప్రతి 10 కుటుంబాల్లో ముగ్గురు షార్ట్స్ చేస్తూ ఉండవచ్చని యూ ట్యూబ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
పెరుగుతున్న సైబర్ మోసాలు..
తమ వీడియోలను ఎక్కువమంది చూడాలనే ఆశతో చాలామంది మోసాల బారిన పడే ప్రమాదమూ లేకపోలేదు. ఎక్కువ వీక్షణలు వచ్చేలా చేస్తామని తన వద్ద రూ.2లక్షల వరకు కాజేశారని ఈ మధ్య సైబరాబాదు కమీషనరేట్లో ఒక యూ ట్యూబర్ ఫిర్యాదు చేయడమే దీనికి నిదర్శనం. వీడియోలు చేసే సమయంలో వ్యక్తిగత సమాచారం చెప్పకుండా ఉంటే మంచిది. అనవసర విషయాలపై చేసే వీడియోలు, ఫ్రాంక్ వీడియోలు వల్ల సమయం వృధా అవుతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించాలి.
మానసిక వ్యాధుల బారిన...
షార్ట్ వీడియోలు వచ్చిన తరువాత మొబైల్‌తో గడిపే సమయం కూడా రెట్టింపు అయింది. యూ ట్యూబ్ లెక్కల ప్రకారం సగటున 480 నిమిషాల అంటే 8 గంటలు చూస్తున్నారు. ఇది గతంలో లేదు. టిక్‌టాక్ వంటివి వచ్చాక ఈ సమయం మరింత పెరిగింది. రోజులో 8 గంటలు ఫోను చూడటం వల్ల మెదడుపై వీటి ప్రభావం పడుతుందని వైద్యులు అంటున్నారు. అదే పనిగా వీటిని చూడటం వల్ల మెదడు స్పందించకపోవడం, తమలో తామే మాట్లాడుకోవడం, గట్టిగా అరవడం వంటివి చేస్తుంటారు. వీడియోలు చేసేవారు కూడా తాము సెలబ్రిటీలం అయిపోయామనే భ్రమలో కాలం గడుపుతూ ఉంటారు.
భ్రమల్లో గడిపేస్తున్నారు..
అత్యాధునిక సాంకేతిక కలిగిన ఫోన్లు అందుబాటులోకి రావడంతో వీటితో గడిపే సమయం కూడా పెరిగింది. తక్కువ నిడివి ఉన్న వీడియోలు మనిషిని ప్రభావితం చేస్తాయి. తక్కువ సమయం ఉండటం వల్ల ఈ వీడియోలు పూర్తిగా గుర్తుంటాయి. ఇవి మెదడుపై ప్రభావం చూపుతాయి. అంతేగాక వీడియోలు చేసేవారు కూడా సమాజంలో తాము ప్రత్యేకమైన వ్యక్తులుగా భావిస్తుంటారు. దీనివల్ల ఇతరులతో ఉండే సంబంధాలకు దూరమవుతారు. ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తించబడటం అంత తేలికైన విషయం కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.
- ఐవీఎల్ నరసింహరావు, సైకియాట్రిస్ట్ గుంటూరు
Updated Date - 2022-05-14T05:30:00+05:30 IST