సంగం డెయిరీని ప్రభుత్వపరం చేస్తాం
ABN, First Publish Date - 2022-12-15T01:01:18+05:30
సంగం డెయిరీని ప్రభుత్వపరం చేస్తామని పశు సంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులో పశువైద్యశాలను బుధవారం ఆయన ప్రారంభించారు.
పొన్నూరుటౌన్, డిసెంబరు 14: సంగం డెయిరీని ప్రభుత్వపరం చేస్తామని పశు సంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులో పశువైద్యశాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమమార్గంలో ప్రైవేటు వ్యక్తులకు సంగం డెయిరీని కట్టబెట్టారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఆయన సుపరిపాలన చూసి చంద్రబాబుకు పిచ్చి ముదిరి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్రంలోని సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో మొబైల్ వెటర్నరి క్లినిక్‌ను ప్రారంభించి పశు వైద్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ సహకార వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజకంగా పాలిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య మాట్లాడుతూ టీడీపీ హయాంలో సహకార వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యంచేసి సొంత మనుషులకు కట్టబెట్టారని ఆరోపించారు. అమూల్‌ను రాష్ట్రంలోకి తీసుకురావడం ద్వారా సీఎం పాల రైతులకు మేలుచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పశు సంవర్ధకశాఖ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T01:01:22+05:30 IST