సాగునీరు.. మార్చి 31 వరకు
ABN, First Publish Date - 2022-12-31T00:49:49+05:30
జిల్లాలో రబీలో వరి, మొక్కజొన్న పంటల సాగు ముమ్మరంగా సాగుతున్నది. జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. శనగ సాగుపై కూడా రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాగర్ ఆయకట్టుకు మార్చి 31 వరకు సాగునీటి సరఫరా ఉంటుందని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. అయితే గత ఏడాది వలే ఈ ఏడాది కూడా నీటి సరఫరాను పొడిగించే అవకాశాలు ఉన్నాయి.
నరసరావుపేట, డిసెంబరు 30: జిల్లాలో రబీలో వరి, మొక్కజొన్న పంటల సాగు ముమ్మరంగా సాగుతున్నది. జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. శనగ సాగుపై కూడా రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాగర్ ఆయకట్టుకు మార్చి 31 వరకు సాగునీటి సరఫరా ఉంటుందని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. అయితే గత ఏడాది వలే ఈ ఏడాది కూడా నీటి సరఫరాను పొడిగించే అవకాశాలు ఉన్నాయి. రబీలో ప్రధానంగా మొక్కజొన్న, శనగ పంటలు అధికంగా సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఖరీప్‌లో వేసిన పత్తి అధిక వర్షాలకు దెబ్బతిన్నది. దీంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులు పత్తి తొలగించి మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో సాగు చేయకుండా వదిలేసిన పొలాల్లో అధిక శాతం మొక్కజొన్న సాగు చేపట్టారు. సాగర్ ఆయకట్టులో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరి సాగు చేసిన పొలాల్లో రెండో పంట కింద కూడా వరి సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తొలి పంట ధన్యాన్ని పొలాల్లోనే విక్రయిస్తున్నారు. ఖరీఫ్‌లో గత ఏడాది కంటే ఎకరాకు 10 బస్తాలు అధికంగా ధాన్యం దిగుబడి అవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులతో పాటు ధాన్యం ధర కూడా ఆశాజనకంగా ఉంది. బస్తా ధర రూ.1500 నుంచి 1600 వరకు ఉందని రైతులు చెప్తున్నారు. రబీలో వరి సాధారణ విస్తీర్ణం 68,547 ఎకరాలు కాగా ఇప్పటివరకు 14,990 ఎకరాల్లో సాగైంది. ఖరీఫ్‌లో 92,772 ఎకరాల్లో వరి సాగు చేశారు. రబీలో గతంలో కంటే వరి సాగు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్‌లో ఖాళీగా ఉన్న పొలాల్లో మొక్క జోన్న, శనగ సాగు చేశారు. కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసిన పొలాల్లో మొక్కజొన్న సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్న సాఽధారణ విస్తీర్ణం 18,322 ఎకరాలు కాగా ఇప్పటికే 26,937 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. శనగ సాధారణ విస్తీర్ణం 29,995 ఎకరాలు కాగా 18,477 ఎకరాల్లో పంట సాగైంది. శనగకు అదును పూర్తియింది. సంక్రాంతి వరకు మొక్కజొన్న, వరి సాగు కొనసాగనున్నది.
సాగర్ జలాశంలో సమృద్ధిగా నీరు
నాగార్జున సాగర్ జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నాయి. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా శుక్రవారం 580.80 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. 17,289 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వస్తుండగా అదే స్ధాయిలో నీటిని కుడి, ఎడమ కాలువలకు విడుదల చేస్తున్నారు. మార్చి 31 వరకు సాగర్ ఆయకట్టకు నీటి సరఫరా చేయనున్నట్టు జలవనరుల శాఖ ఎస్సీ డీ వరలక్ష్మి తెలిపారు. వరి సాగు అంశాన్ని ప్రస్తావించగా నీటి సరఫరా కొనసాగింపు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. మార్చి 31 తదుపరి వేసవిలో చెరువులను నింపేందుకు నీటి సరఫరాను కొనసాగించనున్నారు. వరి సాగు నేపథ్యంలో మరో నెల రోజులు నీటి సరఫరా పొడిగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
Updated Date - 2022-12-31T00:49:51+05:30 IST