అక్రమాలకు అడ్డా.. పిట్టంబండ
ABN, First Publish Date - 2022-01-13T06:20:17+05:30
వినుకొండ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా అక్రమార్కులకు మూడు పూలు, ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.
ఇసుక అక్రమరవాణాతో లక్షలు దండుకుంటున్న అక్రమార్కులు
పటీపట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు
వినుకొండటౌన్, జనవరి 12 : వినుకొండ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా అక్రమార్కులకు మూడు పూలు, ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ప్రభుత్వం ఇసుక పంపిణీ కేంద్రాల్లో పంపిణీ నిలిపివేయడంతో గుండ్లకమ్మ పరివాహక ప్రాంతాల్లోని కొందరు అక్రమదారులు గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను అక్రమ రవాణా చేసి కాసులు దండుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే ఇసుక రీచ్‌లు ప్రైవేటు పరం కావడంతో టన్ను ఒకటికి రూ.1075లు వెల కట్టినప్పటికీ ఇసుక పంపిణీ కేంద్రాల్లో గత రెండు నెలలుగా ఇసుక సరఫరా నిలిచిపోవడంతో అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా చేసి లక్షలు దండుకుంటున్నారు. ఇసుక పరివాహక ప్రాంతాలైన వినుకొండ మండలంలోని చీకటీగలపాలెం, పిట్టంబండ, గోకనకొండ, ఉమ్మడివరం, నాగులవరం, మదమంచిపాడు, కొత్తపాలెం గ్రామాలతో పాటు నూజెండ్ల మండలంలో ఐనవోలు, పువ్వాడ, ములకలూరు, ఉప్పలపాడు ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం ఇసుక సరఫరాను నిలిపివేయడంతో గృహనిర్మాణదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్ ఒకటికి రూ.5వేలు నుంచి రూ.6వేల వరకు వసూళ్లు చేస్తున్నప్పటికీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో ఇసుక అక్రమదారులు అడ్డుఅదుపు లేకుండాపోయింది. స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక అధికారి అనుమతితో ఇసుక తరలించుకునే అవకాశం పాలకులు కల్పించడంతో ఇది ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు ఇసుక పరివాహక ప్రాంతాల్లో రాత్రివేళల్లో ఎక్సకవేటర్ సాయంతో ఇసుకను బయటకు తీసి, పగటిపూట గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు చేపడుతున్నారు. పిట్టంబండకు రెండు కిలోమీటర్ల దూరంలోని గుండ్లకమ్మ పరివాహక ప్రాంతాన్ని పరిశీలిస్తే పగలు, రాత్రి తేడా లేకుండా గుండ్లకమ్మలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇసుక అక్రమ రవాణాపై ఆంధ్రజ్యోతి బుధవారం పిట్టంబండ సమీపంలోని గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాలను పరిశీలించగా డ్రైవర్లు ట్రాక్టర్లతో సహా పరారి కాగా కూలీలు క్యారేజీలను సైతం వది పరారయ్యారు. ఇప్పటికైనా యధేచ్చగా జరుగుతున్న ఇసుక అక్రమరవాణాను అడ్డుకొని సామాన్యుడికి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని గృహనిర్మాణదారులతో పాటు భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు.
Updated Date - 2022-01-13T06:20:17+05:30 IST