20వేల మందికి తప్పనిసరి బదిలీ
ABN, First Publish Date - 2022-12-15T03:14:04+05:30
రాష్ట్రంలో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు 20వేల మందికిపైగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది.
ప్రాథమికంగా గుర్తించిన పాఠశాల విద్యాశాఖ
141 మందికి సిఫారసు బదిలీలు
అవన్నీ రాయలసీమ జిల్లాల్లోనే
సాధారణ బదిలీలతోపాటే వారికీ ఆర్డర్లు
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు 20వేల మందికిపైగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. బదిలీ మార్గదర్శకాల ప్రకారం ఒక పాఠశాలలో ఐదేళ్లు పూర్తిచేసుకున్న హెచ్ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాలి. వీరంతా కచ్చితంగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. వీరితోపాటు సర్వీసుతో సంబంధం లేకుండా ఎవరైనా బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశమూ ఉండటంతో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇటీవల పదోన్నతులు పొందిన టీచర్లు కూడా కచ్చితంగా బదిలీ కావాలి. జీవో 117 ప్రకారం పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య మారిపోతుంది. దీనివల్ల భారీగా టీచర్ల సర్దుబాటు జరుగుతుంది. ఇవన్నీ కలిపితే బదిలీ కావాల్సినవారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనిపై బుధవారం విజయవాడలో ఆర్జేడీలు, డీఈవోలతో పాఠశాల విద్య కమిషనర్ సమావేశం నిర్వహించారు. బదిలీల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే బదిలీల్లో తీవ్ర జాప్యం నేపథ్యంలో ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. గతంలో సిఫారసులతో అడ్డదారి బదిలీలకు తెరతీసిన ప్రభుత్వం ఇప్పుడు సాధారణ బదిలీలతోపాటు వాటినీ చేపడుతోంది. జూలైలో సుమారు 400 మందిని అడ్డదారిలో బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. సీఎంవో స్థాయిలో జాబితా తయారుచేసింది. ఇది బయటకు పొక్కడంతో అప్పట్లోనే ఆగిపోయింది. మళ్లీ రెండు నెలల కిందట మరోసారి 200 మందిని ఇలాగే బదిలీ చేయాలని ప్రయత్నించారు. అది మళ్లీ ఆగిపోవడంతో మొత్తం బదిలీలనే ఆపేశారు. దీంతో సిఫారసు బదిలీలను విడిగా చేస్తే చెడ్డపేరు వస్తుందని భావించి సాధారణ బదిలీల్లో కలిపేశారు. 141 మందితో తాజా జాబితాను సిద్ధం చేశారు. అయితే రాయలసీమలోని ఉమ్మడి కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే మొత్తం సిఫారసు బదిలీలు జరుగుతున్నట్లు తెలిసింది. సాధారణ ప్రక్రియలాగే వీరికీ బదిలీ ఆర్డర్లు ఇవ్వబోతున్నారు. దాంతో ఏవి సాధారణ బదిలీలు? ఏవి సిఫారసు ద్వారా జరిగాయి? అనేది కనిపెట్టడం సాధ్యంకాదని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఉపాధ్యాయ సంఘాలు సిఫారసు బదిలీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
బదిలీలకు సీలింగ్ లేకుండా పాయింట్లు
ఉపాధ్యాయ బదిలీల్లో గరిష్ఠ సర్వీసు సీలింగ్ పాయింట్లను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. పనిచేసిన అన్ని సంవత్సరాలకు పాయింట్లు ఇవ్వనుంది. వెబ్సైట్లో బుధవారం ఈ మార్పులు చేసింది. ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లు దాటితే కచ్చితంగా బదిలీ కావాలి. అయితే ఒక పాఠశాలలో వారి సర్వీసు ఎమిదేళ్లు, ఐదేళ్లు దాటిపోయినా అంతవరకు మాత్రమే పాయింట్లు ఇచ్చేలా నిబంధనలు రూపొందించారు. అంటే ఒక టీచర్ ఒక పాఠశాలలో పదేళ్లు పనిచేసినా ఎనిమిదేళ్లకే పాయింట్లు ఇచ్చేలా పెట్టారు. దీనిపై ఉపాధ్యాయులు అభ్యంతరం తెలపడంతో సీలింగ్ తొలగించి, పనిచేసిన అన్ని సంవత్సరాలకూ పాయింట్లు ఇచ్చే విధానం తీసుకొచ్చారు.
Updated Date - 2022-12-15T03:14:09+05:30 IST