అంబేద్కర్ స్థానంలో జగన్ పేరా?
ABN, First Publish Date - 2022-08-17T06:38:17+05:30
విదేశీ విద్య పథకానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పేరు పెట్టుకోవడంపై దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు
విదేశీ విద్య పథకానికి పేరు మార్పుపై ఆగ్రహం
మంగళగిరిలో టీడీపీ ఎస్సీ సెల్ నేతల నిరవధిక దీక్ష
దళిత ద్రోహి జగన్‌రెడ్డి అన్న నారా లోకేశ్
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు : ఎమ్మెస్ రాజు
మంగళగిరి సిటీ, మంగళగిరి, ఆగస్టు 16: విదేశీ విద్య పథకానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పేరు పెట్టుకోవడంపై దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి వద్దు.. అంబేద్కర్ ముద్దు అంటూ మంగళగిరిలో టీడీపీ ఎస్సీ సెల్ నేతలు మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం నిరవధిక దీక్షకు దిగారు. తొలుత మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎమ్మెస్సెస్ భవన్ నుంచి టీడీపీ ఎస్సీ సెల్ నేతలు తాలూకా సెంటరులోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేశారు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు దీక్షలను ప్రారంభించి ప్రసంగించారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితుల సంక్షేమం పూర్తిగా నిర్వీర్యమైందని, 29 పథకాలను రద్దు చేశారన్నారు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అధికార అహంకారంతో అంబేద్కర్ పేరును తొలగించి.. 16 నెలలు జైలు జీవితం గడిపి, ఆర్థిక ఉగ్రవాదిగా పేరుగడించిన జగన్‌రెడ్డి తన పేరును పెట్టుకోవడం అంబేద్కర్‌ను అవమానించడమేనని తెలిపారు. నిరవధిక దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాపితంగా బుధవారం నుంచి ఆందోళనలకు దిగుతామన్నారు. టీడీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కనికళ్ల చిరంజీవి, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు యర్రగుంట్ల భాగ్యారావు, గుంటూరు పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేమూరి మైనర్‌బాబు ఆధ్వర్యంలో కంభంపాటి శిరీష, పినపాటి జీవన్‌కుమార్, పడవల మహేష్, కొప్పుల మధుబాబు, బేతపూడి సుధాకర్, మేకల అనిల్‌కుమార్, తెనాలి మాణిక్యం, నెమలికంటి అనూష దీక్షలో కూర్చొన్నారు. దీక్షకు తమ్మిశెట్టి జానకీదేవి, దామర్ల రాజు, గుత్తికొండ ధనుంజయరావు, అమరా సుబ్బారెడ్డి, కళ్లం రాజశేఖర్‌రెడ్డి, తోట పార్థసారథి, వల్లభనేని వెంకట్రావు, కేశంనేని శ్రీఅనిత, ఆరుద్ర భూలక్ష్మీ తదితరులు సంఘీభావం తెలిపారు.
దళితుల దీక్షకు లోకేశ్ సంఘీభావం
టీడీపీ ఎస్సీ సెల్ నేతల దీక్షకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంఘీభావం తెలిపారు. విదేశీ విద్య పథకానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ప్లకార్డులతో కొద్దిసేపు దీక్షలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులను ప్రోత్సహిస్తూ, అనేక అవమానాలకు గురిచేసిన జగన్‌రెడ్డి దళిత ద్రోహి అన్నారు. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపేశారు.. చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్‌ను కొట్టి చంపారు.. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడినందుకు వరప్రసాద్‌కు శిరోముండనం.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, తిరుపతిలో డాక్టర్ అనితా రాణికి వేధింపులు, పులివెందులలో దళిత మహిళ నాగమ్మపై అత్యాచారం చేసి చంపేశారు.. ఇలా ఎన్నో దురాఘతాలు చేసినా ఇంతవరకు దోషులపై చర్యలు లేవన్నారు. జగన్‌రెడ్డి అంబేద్కర్ స్మృతి వనాన్ని రద్దు చేశారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటివరకు ఒక్క లోను కూడా ఇవ్వలేదన్నారు. ఈ ఘటనలన్నీ చూస్తుంటే జగన్ మెంటలోడో.. సైకోనో అర్థం కావడంలేదని విమర్శించారు. ఇంత జరిగినా వైసీపీలోని దళిత ప్రజాప్రతినిధులు నోరుమెదపకపోవడం దారుణమన్నారు. విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరును కొనసాగించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని లోకేశ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-17T06:38:17+05:30 IST