అక్రమంగా ధాన్యం తరలించినా... నిల్వ చేసినా కఠిన చర్యలు
ABN, First Publish Date - 2022-01-13T06:29:08+05:30
జిల్లా నుంచి ధాన్యాన్ని అక్రమంగా తరలించినా, ఎక్కడైనా నిల్వ చేసినా కఠిన చర్యలు చేపడతామని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) ఏఎస్ దినేష్‌కుమార్ హెచ్చరించారు.
జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరిక
గుంటూరు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా నుంచి ధాన్యాన్ని అక్రమంగా తరలించినా, ఎక్కడైనా నిల్వ చేసినా కఠిన చర్యలు చేపడతామని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) ఏఎస్ దినేష్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లో డయల్ యువర్ జేసీ కార్యక్రమాన్ని నిర్వహించి ధాన్యం రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ సిబ్బందితో టాస్కుఫోర్సులను ఏర్పాటు చేసి చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో నమోదు కాకుండా అక్రమంగా తరలించే ధాన్యాన్ని గుర్తించి వాహనాలను సీజ్ చేస్తోన్నారని చెప్పారు. అలానే ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేసి నల్లబజారుకు తరలించే వారి పైనా క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు ఎన్ఫోర్సుమెంట్ బృందాలను నియమించామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 6,316 మంది రైతుల వద్ద నుంచి 39,920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వారికి నగదు జమ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని చెప్పారు. రైతులు ఎలాటి సమస్యలున్నా ప్రతీ బుధ, శుక్రవారాలలో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యన టోల్‌ఫ్రీ నెంబరు. 18004257452కి ఫోన్ చేసి తనతో మాట్లాడవచ్చన్నారు. మిగతా రోజుల్లో కంట్రోల్ రూం నెంబరు. 9491392717కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టీ శివరాంప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - 2022-01-13T06:29:08+05:30 IST