రౌడీ షీటర్.. దారుణ హత్య
ABN, First Publish Date - 2022-10-19T06:01:10+05:30
గుంటూరు నగరంలోని ఏటుకూరు రోడ్డు బాబు హోటల్ సమీపంలో మంగళవారం రాత్రి ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.
వెంటాడి.. వేటాడి హతమార్చిన రౌడీషీటర్లు
ఆధిపత్య పోరే కారణమా..?
గుంటూరు అక్టోబరు 18:గుంటూరు నగరంలోని ఏటుకూరు రోడ్డు బాబు హోటల్ సమీపంలో మంగళవారం రాత్రి ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నల్లచెరువు శివారు వర్కర్స్ కాలనీకి చెందిన ఏ ప్లస్ రౌడీషీటర్ దొడ్డి రమేష్(35)ను వెంటాడి, వేటాడి దారుణంగా హతమార్చారు. అతనిని రౌడీషీటర్లు అయిన బుడంపాడు రామకృష్ణ అలియాస్ ఆర్‌కె, శ్రీనివాసరావు తోటకి చెందిన కలపాల ప్రతాప్‌లు హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఈ హత్యకు సంబంధించి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వర్కర్స్ కాలనీకి చెందిన దొడ్డి రమేష్ కొద్ది సంవత్సరాల క్రితం చాకలిగుంటలో జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటాడు. గతంలో అరండల్‌పేట 12లైన్ లో జరిగీన రౌడీషీటర్ బసవల వాసు హత్య కేసులో నిందితులైన రామకృష్ణ, చెకోడీల సతీష్‌తో కలిసి కొంతకాలం తిరిగాడు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో పాటు రామకృష్ణ ముఠా కార్యకలాపాలను రమేష్ లీక్ చేస్తున్నాడని వారు అనుమానిస్తూ వచ్చారు. వారం కిందట రమేష్ భార్యకు ఫోన్ చేసి నీ భర్తను చంపేస్తామంటూ బెదిరించారు. ఇదిలా ఉంటే రమేష్ మంగళవారం రాత్రి బాబు హోటల్ సందులో నుంచి ఏటుకూరు రోడ్‌లోకి వచ్చాడు. అయితే అప్పటికే అతని కదలికలను గమనిస్తూ వేచి ఉన్న రామకృష్ణ, ప్రతాప్ కత్తులతో ఎటాక్ చేశారు. ప్రాణభయంతో సమీపంలో ఉన్న కిరాణ దుకాణంలోకి పరుగెత్తాడు. నిందితులు వదలకుండా కిరాణా షాప్‌లోకి వెళ్లి రమేష్‌ను విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకొని అక్కడి వచ్చిన హతుడి భార్య, తల్లి బోరున విలపించారు.
సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య జరిగిన తీరును అధికారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. హతుడి భార్యతో మాట్లాడి వివరాలు ేసకరించారు. తన భర్త హత్యకు రామకృష్ణ, ప్రతాప్‌తో పాటు చెకోడీల సతీష్, భార్గవ్ అన్న తదితరుల ప్రమేయం ఉన్నట్లు హతుడి భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో లాలాపేట సీఐ ప్రభాకర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
Updated Date - 2022-10-19T06:01:10+05:30 IST