తెనాలి రైల్వేస్టేషన్ భళా
ABN, First Publish Date - 2022-12-15T00:55:14+05:30
విద్యుత్‌ని పొదుపుగా వినియోగించడంలో తెనాలి రైల్వేస్టేషన్ జాతీయ అవార్డుని అందుకున్నది.
విద్యుత్ పొదుపులో జాతీయ స్థాయి అవార్డు
రవాణ/రైల్వేస్టేషన్ సెక్టార్‌లో మెరిట్ సర్టిఫికేట్ ప్రదానం
గుంటూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ని పొదుపుగా వినియోగించడంలో తెనాలి రైల్వేస్టేషన్ జాతీయ అవార్డుని అందుకున్నది. ఏటా డిసెంబరు 14న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ విద్యుత్ పొదుపు దినోత్సవం సందర్భంగా ఇచ్చే అవార్డులలో తెనాలి రైల్వేస్టేషన్‌కి మెరిట్ సర్టిఫికెట్ లభించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెనాలి రైల్వేస్టేషన్ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. మున్ముందు కూడా ఇదే రీతిలో విద్యుత్‌శక్తిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఈ దఫా ప్రథమ బహుమతి సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ని పొదుపుగా వినియోగించడంపై రైల్వే శాఖ కొన్నేళ్లుగా చర్యలు చేపడుతుంది. విద్యుత్ పొదుపు చర్యలతో పాటు ప్లాట్‌ఫాం రూఫ్‌లపై సోలార్ ఎనర్జీ యూనిట్లను ఏర్పాటు చేసింది. అలానే వాటర్ కూలర్స్, రోలింగ్ ఎగ్జామినేషన్ లైట్లకు టైమర్లను అమర్చింది. రైళ్లు తిరగని సమయాల్లో 70 శాతం ఫ్యాన్లు స్విచ్ ఆప్ అయ్యే వ్యవస్థని ఏర్పాటు చేసింది. అలానే రైళ్ల రాకపోకలు లేని సమయంలో లిఫ్టులను స్విచ్ ఆఫ్ చేస్తోన్నారు. విద్యుత్‌ని పొదుపుగా వినియోగించే పంపులను ఉపయోగిస్తున్నారు. సంప్రదాయ ఫ్యాన్ రెగ్యులేటర్లని తొలగించి ఎలకా్ట్రనిక్ రెగ్యులేటర్లను అమర్చారు. గుంటూరు రైల్వే డివిజన్ కూడా పెద్దఎత్తున సౌరశక్తిని వినియోగించడంపై దృష్టి సారించింది. గుంటూరు రైల్వేస్టేషన్ బిల్డింగ్‌పై పెద్దఎత్తున సోలార్ ప్యానెల్స్‌ని అమర్చి సోలార్ పవర్‌ని వినియోగిస్తోన్నది. అలానే రైల్‌వికాస్ భవన్‌లోనూ సోలార్‌పవర్ వాడకానికి చొరవ చూపిస్తోన్నది. అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు రాకపోవడంపై డివిజనల్ రైల్వేవర్గాలు కొంత నిరాశకు గురౌతున్నాయి.
Updated Date - 2022-12-15T00:55:17+05:30 IST