ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోధనకు దూరం.. విద్యార్థులకు శాపం

ABN, First Publish Date - 2022-06-08T05:22:58+05:30

అసలే ఉపాధ్యాయుల కొరత.. ఆపై ఉన్న వారికేమో బోధనేతర విధులు.. రెండేళ్ల తర్వాత మారిన విధానంలో పరీక్షల నిర్వహణ.. మొత్తం మీద పదో తరగతి విద్యార్థుల పాలిట శాపంలా మారింది. ఉన్న ఉపాధ్యాయుల్ని అసలు పని చేయనీయకుండా వారికి అదనపు విధులు కేటాయించడంతో వారు బోధనకు దూరమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




పది ఫలితాలు తగ్గడానికి ఎన్నో కారణాలు  

బోధనేతర విధుల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు

ఉమ్మడి జిల్లాలో 18,769 మంది విద్యార్థుల ఫెయిల్‌ 


గుంటూరు(విద్య), జూన్‌ 7: అసలే ఉపాధ్యాయుల కొరత.. ఆపై ఉన్న వారికేమో బోధనేతర విధులు.. రెండేళ్ల తర్వాత మారిన విధానంలో పరీక్షల నిర్వహణ.. మొత్తం మీద పదో తరగతి విద్యార్థుల పాలిట శాపంలా మారింది.  ఉన్న ఉపాధ్యాయుల్ని అసలు పని చేయనీయకుండా వారికి అదనపు విధులు కేటాయించడంతో వారు బోధనకు దూరమయ్యారు. ఇక పాఠశాల, ఉపాధ్యాయులు, విద్యార్థులను పర్యవేక్షించాల్సిన  ప్రధానోనాధ్యాయుడు అసలు పని మానుకోవాల్సి వచ్చింది. పాఠశాలకు ప్రధానమైన ఉపాధ్యాయుడు మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ చూడటం, వాటి ఫొటోలు అప్‌లోడు చేయడంలో బిజీగా గడపాల్సి వచ్చింది. ఇలా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నచందంగా పదో తరగతి విద్యార్థుల పరిస్థితి మారింది. కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్లుగా పది పరీక్షలు నిర్వహించకుండా అందర్నీ పాస్‌ చేస్తూ వచ్చారు. మూడో సంవత్సరం వచ్చే సరికి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పది పరీక్షలకు ఉమ్మడి జిల్లా(గుంటూరు, బాపట్ల, పల్నాడు) నుంచి 59,023 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 40,254 మంది(68.29శాతం) ఉత్తీర్ణత సాధించగా, 18,769 మంది ఫెయిల్‌ అయ్యారు. ఈ స్థాయిలో ఫెయిల్‌ కావడం గతంలో ఎన్నడూ జరగలేదు. 


విద్యార్థుల్లో చైతన్యం కరువు

పదో తరగతి పరీక్షలకు బిట్‌ పేపర్‌తో కూడా 11 పేపర్లు ఉండేవి. అయితే ఈ ఏడాది వీటి స్థానంలో 6 పేపర్ల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిలో బిట్‌ పేపర్‌ కూడా లేదు. ఇంటర్నల్‌ మార్కులు లేవు. దీనికి తోడు 8, 9 తరగతుల్లో పరీక్షలు రాయకుండానే పదిలోకి వచ్చిన విద్యార్థులకు కనీసం పునశ్చరణ తరగతులు కూడా నిర్వహించలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర గందరగోళ పరిస్థితిలో పడ్డారు. మరోవైపు విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేలా రెమిడియల్‌ తరగతుల్ని నిర్వహించకుండా నిర్లక్ష్యం చేశారు. 


యాప్‌ల పర్యవేక్షణలో ఉపాధ్యాయులు 

పాఠశాల విద్యాశాఖలో యాప్స్‌ విధానం గతంలో ఎప్పుడూ లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల వారీగా మరుగుదొడ్లకు ఒక యాప్‌, మధ్యాహ్న భోజనానికి ఒక యాప్‌, విద్యాకానుకు ఒక యాప్‌, పుస్తకాలకు ఒక యాప్‌, హాజరు కోసం మరొక యాప్‌ ఇలా ప్రతిదానికి యాప్‌లే. వాటిల్లో డేటా అప్‌లోడ్‌ చేయడానికే ఉపాధ్యాయుల సమయం సరిపోయేది. దీనికి తోడు ఆన్‌లైన్‌ వర్కుల పేరుతో ఉపాధ్యాయుల్ని బోధనకు మరింత దూరం చేశారు. ఫలితంగా వారు తీవ్ర ఒత్తిడికి గురౌతూ పది విద్యార్ధులకు బోధన అందించాల్సిన పరిస్థితి నెలకొంది. పల్నాడు వంటి ప్రాంతాల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని ఉపాధ్యాయ సంఘాలు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక మండలాల్లో  పూర్తిస్థాయిలో ఎంఈవోలు లేరు. 


విద్యార్థులపై లోపించిన శ్రద్ధ 

విద్యార్థులకు గత ప్రభుత్వ హయంలో ఏటా జడ్పీ నిధుల నుంచి స్టడీ మెటీరియల్‌ ఇచ్చే వారు.  ఉపాధ్యాయులు కూడా ఉదయం, సాయంత్రం ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి బోధనతో పాటు పోషణ కోసం ప్రత్యేక పదార్థాలు అందజేసేవారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతల సహకారంతో మెటీరియల్‌, ఆహారం తదితరాలు అందజేసేవారు. అయితే ఈ ఏడాది ఇలాంటి అంశాల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అదనపు విధులతో విసిగిపోయి పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించలేక పోయారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఉదయం సాయంత్రం అల్పాహరంగా ఇడ్లీ, వడ, గుగ్గిళ్ళు ఇలా ఏదో ఒకటి అందించేవారు. ఈ ప్రభుత్వం అది కూడా చేయలేదు. పాఠశాల విద్యకు కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పడం తప్ప పది విద్యార్థులకు కనీసం పరీక్షల సమయంలో కూడా అల్పాహారం, స్టడీ మెటిరియల్‌ అందించలేదు. కాలే కడుపులతోనే విద్యార్థులు స్టడీ అవర్స్‌కు హాజరుకావాల్సి వచ్చింది. మారిన సిలబస్‌పై విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడంపై విద్యాశాఖాధికారులు దృష్టి సారించలేదు. ఇలా అనేక అంశాలు పది ఫలితాలపై పడ్డాయని ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

Updated Date - 2022-06-08T05:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising