శ్రీవారి హుండీలో విదేశీ కాసుల గలగల!
ABN, First Publish Date - 2022-12-15T03:16:45+05:30
తిరుమల శ్రీవారి హుండీ విదేశీ భక్తులు సమర్పించిన కరెన్సీ, నాణేలతో గలగలలాడుతోంది. కరోనా అనంతరం ప్రపంచం నలుమూలల నుంచి స్వామి దర్శనానికి భక్తులు వెల్లువెత్తుతున్నారు. ఏ
15 దేశాల నాణేలు గుర్తించిన అధికారులు
వాటి వేలం ద్వారా టీటీడీకి రూ.1.31 కోట్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
తిరుమల శ్రీవారి హుండీ విదేశీ భక్తులు సమర్పించిన కరెన్సీ, నాణేలతో గలగలలాడుతోంది. కరోనా అనంతరం ప్రపంచం నలుమూలల నుంచి స్వామి దర్శనానికి భక్తులు వెల్లువెత్తుతున్నారు. ఏటా దాదాపు 2.5 కోట్ల మంది దేశ, విదేశాల నుంచి తిరుమలకు తరలివచ్చి వేంకటేశ్వరుడిని సేవిస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో వీరి సంఖ్య రెట్టింపు అవుతుంది. గరుడ వాహన సేవ రోజున లక్షలాది మందితో కొండ కిటకిటలాడుతుంది. ఒకవైపు పెద్దసంఖ్యలో భక్తులు సందర్శించే క్షేత్రంగా గుర్తింపుతో పాటు అత్యధిక ఆదాయం ఆర్జించే ఆలయాల జాబితాలోనూ తిరుమలదే అగ్రస్థానం. దేశంలో ఏ ఆలయానికీ లేనివిధంగా ఇటీవల తిరుమల మరో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కరెన్సీ శ్రీవారి హుండీలో ప్రత్యక్షమవుతోంది. గతంలో దేశ సరిహద్దుల్లో ఉన్న దేశాల కరెన్సీ మాత్రమే హుండీల్లో కనిపించేవి. కానీ ప్రస్తుతం ముస్లిం దేశాలతో పాటు క్రైస్తవ దేశాల నాణేలు కూడా వస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే తిరుమలకు అంతర్జాతీయంగా భక్తుల తాకిడి పెరుగుతోందన్న విషయం అర్థమవుతోంది. టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం... స్వామివారి హుండీ లెక్కింపులో భాగంగా 15 దేశాలకు చెందిన నాణేలను అధికారులు గుర్తించారు. ఈ నాణేల అమ్మకానికి అధికారులు ఇటీవల టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. తొలుత ఏడు దేశాలకు (బ్రిటన్, యూరో, కువైత్, థాయిలాండ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్) చెందిన నాణేలకు టెండర్లు పిలవగా రూ.1,14,85,814, మిగిలిన 8 దేశాల (శ్రీలంక, ఒమాన్, నేపాల్, చైనా, ఖతర్, దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్)కు చెందిన నాణేలు రూ.16,34,326 ధర పలికాయి. మొత్తంగా 15 దేశాలకు చెందిన కరెన్సీకి టెండర్ల ద్వారా టీటీడీకి రూ.1.31 కోట్ల ఆదాయం లభించింది. టెండర్లలో పాల్గొని హెచ్1గా ఎంపికైన కంపెనీలకు వాటిని అధికారులు అప్పగించారు.
Updated Date - 2022-12-15T03:16:46+05:30 IST