జలం.. ఎన్నాళ్లీ జాప్యం
ABN, First Publish Date - 2022-03-05T06:47:06+05:30
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. అం దులోభాగంగా అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా సర్వే చేపట్టింది.
- జిల్లాలో కదలని ఇంటింటికి కుళాయి పనులు
- నిధుల్లేక, కాంట్రాక్టర్లు ముందుకు రాక ఎక్కడి పనులు అక్కడే
- గతంలో 1,107 పనులకు టెండర్లు ఖరారైనా ఇంకా పూర్తికాని దుస్థితి
- కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ ద్వారా ఎప్పుడో నిధుల మంజూరు
- రాష్ట్రం వాటా యాభై శాతం నిధుల కొరతతో పనుల్లో తీవ్ర జాప్యం
- తాజాగా 9 నియోజకవర్గాల పరిధిలో రూ.46 కోట్లతో పనులకు టెండర్లు
- తీరా ప్రభుత్వంపై నమ్మకంలేక ఈ పనులకు కాంట్రాక్టర్ల రాకపై డౌటే
- జిల్లాలో 3,009 గ్రామాల్లో రూ.1203 కోట్లతో కుళాయిల ఏర్పాటుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రణాళిక
జిల్లాలో ఇంటింటికి కుళాయిల బిగింపు ప్రక్రియకు గ్రహణం పట్టింది. కేంద్రం నుంచి నిధుల లభ్యతకు ఇబ్బంది లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బులు రాక పనులు ఎక్కడివక్కడే అన్నట్టు ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన పనులకు సకాలంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ససేమిరా అంటున్నారు. దీంతో 2024 నాటికి జిల్లాలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా మంచినీరు ఇవ్వాలనే లక్ష్యం సాకారం అయ్యేలా కనిపించడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో 8.46 లక్షల ఇళ్లకు కుళాయిలు బిగించేందుకు రూ.1203 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. తీరా వైసీపీ అధికారంలోకి రావడంతో పనులన్నీ రెండున్నరేళ్లుగా పడకేశాయి. జలజీవన్ మిషన్ కింద కేంద్రం, రాష్ట్రం చెరి సగం నిధులు ఇందుకు వెచ్చించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో పథకాన్ని పట్టించుకోవడం మానేసింది. కేంద్రం ఒత్తిడితో గతేడాది కొన్ని పనులకు టెండర్లు ఖరారైనా అవింకా పూర్తికాలేదు. మళ్లీ కొత్తగా 9 నియోజకవర్గాల్లో ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. అం దులోభాగంగా అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా సర్వే చేపట్టింది. మొత్తం 3,466 గ్రామాల్లో ఇంటింటికి కుళాయి ద్వారా నీటి సరఫరా చేయడానికి రూ. 1203 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇందుకయ్యే మొత్తం ఖర్చులో చెరి సగం కేంద్ర, రాష్ట్రాలు భరించాలని అప్పట్లో నిర్ణయించాయి. తీరా వైసీపీ అధికారంలోకి రావడంతో పథకం జిల్లాలో పడకేసింది. నిధుల కొరతతో పను లు పట్టించుకోవడం మానేసింది. అయితే కేంద్రం నుంచి 50 శాతం నిధులు మంజూరవడంతో చేసేదిలేక రాష్ట్రం కూడా తన వాటా విడుదల కలిపి మొత్తం రూ.779 కోట్లు విడుదల చేస్తున్నట్టు 2020 అక్టోబరు 10న మొక్కుబడి జీవో జారీచేసింది. కానీ తన వాటా నిధులు కాదుకదా కేంద్ర నిధులు సైతం దారి మళ్లించేసింది. దీంతో పనులు మొదలవలేదు. అయితే కేంద్రం నుంచి ఒత్తిడి పెరగడం, టెండర్లలో జాప్యంతో గతేడాది అతికష్టంపై కొన్ని పనులకు టెండర్లు ఆహ్వానించింది. కాంట్రాక్టర్లు రారనే భయంతో రూ.5 లక్షలలోపు 523 పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించింది. ఆ తర్వాత రూ.5 లక్షలకుపైగా విలువున్న 2,486 పనుల్లో తొలివిడతలో రూ.350 కోట్ల విలువైన 1,107 పనులకు టెండర్లు పిలిచారు. ఇప్పటికీ నెలలు దాటుతున్నా కేవలం 35 పనులే పూర్తయ్యాయి. ఇంకా 1,056 పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియ ని దుస్థితి. వీటికి బిల్లుల సమస్య ఉండడంతో ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఓవర్హెడ్ ట్యాంకులు బిగించడం పైపులైన్ల ఏర్పాటు అనేకచోట్ల నిలిచిపోయింది. పేరుకు నిధులు విడుదలైనట్టు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా ట్రెజరీ నుంచి బిల్లులు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ పనులు ఇప్పట్లో పూర్తయ్యే లా కనిపించడం లేదు. ఇంకొన్ని వర్కులకైతే అసలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కాంట్రాక్టర్లు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ప్రభుత్వం వ్యూహం మార్చి ఇంకా టెండర్లే పిలవని రూ.215 కోట్ల కుళాయి పనులన్నీ కలిపి పెద్ద పనుల కింద అమరావతి స్థాయిలో టెండర్లు పిలవాలని ఇటీవల నిర్ణయించింది. వీటినే నియోజకవర్గాల ప్యాకేజీ అంటూ పేరు పెట్టింది. ఈనేపథ్యంలో తాజాగా జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో రూ.46 కోట్లతో వివిధ పనులకు టెండర్లు పిలిచింది. పెద్దాపురం నియోజకవర్గంలో 15 గ్రామాలకు రూ.5.70 కోట్లు, మండపేట నియోజకవర్గంలో 30 గ్రామాల్లో ఇంటింటి కుళాయిలకు రూ.11.04 కోట్లు, రాజానగరం నియోజకవర్గంలో 15 గ్రామాలకు రూ. 6.38 కోట్లు, రంపచోడవరం నియోజకవర్గంలో 42 గ్రామాలకు రూ.4.37 కోట్లు, జగ్గంపేట నియోజవర్గానికి రూ.4.02 కోట్లు, తునిలో 6 గ్రామాలకు రూ.3.09 కోట్లు, కొత్తపేట రూ.2.57 కోట్లు, రావులపాలెం రూ.2.53 కోట్లు, పెదపూడికి రూ.2.29 కోట్లు, కాజులూరు రూ.2.19 కోట్లు, అనపర్తి రూ.1.82కోట్లు చొప్పున మంజూరుచేస్తూ ఆర్డబ్ల్యూఎస్ సీఈ టెండర్లు ఆహ్వానించారు. అయితే అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుండడంతో అసలు ఏ శాఖ టెండర్కూ కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. దీంతో జలజీవన్ మిషన్ పనుల విషయంలోనూ కాంట్రాక్టర్లు స్పందించరనే అనుమానం అధికారులను వేధిస్తోంది.
Updated Date - 2022-03-05T06:47:06+05:30 IST