పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ABN, First Publish Date - 2022-11-09T23:56:44+05:30
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరు ప్లైవోవర్ వద్ద ఒక గుడ్స్ రైలు బుధవారం తెల్లవారుజామున 3గంటలకు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు కార్ల లోడుతో వెళ్తున్న గుడ్స్ రైలు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ దాటి ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై పయనిస్తుండగా పట్టాలు తప్పింది.
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 9 : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరు ప్లైవోవర్ వద్ద ఒక గుడ్స్ రైలు బుధవారం తెల్లవారుజామున 3గంటలకు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు కార్ల లోడుతో వెళ్తున్న గుడ్స్ రైలు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ దాటి ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై పయనిస్తుండగా పట్టాలు తప్పింది. దీంతో ఆ రైలులో కోచ్ అడ్డంగా రైలు ట్రాక్ పైకి ఎక్కేసింది. మొత్తం లైన్లకు అడ్డంగా పడింది. అయితే ఆ సమయంలో అటుగా మరొక ట్రాక్ పై ఎటువంటి రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్ సమాచారం మేరకు రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ట్రాక్‌లో వస్తున్న రైళ్లను నిలుపుదల చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. గుడ్స్ రైలు పట్టాలు తప్పి అడ్డంగా తిరిగి మిగిలిన ట్రాక్‌లపైకి ఎక్కివేయడంతో రాజమహేంద్రవరం, సామర్లకోట జంక్షన్ల మీదుగా వెళ్లే రైళ్లు అన్ని నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి మొదలుకుని మద్రాసు వరకు వెళ్లే రైళ్లకు, అలాగే ఉత్తర భారతదేశం ప్రఽధాన నగరాలకు వెళ్లే రైళ్ళకు ఇదే మార్గం కావడంతో ఇటుగా వెళ్ళే రైళ్లన్నీ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే డివిజనల్ మేనేజర్ శివేంద్ర మోహన్ ఆదేశాలతో అఫీషియల్ ఇంజనీరింగ్ ఆపరేటింగ్ పనులు చేపట్టారు. మెకానికల్ రైలు, 140 టన్స్ భారీ క్రేన్లు తదితర భారీ పరికరాలతో సుమారు ఏడు గంటల పాటు కష్టపడి ఆ గుడ్స్ రైలును చివరి ట్రాక్ మీదకు తీసుకువచ్చారు. అయితే సుమారు ఏడు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా ఆరు రైళ్లను రద్దుచేశారు. రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ల రెండేసి సర్వీసులను రైల్వేశాఖ రద్దు చేసింది. రైల్వే మెకానికల్ విభాగం సుమారు పది గంటల పాటు శ్రమించి పట్టాలు తప్పిన గుడ్స్ రైలును పక్కకు తీశారు. పనులు త్వరితగతిన పూర్తి చేశారు.గుడ్స్ రైలు పట్టాలు తప్పడం రాజమహేంద్రవరంలో ఇదే ప్రథమం. గతంలో స్ర్పింగ్ సమస్యలు, పట్టాల మధ్య గ్యాప్‌లు, పట్టాలు విరగడం వంటి వాటిని సిబ్బంది ముందుగానే గుర్తించి ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడ్డారు. అయితే గుడ్స్ కోచ్ వీల్స్‌లో ఏదైనా సమస్య ఉండి పట్టాలు తప్పిందా లేక ట్రాక్ గ్యాప్‌లు వల్ల జరిగిందా అనేదానిపై విచారణ జరుగుతుంది. రైలు పట్టాలు తప్పిన సమాచారం తెలియడంతో జనం ప్రమాదస్థలికి చేరుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ పట్టాలపై మరమ్మతు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రాక్ జనసమర్థానికి దగ్గర ఉండడంతో రైలు మొత్తం పట్టాలు తప్పి ఉంటే పెనుప్రమాదమే జరిగేది. అయితే ట్రాక్‌పై అడ్డంగా పడిపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఈ గుడ్స్ రైలు చెన్నై నుంచి కోల్‌కతాకు కార్ల లోడుతో వెళుతున్నట్టు సమాచారం. రైలు ప్రమాదం నేపథ్యంలో విజయవాడ నుంచి విశాఖపట్నం.. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రైళ్లన్నీ ఆలస్యంగా నడిచాయి. పలు రైళ్లను స్టేషన్లలో నిలుపుదల చేసి ఉంచారు. ట్రాక్‌పై మరమ్మతులు పూర్తయిన తర్వాత ఒక్కొక్కటిగా వదిలారు. బోగి పట్టాలు తప్పిన నేపథ్యంలో రైలు ప్రయాణ భద్రతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. గుడ్స్ రైలు కాబట్టి ఎటువంటి ప్రమాదం లేకుండానే పోయింది. అదే మామూలు రైలు అయితే పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - 2022-11-09T23:56:46+05:30 IST