పోతులూరు నుంచి పులి స్థావరం మార్పు
ABN, First Publish Date - 2022-06-02T05:35:01+05:30
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు కొండ, పొలాల నుంచి పెద్దపులి జంప్ అయింది. గత వారం రోజులుగా పోతులూరు, పరిసర గ్రామ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన పెద్దపులి ఒక్కసారిగా ఇక్కడ నుంచి తరలిపోయింది.
పాండవులపాలెంలో కాలి ముద్రలు గుర్తింపు
ప్రత్తిపాడు,
జూన్ 1: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు కొండ, పొలాల నుంచి
పెద్దపులి జంప్ అయింది. గత వారం రోజులుగా పోతులూరు, పరిసర గ్రామ ప్రజలను
తీవ్ర భయాందోళనకు గురి చేసిన పెద్దపులి ఒక్కసారిగా ఇక్కడ నుంచి
తరలిపోయింది. పోతులూరుకు 6 కిలోమీటర్ల దూరంలో పాండవులపాలెంలో పెద్దపులి
అడుగు జాడలు కనిపించడంతో అటవీ అధికారులు తమ క్యాంపును పాండవులపాలెం ఆశ్రమ
పాఠశాలకు మార్చారు. 2,3 రోజుల్లో కేంద్ర పులి సంరక్షణ సంస్థ నుంచి ఆదేశాలు
వచ్చిన వెంటనే పులిని బంధించవచ్చని ఎదురుచూస్తున్న తరుణంలో ఒక్కసారిగా
పోతులూరు నుంచి పులి జంప్ కావడం అటవీశాఖాధికారులను కూడా ఆశ్చర్యానికి గురి
చేసింది. పాండవుల పాలెం చెరువు వద్ద పులి అడుగులు కనిపించాయి. పులి
పాదముద్రలు స్పష్టంగా చెరువు వద్ద కనిపించడంతో అటవీ అధికారులు జంతు
సంరక్షణా సిబ్బంది పాండవుల పాలెం, పరిసర గ్రామాల్లో మోహరించారు. పులి ఆచూకీ
కోసం బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పాండవుల పాలెం చెరువు, పొదురుపాక,
భౌరువాక మార్గాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ మార్గాల్లో పులి ఆచూకీ
కోసం సీసీ కెమెరాల ఏర్పాటు పనులు చేపట్టారు. పాండవుల పాలెం పరిసర గ్రామాల
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాజమండ్రి సీసీఎఫ్ శరవణ్,
జిల్లా ఫారెస్ట్ అధికారి ఐకేవీ రాజు, రాజమండ్రి వైల్డ్ డీఎఫ్‌వో సెల్వం,
సబ్ డీఎ్‌ఫవో సౌజన్య, ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్, వైల్డ్
లైఫ్ ఫారెస్ట్ రేంజర్ వరప్రసాద్, డీఆర్వో రామకృష్ణ, శంఖవరం ఫారెస్ట్
అధికారి రవిశంకర్ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఇక్కడకు రిజర్వ్
ఫారెస్ట్ దగ్గరలో ఉండటం వల్ల అటువైపు వెళ్ళి ఉండవచ్చనే యోచనలో ఉన్నారు.
అయితే ముందు జాగ్రత్త చర్యగా పాండవుల పాలెం, పొదురుపాక, భౌరువాక,
కిత్తమూరుపేట, పెద్దిపాలెం,శరభవరం, ఒమ్మంగి పరిసర గ్రామాల ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని కరపత్రాలు పంపిణీ చేశారు.
ఎస్ కోట నుంచి వచ్చిందా...!
ప్రత్తిపాడు
మండలంలో సంచరించే పెద్దపులి బెంగాల్ టైగర్‌గా ఉండడంతో అది విజయనగరం
జిల్లా ఎస్ కోట నుంచి వచ్చిందా అనే అనుమానాలకు తావిస్తోంది. 5
సంవత్సరాలు వయస్సు కలిగిన ఈ టైగర్ బెంగాల్ టైగర్‌గానే భావిస్తున్నారు. గత
ఏప్రిల్ నెలాఖరులో నర్సీపట్నం రిజర్వ్ ఫారె్‌స్టకు చేరుకుని నాతవరం
మండల గ్రామాల మీదుగా సబ్‌ప్లాన్ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినట్లు
భావిస్తున్నారు. నర్సీపట్నం అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న గ్రామాల్లో కూడా
పశువులను చంపినట్లు చెబుతున్నారు.
లేగ దూడను చంపేసింది
పొదురుపాక
పంట పొలాల్లో బుధవారం సాయంత్రం పులి లేగదూ డను చంపేసింది. పొలాల నుంచి
బయటకు వస్తున్న పశువుల మందపై పులి దాడి చేయడంతో ఒక్కసారిగా పశువులు
చెల్లాచెదురుగా వెళ్లి పోయాయి. ఈ క్రమంలో పాడిగేదెకు చెందిన రెం డు
లేగదూడలు పులికి చిక్కగా వాటిలో ఒక దూ డను చంపి తిన్నట్లు తెలుస్తుంది.
దీనిపై ఒమ్మంగి, పొదురుపాక పరిసర గ్రామాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
దీనిపై ఫారెస్ట్ అధికారులను సంప్రదించగా లేగదూడపై దాడి జరిగినట్లు సమాచారం
తెలిసిందని, అయితే మిగిలిన పశువుల పరిస్థితి ఉదయం తెలుస్తుందని తెలిపారు.
Updated Date - 2022-06-02T05:35:01+05:30 IST