ఆలయ నిర్మాణం నగదు జమపై మాజీ ఎంపీపీ, ఎమ్మెల్యే వేగుళ్ల మధ్య వాగ్వాదం
ABN, First Publish Date - 2022-12-15T00:24:09+05:30
నదురుబాదలో బుధవారం అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భూమి పూజ చేశారు.
రాయవరం, డిసెంబరు 14: నదురుబాదలో బుధవారం అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన సభలో వైసీపీ నేత సిరిపురపు, ఎమ్మెల్యే వేగుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం పునఃనిర్మాణానికి సంబంధించి చర్చ జరిగింది. ఒక వర్గం వద్ద ఉన్న రూ.5లక్షలు ఇప్పటికే ఈవో ఖాతాలో జమచేయగా రెండో వర్గం వద్ద ఉన్న సొమ్మును జమచేయాలని వైసీపీ వర్గం కోరింది. దీనితో మాజీ ఎంపీపీ సిరిపురపు ఆలయానికి సంబంధించిన రూ.5లక్షలు ఎమ్మెల్యే వేగుళ్ల తన రైస్‌మిల్లు వ్యాపారంలో పెట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దీటుగా బదులిస్తూ తన వ్యక్తిత్వం తెలుసుకుని మాట్లాడాలని అర్ధరహిత వ్యాఖ్యలు మానుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈనేపథ్యంలో అక్కడే ఉన్న ఎస్‌ఐ సురేష్, పోలీసులు మాజీ ఎంపీపీని దూరంగా తీసుకువెళ్లారు. ఈనేపథ్యంలో ఆలయ నిర్మాణానికి సంబంధించి రెండు వర్గాల నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సూచించడంతో వివాదం సద్దుమణిగింది.
Updated Date - 2022-12-15T00:24:11+05:30 IST