తెరమీదకు మళ్లీ రోప్‌వే రూటు
ABN, First Publish Date - 2022-03-05T06:52:59+05:30
చుట్టూ ఎత్తైన గిరులు, మధ్యలో హోయలొలికే పంపా నది అందాలు.. వీటిని కొండ కింద నుంచి తిలకిస్తేనే భక్తులు ఎంతో ఆహ్లాదానికి లోనవుతుంటారు.
- కేంద్ర టూరిజానికి రాష్ట్రం ప్రతిపాదనలు.. త్వరలో కీలక ప్రకటన?
అన్నవరం, మార్చి 4: చుట్టూ ఎత్తైన గిరులు, మధ్యలో హోయలొలికే పంపా నది అందాలు.. వీటిని కొండ కింద నుంచి తిలకిస్తేనే భక్తులు ఎంతో ఆహ్లాదానికి లోనవుతుంటారు. అదే ఈ అందాలను రోప్‌వే ద్వారా ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే మాటలకందని ఆనందం పొందొచ్చు. ఇటువంటి సౌక ర్యం ద్వారా భక్తులు తిలకించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్ స్కీం నిధుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ లభించగా, తాజాగా మరో ప్రాజెక్టు ద్వారా అన్నవరంలో రోప్‌వే ఏర్పాటుకు రాష్ట్ర టూరిజం శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. దీనిని ఎక్కడ్నించి ఎక్కడికి ఏర్పాటుచేయాలనే దానిపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రధానంగా సత్యగిరి కొండ నుంచి పంపా అందాలు తిలకించేవిధంగా ఆలోచన చేస్తున్నారు. 800 మీటర్ల మేర రోప్‌వే ఏర్పాటుకు సుమారు 3.5 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్ర టూరిజం శాఖ పంపింది. త్వరలో దీనిపై కీలక ప్రకటన విడుదలవుతుందని రాష్ట్ర టూరి జం శాఖ అధికారులు పేర్కొన్నారు. రెండు దశాబ్దాల కిందటే రోప్‌వే ప్రతిపాదన ప్రవేశపెట్టగా అవి బుట్టదాఖలయ్యాయి. మళ్లీ తాజా ప్రతిపాదనతోపాటు దీనికి త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందనే సమాచారం ఆశలు పెంచింది.
Updated Date - 2022-03-05T06:52:59+05:30 IST