రబీసాగులోకి..
ABN, First Publish Date - 2022-12-16T00:55:46+05:30
జిల్లా రైతాంగం రబీ సాగులో బిజీ అయ్యింది. ఓపక్క ఖరీఫ్ ధాన్యం విక్రయాలు సాగుతుండగానే, సమయం మించిపోతుండడంతో రైతులు రబీ సాగు పనులు ముమ్మరంగా చేపట్టారు. ఇప్పటిదాకా సగం వరకు నారుమడులు సిద్ధమైనట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈసారి కేరళ రాష్ట్రం బొండాలు రకం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిచూపడంతో ఆయా రకాల సాగుకే సమాయత్తం అవుతున్నారు.
జిల్లా రైతాంగం రబీ సాగులో బిజీ అయ్యింది. ఓపక్క ఖరీఫ్ ధాన్యం విక్రయాలు సాగుతుండగానే, సమయం మించిపోతుండడంతో రైతులు రబీ సాగు పనులు ముమ్మరంగా చేపట్టారు. ఇప్పటిదాకా సగం వరకు నారుమడులు సిద్ధమైనట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈసారి కేరళ రాష్ట్రం బొండాలు రకం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిచూపడంతో ఆయా రకాల సాగుకే సమాయత్తం అవుతున్నారు. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం బొండాలు రకం కొనుగోలు చేయవద్దని, ఒకవేళ పండించినా కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని హెచ్చరించింది. గత ఏడాది కూడా బొండాలు రకానికి మంచి డిమాండు కూడా ఏర్పడింది. ఈసారి అదే రకాల సాగుకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మండపేట, డిసెంబరు 15: జిల్లాలో రబీ వ్యవ సాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు వరి నారుమడుల కోసం దమ్ములు చేసుకుని విత్త నాలు జల్లడం ప్రారంభించారు. ఈ సీజన్లో జిల్లా మొత్తం మీద 1,93,200 ఎకరాల్లో వరి సాగు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేసుకుంది. 40 శాతం మంది రైతులు ఊడ్పులు ఊడుస్తుండగా, 60 శాతం మంది వెదజల్లు విధానంపై మక్కువ చూపుతున్నారు. రామచంద్రపురం డివిజన్‌లో పనులు ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలని వ్యవ సాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వరి కోతలతో పాటు ధాన్యం విక్రయాలు పూర్తి కావస్తుండ డంతో రబీ సాగులపై దృష్టి సారించారు. జిల్లాలో 5,197 ఎకరాల్లో వరి నారుమడులు అవసరంకాగా, ఇప్పటివరకు 2,247 ఎకరాల్లో రైతులు సిద్ధం చేసుకున్నారని వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి జేడీ కాకి నాగేశ్వరరావు చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 2,400 ఎకరాల్లో వెదజల్లు విధానం ద్వారా రైతులు సాగు ప్రారంభించారని ఆయన వెల్లడించారు. జిల్లా మొత్తం మీద 40,800 బస్తాల విత్తనాలు అవసరం కాగా తమ శాఖ ద్వారా 2,800 క్వింటాళ్లకు గాను 1,121 క్విం టాళ్లు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. రైతులు సొంతంగా తయారు చేసు కున్న విత్తనాలు 80 శాతం ఉన్నట్టు చెప్పారు. రబీలో ఎంటీయూ-1121 రకం సాగు చేయాలని సూచించా రు. కాగా బొండాలు రకాన్ని తాము కొనుగోలు చేస్తామని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం, దానికితోడు మార్కెట్లో ధర బాగా ఉండడంతో రైతులు ఈ రకం సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నా రన్నారు. అంతేగాక ధర ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో రైతులు ఎండీపీ-3626 రకం వేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. కొందరు రైతులు ఆర్‌ఎన్‌ఆర్-17048, 1121 సన్నాలు కూడా సాగు చేస్తున్నారు. చుక్క నీరు లేదు.. సాగు ఎలా..
కె.గంగవరం, డిసెంబరు 15: పంట కాలువలు గుర్రపుడెక్కతో మూసుకుపోతే సాగు చేసేదెలా అని పామర్రు రైతులు వాపోతున్నారు. మండలంలోని పామర్రు గ్రామంలో సుమారు 750 ఎకరాలు ఆయ కట్టు ఉంటుంది. ఇందులో 500 ఎకరాలకు వాకతిప్ప పంట కాలువ నుంచి సాగునీరు వస్తుంది. ప్రస్తుతం ఈ కాలువ గుర్రపు డెక్కతో మూసుకుపోయింది. సా గునీరు అసలు రావడంలేదు. డిసెంబరు నెల సగం గడిచిపోయినా రబీ సాగుకు నీరు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం డిసెంబరు 20 నాటికి వెదజల్లే విధానంలో నాట్లు వేసుకోవాలని చెబుతోంది. కానీ ఇక్కడ కాలువల్లో నీటిచుక్క వచ్చే పరిస్థితి లేదు. రైతులు పంట విరామం ప్రకటించాల్సి వస్తుందేమోనని సందేహిస్తున్నారు.
ఎరువుల కొరత లేదు
ఇన్‌చార్జి జేడీ నాగేశ్వరరావు
రైతులకు రబీకి అవసరమైౖన ఎరువులు సిద్ధం చేశాం. జిల్లా మొత్తం మీద 92,149 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటివరకు 12 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉంచాం. అక్టోబరు, నవంబరు, డిసెంబరుల్లో మూడు విడతలుగా ఎరువులు వస్తాయి. ఈ నెలాఖరుకల్లా రబీ నాట్లు పూర్తి చేసి మార్చి చివరికి పంట చేతికందేలా ప్రణాళికలు రూపొందించాం. ఏప్రిల్‌లో వరి కోతలు పూర్తయిన తర్వాత మూడవ పంటగా అపరాలు సాగు చేసేలా చూస్తాం.
Updated Date - 2022-12-16T00:55:47+05:30 IST