సమస్యలు చెప్పడానికి వచ్చినా నో ఎంట్రీ
ABN, First Publish Date - 2022-03-05T06:51:02+05:30
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్‌లకు చెప్పుకోవడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలోని బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
- మాజీ ఎమ్మెల్యే వంతల బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
దేవీపట్నం, మార్చి 4: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్‌లకు చెప్పుకోవడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలోని బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకూరుపేటలో శుక్రవారం జరిగిన సభకు వెళుతున్న వీరందరినీ కొద్దిదూరంలోని కృష్ణుడి గుడి సమీపంలో ముందుకు వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో పలు మండలాల టీడీపీ నాయకులతో కలిసి రాజేశ్వరి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి నిర్వాసిత సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయన్నారు. వీటిని పరిష్కరించలేదని ఆమె వా పోయారు. సీఎం, కేంద్రమంత్రి పర్యటనలో భాగంగా దేవీపట్నం మండలం ఇందుకూరు-1 కాలనీ, ఏనుగులగూడెం పునరావాస కాలనీలకు జిల్లా ఉన్నతాధికారులు ముందుగానే విచ్చేశారని, వారు ఈ రెండు గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులకు మూడు రోజులుగా ఎలా మాట్లాడాలో శిక్షణ ఇచ్చారని ఆరోపించారు. నిర్వాసితుల సమస్యలపై పోరాటం చేసేందుకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాజేశ్వరి చెప్పారు. ఈ పునరావాస కాలనీలను టీడీపీ హయాంలోనే నిర్మించామని, ఈరోజు సీఎం జగన్ తన పేరు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. దేవీపట్నం సర్పంచ్ కుంజం రాజామణి మాట్లాడుతూ తమ మండలంలో 44 గ్రామాలకు సంబంధించి 15 సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలు చెప్పేందుకు స్థానిక సర్పంచ్ అయి న తనను పిలవకపోవడం దారుణమన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు మరిసెట్ల బుచ్చిబాబు, ముచ్చు నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ గౌరీశ్వరి, గేదెల పెద్ద సుబ్బారావు, కురసం వెంకన్నదొరలు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T06:51:02+05:30 IST