‘చెత్త’ బెదిరింపులు
ABN, First Publish Date - 2022-12-16T00:51:50+05:30
‘మా ఆయన నేను ముసళోల్లం.. మాకు దమ్మిడి ఆదాయం లేదు. మొన్న చెత్తపన్ను కోసం వలంటీర్లు వచ్చారు. డబ్బులు కడతారా.. కట్టరా అని బెదిరించారు. చెత్తకు డబ్బులు మేమెక్కడివ్వాలి.. అసలు చెత్తకు పన్నేంటి.. కాకినాడలో పుట్టాం.. ఇక్కడే పెరిగాం.. ఎప్పుడూ చెత్తపై పన్ను కనివినీ ఎరుగం..అయినా మా ఆయన భయపడిపో యాడు. అప్పుతెచ్చి అప్పటికప్పుడు రూ.500 పన్ను కట్టాం’..
-కాకినాడలో చెత్తపన్ను పేరిట జనాన్ని పీడించేస్తున్న అధికారులు
-చెత్త లేకపోయినా వేలల్లో పన్ను బాకీలు కట్టాలంటూ ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులు
-కట్టబోమని ఎదురుతిరిగితే ఎలా వసూలు చేయాలో తెలుసంటూ వార్నింగ్లు
-నగరంలో ఇళ్లు,వాణిజ్య భవనాల నుంచి ఏటా రూ.8.50కోట్లు పిండుడు లక్ష్యం
-వసూళ్లు తగ్గడంతో భయపెడుతూ కలెక్షన్లు చేస్తున్న సచివాలయ సిబ్బంది
-పథకాలు ఆపేస్తారనే భయంతో అప్పుతెచ్చి చెత్తపన్ను కడుతున్న పేదలు
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
‘మా ఆయన నేను ముసళోల్లం.. మాకు దమ్మిడి ఆదాయం లేదు. మొన్న చెత్తపన్ను కోసం వలంటీర్లు వచ్చారు. డబ్బులు కడతారా.. కట్టరా అని బెదిరించారు. చెత్తకు డబ్బులు మేమెక్కడివ్వాలి.. అసలు చెత్తకు పన్నేంటి.. కాకినాడలో పుట్టాం.. ఇక్కడే పెరిగాం.. ఎప్పుడూ చెత్తపై పన్ను కనివినీ ఎరుగం..అయినా మా ఆయన భయపడిపో యాడు. అప్పుతెచ్చి అప్పటికప్పుడు రూ.500 పన్ను కట్టాం’..
ఫ ఇదీ కాకినాడ నగరంలోని 38వ డివిజన్లో ఓ వృద్ధురాలి ఆవే దన. ఆమె మాత్రమే కాదు నగరంలో వేలాదిమంది పేదలు, మధ్య తరగతి జీవులు తరచూ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, వేధింపులు ఇలాగే ఉంటున్నాయి. కాకినాడలో చెత్తపన్ను వసూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం బరి తెగించి వ్యవహరిస్తోంది. ఇళ్లకు వెళ్లి పన్ను కడతారా? కట్టరా? అం టూ ఏకంగా వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా జనాన్ని బెదిరి స్తోంది. అక్కడికక్కడే అడిగిన వెంటనే డబ్బులు కట్టకపోతే ఎలా కట్టించాలో తెలుసంటూ ఏకంగా వలంటీర్లు, సచివాలయ సిబ్బంది బెదిరింపులకు దిగుతున్నారు. నెలవారీ లక్ష్యాలకు అనుగుణంగా వసూ ళ్లు జరగకపోవడంతో రుబాబుకు దిగుతున్నారు. దీంతో నగరవాసులు ప్రభుత్వ తీరుతో నెత్తీనోరు బాదుకుంటున్నారు.
ఇదేం చెత్త బాదుడు...
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల పన్ను వడ్డింపుల తో జనం నడ్డివిరుస్తోంది. ఒకపక్క జనం ప్రయాణించే రహదారులు అస్తవ్యస్తంగా మారి రాకపోకలకు నరకం చూపిస్తున్నా అవేం పట్టిం చుకోకుండా పన్నులు మాత్రం భారీగా పిండేస్తోంది. అందులో భాగం గా గతేడాది విచిత్రంగా చెత్త పన్ను వసూళ్లకు నిర్ణయించింది. జిల్లా అంతా ఒకేసారి పన్నులు వసూలు చేయకుండా తొలుత కాకినాడ కార్పొరేషన్నుంచి పిండుడు మొదలుపెట్టింది. దీంతో గతేడాది జూన్ నుంచి కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 84వేల నివాసగృహాలు, 5,446 వాణిజ్య భవనాలనుంచి చెత్తపన్ను వసూలుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆయా ఇళ్లు, వాణిజ్య సముదాయాల విస్తీర్ణం ఆధారంగా చెత్త ఎంత ఉత్పత్తి అవుతుందనేది లెక్కగట్టి నెలకు రూ.30నుంచి రూ.5వేల వరకు పన్నులు నిర్ధారించారు. తద్వారా నివా స, వాణిజ్య భవనాల ద్వారా నెలకు రూ.72లక్షల వరకు పన్నులు పిం డాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. ఈ వసూళ్ల ద్వారా వచ్చిన డబ్బును కార్పొరేషన్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్న వం దకుపైగా ఉన్న చెత్త వాహనాల నిర్వహణకు ఖర్చు చేయాలని ప్రభు త్వం అధికారులను ఆదేశించింది. దీంతో ఇప్పుడు చెత్త పన్ను పేరుతో నగరవాసులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. చెత్త వాహ నాల సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ తదితర ఖర్చులు భరించాలంటే చెత్త పన్ను నుంచి పిండే డబ్బులే శర ణ్యమనే సాకుతో ప్రతి ఇం టికీ వెళ్లి పన్నులు కట్టాలం టూ వలంటీర్లు, సచివాల య సిబ్బంది అదే పనిగా ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి ఏటా చెత్త పన్ను వసూళ్లు రూ.8.50కోట్ల వరకు పిండాల్సి ఉంది. కానీ జనం మాత్రం చెత్తపన్ను చెల్లించడానికి ససేమిరా అంటున్నారు. చెత్త వసూలుకు గతంలో ఏ ప్రభుత్వం పన్నులు పిండలేదని, ఇప్పుడేంటని అంతా గడచిన కొన్నినెలలనుంచి ఇంటికి వచ్చే ప్రభుత్వ సిబ్బందిని నిలదీస్తున్నారు. తమ ఇంటినుంచి పెద్దగా చెత్త ఉండడం లేదని, ఉన్నా తామే స్వయంగా తీసుకువెళ్లి దూరంగా పారేస్తున్నా పన్ను ఎందుకు కట్టాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎనిమిది నెలలుగా కార్పొరేషన్ అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో పన్ను వసూళ్లు పెద్దగా జరగడం లేదు.
పాతవి కడితేనే తగ్గిస్తారంట..
వాస్తవానికి కార్పొరేషన్ పరిధిలో నెలవారీ చెత్తపన్ను వసూళ్ల లక్ష్యం రూ.72లక్షలు కాగా, బెదిరింపులతో రూ.45లక్షల వరకు అతి కష్టంపై పిండుతున్నారు. ఇందులో సింహభాగంగా వాణిజ్య భవనాల నుంచి వచ్చిందే ఉంటోంది. ఇళ్ల నుంచి పన్ను వసూళ్లు లేకపోవడం తో దిగువస్థాయిలో వలంటీర్లు, సచివాలయ సిబ్బందిపై ఉన్నతాధికా రులు తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెంచారు. దీంతో కొన్నిరోజులుగా ప్రతి ఇంటికి వెళ్లి చెత్తపన్ను కడతారా? లేదా? అంటూ ఏకంగా బెదిరిం పులకు దిగుతున్నారు. కనీసం బిల్లు కూడా చూపించకుండా ఏడాది నుంచి బాకీ ఉన్నారు.. రూ.2వేలు కట్టండి అంటూ ఒత్తిడి తెస్తున్నా రు. కొందరు ఇంటి యజమానులు ఆగ్రహంతో ఎదురుతిరిగి చెత్త పన్ను ఎందుకు కట్టాలి? మేం కట్టం? అని చెబుతుండడంతో ఎలా కట్టించుకోవాలో తెలుసంటూ ఏకంగా బెదిరిస్తున్నారు. దీంతో అనేక మంది నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. కొందరు పేద, మధ్య తరగతి కుటుంబాలు తమకు వచ్చే పథకాలను నిలిపివేస్తారేమోననే భయంతో అప్పుచేసి పన్నులు కడుతున్నారు. నగరంలో సాధారణ నివాస ప్రాంతాల్లో నెలకు చెత్తపన్ను రూ.90 కాగా, పేదలు అధికంగా ఉండే ప్రాంతాల్లో రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల పేద గృహాలకు పన్ను భారం సగానికి తగ్గించి రూ.30కి నిర్ణయించారు. తగ్గింపు వర్తించాలంటే పాత చెత్తపన్ను బకాయిలు చెల్లించాలని మెలికపెట్టారు.
Updated Date - 2022-12-16T00:51:52+05:30 IST