అన్నవరంలో వసతి గదులకు ఆన్‌లైన్ బుకింగ్
ABN, First Publish Date - 2022-08-03T07:03:07+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తులకు వసతిగదులు దొరకడం కష్టతరంగా మారిన నేపథ్యంలో దానిని సులభతరం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
అన్నవరం, ఆగస్టు 2: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తులకు వసతిగదులు దొరకడం కష్టతరంగా మారిన నేపథ్యంలో దానిని సులభతరం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం సత్రం గదులను కొందరు దళారులు బ్లాక్‌చేసి అధికధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువవడంతో ఆ ముద్రను చెరిపేసేందుకు ఈ చర్యలకు పూనుకున్నారు. భక్తులు తమ ప్రయాణ తేదీని బట్టి తమ ఇంటి నుంచే సత్రం గదులు బుకింగ్ చేసుకునే విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సత్రంగదిని బుక్‌చేసుకున్న భక్తుడు సంబంధిత రసీదును సీఆర్వో కార్యాలయం వద్ద చూపించి డిపాజిట్ చెల్లించి సత్రంగదిని పొందవచ్చు. తిరిగి ఆ గదిని ఖాళీచేసే సమయంలో సీఆర్వో కార్యాలయం వద్ద డిపాజిట్‌ని సదరు భక్తుడికి అందజేస్తారు.
ఇదిలా ఉండగా సత్రం గదుల కేటాయింపు 12 గంటల వ్యవధికి పరిమితం చేయాలా 24 గంటలకు ఉంచాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నీ అనుకూలిస్తే ఈ నెలాఖరునాటికి ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆలోచన చేస్తున్నారు. మరోపక్క అన్నవరం దేవస్థానంలో ఉన్న ఉచిత కల్యాణ మండపాల బుకింగ్‌ను ఆన్‌లైన్ చేయబోతున్నారు. మండపాలు తక్కువ ఉండడం దీనికి రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలు అధికమవ్వడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు ఉచిత కల్యాణ మండపాలలో కలిపి 17 వివాహ మండపాలను రెండు సెషన్‌లలో బుకింగ్ చేసుకునే విధంగా రూపకల్పన చేశారు. రాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలవరకు ఒక సెషన్. తర్వాత మరో సెషన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ వివాహ మండపాలు బుకింగ్ సైతం వివాహబృందాలు రత్నగిరికి రాకుండానే తమ ఇంటివద్ద నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. మరోపక్క ఇవి అక్రమార్కుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఒకసారి పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెల ఆధార్ నెంబరుతో ఉచిత కల్యాణమండపం బుకింగ్ చేసుకుంటే జీవితంలో మరోసారి అదే ఆధార్‌తో బుకింగ్ కాకుండా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
Updated Date - 2022-08-03T07:03:07+05:30 IST