నిడదవోలు వైసీపీ నేతల రచ్చరచ్చ
ABN, First Publish Date - 2022-07-24T06:37:55+05:30
వైసీపీ నేతల మధ్య జిల్లావ్యాప్తంగా ఎక్కడిక్కడ తలెత్తిన వివాదాల నేపథ్యంలో రోడ్డెక్కుతున్నారు. ఎక్కడికక్కడ రచ్చరచ్చ చేస్తున్నారు.
మున్సిపల్ చైర్మన్ వర్సెస్ మాజీ వైస్ చైర్మన్
ప్రజా సమస్యలపై జనం నిలదీత.. నేతల మధ్య ఘర్షణ
తోపులాటల వరకు దారితీసిన విభేదాలు
రాజమహేంద్రవరం, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ నేతల మధ్య జిల్లావ్యాప్తంగా ఎక్కడిక్కడ తలెత్తిన వివాదాల నేపథ్యంలో రోడ్డెక్కుతున్నారు. ఎక్కడికక్కడ రచ్చరచ్చ చేస్తున్నారు. నిన్నగాక మొన్న కొవ్వూరులో వైసీపీ విభేదాలు బయటపడ్డాయి. తాజాగా నిడదవోలు పట్టణంలో కూడా ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.చాలాకాలంగా లోలోపల మండిపోతున్న నేతలు చిన్న విషయంలో ఏకంగా ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లారు. నిడదవోలు మున్సిపాల్టీలోని 5వ సచివాలయం పరిధిలో కౌన్సిలర్ ఆలమూరి భారతి ఆహ్వానం మేరకు మంచినీటి బోరును ప్రారంభించడానికి శనివారం సాయంకాలం అధికారులతో కలసి మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పార్టీ నేతలు వెళ్లారు. బోరును ప్రారంభించిన తర్వాత సమీపంలోని అన్నపూర్ణ నగర్ ప్రజలు అక్కడకు వచ్చి తమ ప్రాం తంలో రోడ్డు ధ్వంసమయ్యాయని, వాటర్ టాప్‌లు కూడా సరిగ్గాలేవని, ఒకసారి వచ్చి చూడాలని చైర్మన్ ఆదినారాయణను నిలదీశారు. దీంతో ఆయన తాను మాటలు మనిషిని కాదని, చేతలు మనిషినని సమీపంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెంటపాటి ప్రసాద్‌నుద్దేశించి అన్నట్టు సమాచారం. దీనికి ప్రసాద్ స్పందిస్తూ తనవైపు చూసి అలా చెబుతారేంటని ప్రశ్నించడంతో మాటామాటా పెరిగిపోయింది. ఒకదశలో చైర్మన్, మాజీ వైఎస్ చైర్మన్‌లు ఒకరినొకరు తోసుకున్నారు. అక్కడ మిగతా నాయకులు, కార్యకర్తలు వీనిపి విడదీసినట్టు సమాచారం. అధికార వైసీపీ నేతలే ఒకరినొకరు ఇలా బహిరంగంగా ఘర్షణకు దిగడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరి మధ్య ముందు నుంచీ విభేదాలు ఉన్నట్టు, ఇవాళ అవి బయటపడినట్టు చెబుతున్నారు. ఆదినారాయణ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత పట్టణ రాజకీయాల్లో ఇతరుల పెత్తనం తగ్గినట్టు సమాచారం. దీంతో ఆయనకు మిగతానేతలు వ్యతిరేకంగా ఉన్నారు. పట్టణ వైసీపీ ప్రెసిడెంట్ మద్దిపాటి ఫణీంద్ర కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఆయనకు, చైర్మన్‌కు మధ్య అంతరం పెరిగినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో మున్సిపాల్టీ అధికారాన్ని రుచిచూసిన కొందరు, చైర్మన్‌కు వ్యతిరేకంగా కూడా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వీరంతా ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడితో బాగానే ఉన్నా వారి మధ్య విభేదాలు ఇవాళ రచ్చకెక్కాయి.
Updated Date - 2022-07-24T06:37:55+05:30 IST