మాండస్ ముప్పు
ABN, First Publish Date - 2022-12-09T23:47:34+05:30
మాండస్ తుఫాన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శుక్రవారం సాయంత్రం నుంచి ఈదురు గాలులలతో కూడిన భారీ వర్షం కురుస్తుంది.
అన్నదాతలు ఇబ్బందులు
అమలాపురం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): మాండస్ తుఫాన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శుక్రవారం సాయంత్రం నుంచి ఈదురు గాలులలతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. చలి తీవ్రత పెరగడంతో జిల్లావాసులు గజగజ లాడిపోతున్నారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకువచ్చి తీరాన్ని కోతకు గురి చేస్తోంది. ముందు జాగ్రత్తగా మత్స్యకార గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కోనసీమలో వర్షాలకు చేలల్లో ఉన్న పంట పొలాలు, చేలల్లో వరిపనలు తడిసి ముద్దవుతున్నాయి. ధాన్యం రాశులు తడుస్తుండడంతో రైతులు వాటిని సంరక్షించుకునే పనిలో పడ్డారు. ఉదయం నుంచి రాత్రి వరకు చలిగాలుల తీవ్రత అనూహ్యంగా పెరగడంతో పాటు వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చలి తీవ్రతకు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. జిల్లా వ్యాప్తంగా 1650 మత్స్యకార బోట్లను వేటకు వెళ్లకుండా అధికారులు నిలిపివేశారు. తుఫాన్ ప్రభావంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు రెవెన్యూ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న దృష్ట్యా మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా శనివారం నెల్లూరు-ప్రకాశం మధ్య మాండస్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దీని కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోస్తా ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీ ఈదురు గాలులు కారణంగా జిల్లాలో పలుచోట్ల చెట్లు కుప్పకూలాయి. కొత్తపేట మండలం అవిడి వద్ద గాలి తీవ్రతకు కొబ్బరిచెట్టు ఎలక్ర్టికల్ తీగలపై పడడంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పోల్ సైతం విరిగి పడిపోయింది. కాగా వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం రాశులను సంరక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ముందు జాగ్రత్తగా సముద్రం, గోదావరిలో చేపల వేటకు వెళ్లే బోట్లను తీర ప్రాంతాల్లో లంగరు వేశారు. అంతర్వేది, ఓడలరేవు, బలుసుతిప్ప జట్టీల వద్ద భారీగా పడవలను మత్స్యకారులు నిలిపివేశారు.
Updated Date - 2022-12-09T23:52:02+05:30 IST