కాలేరులో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-08-05T05:10:37+05:30
కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామంలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ ఏరియాలో ఉన్న ఖాళీ స్థలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు.
దళిత మహిళా సర్పంచ్ అరెస్టు
కపిలేశ్వరపురం, ఆగస్టు 4 : కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామంలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ ఏరియాలో ఉన్న ఖాళీ స్థలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటనలో దళిత సర్పంచ్, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. కాలేరులో దళిత ఏరియాలో 53 సెంట్లు ఖాళీ స్థలంలో వెల్‌నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలను నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే ఆ స్ధలాన్ని తమ సామాజిక ప్రయోజనాలకు వినియోగించాలని స్థానిక దళితులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను అడ్డుకున్నారు. పనులను నిలుపుదల చేయాలని సర్పంచ్ దాయం కావేరి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనులను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని తహశీల్దార్ పి.చిన్నారావు, ఇన్‌చార్జ్ ఎంపీడీవో ఎం.రామకృష్ణారెడ్డి వారించారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. పనులు అడ్డుకుంటే చట్టపరిధిలో చర్యలు తప్పవని హెచ్చరించారు. దళిత, మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా కావేరిని నెట్టుకుంటూ పోలీస్‌వాహనంలో ఎక్కించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్పంచ్ కావేరి, ఆమె భర్త, మరికొంతమందిని ఆలమూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు సర్పంచ్ భర్త గాయం శేఖర్‌బాబు, సర్పంచ్ కావేరి, మరికొంత మందిపై గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎం.రామతులసి అంగర పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ సంపత్‌కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Updated Date - 2022-08-05T05:10:37+05:30 IST