కదిలితే ఒట్టు..
ABN, First Publish Date - 2022-08-04T07:09:41+05:30
జిల్లాలో వందలాది కొత్త సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్లు, వైఎస్సార్ ఆరోగ్య క్లినిక్‌ల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. రెండున్న రేళ్లు దాటినా ఈ భవనాల నిర్మాణాలు అడుగు కదలడం లేదు. పని తీసుకున్న కాంట్రాక్టర్లు పూర్తిగా అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరు లే కావడంతో వీటి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
- -జిల్లాలో రెండున్నరేళ్లుగా కదలని సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య క్లినిక్‌ల నిర్మాణం
- -1,265 భవనాలకు ఇప్పటివరకు పూర్తయినవి రెండొందల లోపే
- -ఎక్కడికక్కడ మండలాల్లో వైసీపీ ఎమ్మెల్యేల కీలక అనుచరులే కాంట్రాక్టర్లు
- -తమ ప్రభుత్వమేనన్న ధీమాతో నిర్మాణాల విషయంలో ఇష్టారాజ్యం
- -ఎప్పుడు బిల్లు అప్పుడు చేతికి వస్తేనే నిర్మాణాల జోలికి వెళ్తున్న నేతలు
- -సగానికిపైగా భవనాలు పునాదులు,శ్లాబ్‌ల దశలోనే మూలుగున్న పరిస్థితి
- -అధికారపార్టీ నేతలు కావడంతో అడగలేక మౌనం వహిస్తోన్న పీఆర్ అధికారులు
- -ప్రభుత్వం బిల్లులు నిలిపివేయడంతో ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న క్యాడర్
- -రూ.336కోట్ల అంచనాలతో చేపట్టిన పనులకు ఇప్పటివరకు చెల్లింపులు అరకొరే
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వందలాది కొత్త సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్లు, వైఎస్సార్ ఆరోగ్య క్లినిక్‌ల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. రెండున్న రేళ్లు దాటినా ఈ భవనాల నిర్మాణాలు అడుగు కదలడం లేదు. పని తీసుకున్న కాంట్రాక్టర్లు పూర్తిగా అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరు లే కావడంతో వీటి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. సాధారణంగా ఈ పనులు ఎవరో బయట కాంట్రా క్టర్లు చేస్తే అప్పు తెచ్చి అయినా భవనాలు పూర్తి చేయాలని అధికా రులు ఒత్తిడి తెచ్చేవారు. కానీ వైసీపీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంతో వారి జోలికి వెళ్లడానికి సాహసించడం లేదు. మరోపక్క ఎలాగూ తమ ప్రభుత్వమే కాబట్టి ఏంచేసినా అడిగేవారు లేరనే ధీమాతో కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన వైసీపీ నేతలు కేవలం బిల్లు చేతికి వస్తేనే భవనాలకు ఒక్కో ఇటుక పేర్చుతున్నారు.
ఏదో అనుకుని ఎగరేసుకుపోయారు..
అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వ వ్యవస్థలను కాదని అదనంగా సచివాల య వ్యవస్థ తీసుకువచ్చింది. ఒక్కో గ్రామంలో ఒక్కో సచివాలయం పేరుతో పదుల సంఖ్యలో వివిధ శాఖల బాధ్యతలను నిర్వర్తించ డానికి ఉద్యోగులను తీసుకుంది. తీరా జిల్లాలో సొంత కార్యాలయా లు లేని 443 చోట్ల గ్రామ సచివాలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.174.87కోట్లు ఖర్చవుతుందని అంచనా కట్టింది. గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందించే పేరుతో రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికీ పచ్చజెండా ఊపింది. వీటిని కొన్ని ప్రభుత్వ భవనాల్లో అప్పటికప్పుడు ఏర్పాటు చేయగా 422 గ్రామాల్లో కొత్తవి భవనాలు అవసరం కావడంతో రూ.93.19కోట్లతో వీటి నిర్మా ణానికి అంచనాలు సిద్ధం చేసింది. వైఎస్సార్ ఆరోగ్యక్లినిక్‌ల పేరుతో ఇంకో 400 భవనాలు రూ.68.18 కోట్లతో నిర్మించడానికి పచ్చజెండా ఊపింది. ఇవన్నీ కలిపి మొత్తం 1,265 భవనాలను రూ.336.24 కోట్లతో నిర్మించడానికి రెండున్నరేళ్ల కిందట నిర్ణయించింది. వీటి నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన ప్రభుత్వం వైసీపీ నేతలకు అప్పగించింది. దీంతో ఎక్కడికక్కడ గ్రామపంచాయతీల తీర్మానం పేరుతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు తమ కీలక అనుచరులకు ఈ పనులు ఇప్పించారు. ఒక్కో సచివాలయ నిర్మాణానికి రూ.40 లక్షలు, ఆర్బీకేకు రూ.21లక్షలు, ఆరోగ్య క్లినిక్‌కు రూ.17.50 లక్షలు ప్రభుత్వం ఇస్తుండడంతో భారీగా కాసులు మిగుల్చుకోవడానికి ఎక్కడికక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యేల కీలక అనుచరులు ముందుకు వచ్చి ఈ కాంట్రాక్టులు ఎగరేసుకుపోయారు. తీరా ఇప్పటికి రెండున్నరేళ్ల వుతున్నా నిర్మాణాల పురోగతి దారుణంగా ఉంది. ప్రభుత్వంనుంచి బిల్లులు రావడానికి ముందు పనులు ప్రారంభించాల్సిన కాంట్రాక్టర్లు అదేదీ చేయలేదు. ఈ పనులు పర్యవేక్షించే పంచాయతీరాజ్‌శాఖ అధికారులు బిల్లులు ఇవ్వాలంటూ అదేపనిగా సదరు నేతలు ఒత్తిడి తెచ్చారు. కానీ పని ప్రారంభించాకే బిల్లులు అనడంతో కిందా మీదా పడ్డారు. దీంతో కొందరు డబ్బులు లేవనే పేరుతో పని ప్రారంభిం చకుండా వదిలేశారు. మరికొందరు బయటనుంచి తెచ్చి దశల వారీ గా భవనాలు ప్రారంభించారు. వీటికి ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపో వడంతో వైసీపీ కాంట్రాక్టర్లు షాక్ తిన్నారు. ఎక్కడి పని అక్కడ ఆపే శారు. ఫలితంగా అవన్నీ రెండున్నరేళ్లుగా మూలుగుతున్నాయి. కొందరైతే తమ ప్రభుత్వమే కదా, బిల్లులు సరిగ్గా రానప్పుడు నాణ్యత ఎందుకులే అన్నట్లు ఇప్పటికే చేసిన కొంతపనిలోను నాణ్యతకు నీళ్లొదిలేశారు.
సగం పూర్తయితే ఒట్టు..
1,265 భవనాల నిర్మాణం ఎప్పుడో పూర్తికావాల్సి ఉండగా కాంట్రాక్టర్లు వైసీపీ నేతలు కావడంతో అధికారు లు చేతులెత్తేస్తున్నారు. వీళ్లను ఏదై నా అందామంటే ఎమ్మెల్యేలు ఈగ వాలనీయడం లేదు. దీంతో వీరిపై ఒత్తిడి తెచ్చి పనిచేయించడానికి అధి కారులు జంకుతున్నారు. వీరికి వర్కు రద్దు చేసి వేరే కాంట్రాక్టర్లకు అప్ప గించాలనుకుంటే ఎమ్మెల్యేలు ఊరు కోవడం లేదు. ఈ నేపథ్యంలో 1,265 భవనాలకు ఇంతవరకు కేవలం 200 భవనాలు కూడా పూర్తికాని దుస్థితి నెలకొంది. 443 సచివాలయాలకు 185, 422 ఆర్‌బీకేలకు 40, 400 ఆరో గ్య క్లినిక్‌లకు 22 మాత్రమే పూర్త య్యాయి. మిగిలినవి అసలు పూర్తి కాలేదని రికార్డుల్లో చూపిస్తే బాగోదని 914 భవనాల నిర్మాణం పురోగతిలో ఉన్నట్లు పీఆర్ అధికా రులు చూపిస్తున్నారు. తీరా అవన్నీ పునాదులు, గోడలు, శ్లాబ్‌ల దశలోనే ఉన్నాయి. ఇవన్నీ వైసీపీ కాంట్రాక్టర్లు మధ్యలో ఆపేసినవే. మరో 138 అసలింకా మొదలే కాలేదు.
వాస్తవానికి ఈ భవనాలన్నింటినీ ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో చేపట్టారు. వీటికి అసలు నిధుల సమస్య ఉండదు. ఉపాఽధి హామీ కూలీల పని దినాలు, వేతనాల చెల్లింపు ఆధారంగా మెటీరియల్ కాంపొంనెంట్ నిధులు సమకూరుతాయి. కానీ రాష్ట్రప్రభుత్వం వీటిని కూడా ఖాలీ చేసేయడంతో చాలావాటికి బిల్లులు మంజూరవడం లేదు. పురోగతిలో ఉన్నట్లు చూపుతున్న 914 భవనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్నేళ్లుగా అసలు బిల్లులే రాలేదు. వీటిలో పునాదులు, గోడల దశలో నిర్మాణం ఆగిపో యిన సచివాలయాలు, ఆర్బీకేలకు వైసీపీ కాంట్రాక్టర్లు కొందరు డబ్బులు సొంతంగా పెట్టారు. తీరా బిల్లులు రాకపోవడంతో చేతులె త్తేశారు. బిల్లులు ఇప్పించాలని తమ ఎమ్మెల్యేలపైనా ఇప్పటికే ఒత్తిడి తెచ్చారు. కానీ ప్రయోజనం లేకపో వడంతో పనులు వదిలే శారు. ఒకపక్క వీటి నిర్మాణం పూర్తి చేయాలంటూ అధికారులు సదరు కాంట్రాక్టర్‌లను బతిమాలుతున్నారు. బిల్లులు చేతిలో పెడి తేనే పనులు మొదలుపెడతామని చెబుతుండడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు.
Updated Date - 2022-08-04T07:09:41+05:30 IST