ఘంటసాల కాదు.. ఎప్పటికీ పాటశాల!
ABN, First Publish Date - 2022-12-05T01:02:33+05:30
ఘంటసాల గాన అజరామరం.. నాటికి.. నేటికి..ఏనాటికి.. ఆ పాటసాలను ఆపడం ఎవరితరం కాదు.. అంటూ పలువురు వక్తలు అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, డిసెంబరు 4 : ఘంటసాల గాన అజరామరం.. నాటికి.. నేటికి..ఏనాటికి.. ఆ పాటసాలను ఆపడం ఎవరితరం కాదు.. అంటూ పలువురు వక్తలు అన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కియేటివ్ కల్చరల్ అసోసియేషన్ (రాకా) ఆధ్వర్యంలో అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతిని ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని విక్రమహాలులో ఘనంగా నిర్వహించారు. జీఎస్‌ఎల్ సంస్థల ఛైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, గౌతమిఘాట్ ఆధ్యాత్మిక సంస్థల ఛైర్మన్ తోట సుబ్బారావు మాట్లాడారు. ఘంటసాల గానం మధురం అన్నారు. ఘంటసాల శత జయంతి స్మారక ప్రతిభా పురస్కారాలను రాజమహేంద్రవరానికి చెందిన గండి శంకుంతలా దేవి, డాక్టర్ కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్, లక్ష్మీ అనురాధ దంపతులు, జేమ్స్‌వాట్ కొమ్ము, వీరవరానికి చెందిన ఆదిమూలం సాయిబాబు, మండపేటకు చెందిన అంగర వెంకట్, కనిగిరికి చెందిన చల్లా సుబ్బారాయుడులకు అందజేశారు.వ్యాఖ్యాత అడ్డాల నాగేశ్వరరావు ఘంటసాల స్మృతులను వివరించారు. దీనిలో భాగంగా శతగళ స్వరయజ్ఞం వీనులవిందు చేసింది. గాయనీ గాయకులు అనిత, ఎం.పార్వతి, బి.దేవకుమార్, డాక్టర్ శైలజ, డాక్టర్ కంటే వీరన్నచౌదరి, వట్టి గంగా కిషోర్, రామరాజు, బోడపాటి శ్రీనివాస్, డాక్టర్ రామ్‌మనోహర్ తదితరులు ఆలపించిన ఆపాత మధురాలు సంగీతాభిమానులను అలరించాయి. కార్యక్రమంలో రాకా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కంటే వీరన్నచౌదరి, ప్రధాన కార్యదర్శి జీవీ రమణ, గౌరవ సలహాదారు డాక్టర్ టీవీ నారాయణరావు, ఉపాధ్యక్షుడు తిరుమల కృష్ణమోహన్, కోశాధికారి ఎస్.తాతారావు, ఎన్.గౌరీశంకర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-05T01:02:35+05:30 IST