డీవీసీ ట్రస్టుకు దేవదాయ శాఖ నోటీసు
ABN, First Publish Date - 2022-01-10T08:32:05+05:30
డీవీసీ ట్రస్టుకు దేవదాయ శాఖ నోటీసు
గుంటూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీ అనుబంధ సంస్థ శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టుకు దేవదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఈ నెల 6న నోటీసు జారీ చేశారు. ట్రస్టు రిజిస్ట్రేషన్ కోసం గుంటూరు జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌కు దరఖాస్తు చేయనట్లు తమ దృష్టికి వచ్చిందని అందులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్, హిందూ మత సంస్థలు, దేవదాయ చట్టం 1987 సెక్షన్ 43లోని సబ్ సెక్షన్-1 ప్రకారం స్వచ్ఛంద సంస్థలు తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ కారణంగానే నోటీసు జారీ చేస్తున్నామని, 15 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. లేకుంటే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి అందుకు అయిన ఖర్చులను క్లెయిమ్ చేస్తామన్నారు.
Updated Date - 2022-01-10T08:32:05+05:30 IST