ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Strategists: విష ‘వ్యూహాలు’!

ABN, First Publish Date - 2022-12-15T02:36:37+05:30

అసలే రాజకీయాల్లో విలువలు క్షీణిస్తుండగా... వ్యూహకర్తల రంగప్రవేశంతో అవి మరింత దిగజారి పోయాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో చంద్రబాబును దెబ్బతీయడానికి ప్రశాంత్‌ కిశోర్‌ పన్నిన వ్యూహాలతో దీనికి బీజం పడిందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యూహకర్తలతో దిగజారిన రాజకీయాలు

అబద్ధాలు, తప్పుడు ఆరోపణలే అస్త్రాలు

మార్ఫింగ్‌, ఎడిటింగ్‌తో బురదజల్లుడు

సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం

నాడు ఏపీలో మొదలుపెట్టిన పీకే టీమ్‌

ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అదే పద్ధతి

తెలంగాణలో పోలీసుల కొరడా

కాంగ్రెస్‌ వ్యూహకర్త సిబ్బంది అరెస్టు

తమ బలాన్ని పెంచుకోవడం, ఎదుటి వారి బలహీనతలను వాడుకోవడం, దూరమైన వారిని దగ్గర చేసుకోవడం, మరింత మందికి దగ్గర కావడం... ఇవీ సంప్రదాయ రాజకీయ నాయకుల వ్యూహాలు!తప్పుడు ప్రచారాలు చేయడం, ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పడం, ప్రత్యర్థి వ్యక్తిత్వాన్ని కించపరచడం, లేనిది ఉన్నట్లు సృష్టించడం... ఇవి.. ‘వ్యూహకర్తల’ వ్యూహాలు!

(హైదరాబాద్‌/అమరావతి - ఆంధ్రజ్యోతి): అసలే రాజకీయాల్లో విలువలు క్షీణిస్తుండగా... వ్యూహకర్తల రంగప్రవేశంతో అవి మరింత దిగజారి పోయాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో చంద్రబాబును దెబ్బతీయడానికి ప్రశాంత్‌ కిశోర్‌ పన్నిన వ్యూహాలతో దీనికి బీజం పడిందని... ఆయన బృందంలోని సభ్యులు ఇతర రాష్ట్రాల్లోనూ దీనిని కొనసాగిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాడు జగన్‌ కోసం ప్రశాంత్‌ కిశోర్‌ అమలు చేస్తున్న అబద్ధపు, అసంబద్ధ వ్యూహాల గురించి తెలిసీ చంద్రబాబు మిన్నకుండిపోయారు. కానీ... ఇలాంటి వ్యూహాలపై కేసీఆర్‌ ఇప్పుడే కత్తి ఝుళిపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ తరఫున సునీల్‌ కనుగోలు అనే వ్యూహకర్త పని చేస్తున్నారు. ఆయన గతంలో ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌లో పనిచేసిన వ్యక్తే! ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, ప్రధాని మోదీ, బీజేపీ తెలంగాణ నేతలను లక్ష్యంగా చేసుకుని ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారంటూ హైదరాబాద్‌లోని సునీల్‌ కార్యాలయంపై తెలంగాణ పోలీసులు దాడి చేశారు. అక్కడ పని చేస్తున్న ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు. రాజకీయ విమర్శలు కాకుండా... వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులు పెట్టడమే దీనికి కారణమని పోలీసు అధికారులు చెప్పారు.

ఉదాహరణకు...

ఒక బ్రాండ్‌ టీ గురించి టీవీలో ప్రకటన వస్తోంది. తులసితో కూడిన ఆ టీ తాగితే.. అనారోగ్యానికి తక్కువ గురవుతారు అనేది కంటెంట్‌. ఆ ప్రకటనలోని కంటెంట్‌ను పూర్తిగా మార్చేసి టీ స్థానంలో మద్యం పెట్టారు. అందులో నటించిన నటీనటుల ముఖాలు మార్ఫింగ్‌ చేసి కవిత, కేసీఆర్‌, కేటీఆర్‌ల ఫొటోలు పెట్టి, ఈ లిక్కర్‌ తాగితే అనారోగ్యానికి తక్కువ గురవుతారు అంటూ వారు వీడియోను పోస్టు చేశారు. అలాగే... ‘మాయాబజార్‌’ పెట్టెను కేసీఆర్‌ తెరిస్తే అధికారం, భూములు కనిపించినట్లు, కేటీఆర్‌ తెరిస్తే అందమైన అమ్మాయిలు కనిపించినట్లు, కవిత తెరిస్తే బంగారం, నగలు కనిపించినట్లు, ప్రధాని నరేంద్రమోదీ తెరిస్తే అంబానీ, ఆదానీలు కనిపించినట్లు ఓ వీడియోను రూపొందించి పోస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఫిర్యాదులు అందినందునే చర్యలు తీసుకున్నామన్నారు.

ఏపీలో జరిగిన అరాచకం...

2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రశాంత్‌ కిశోర్‌ను వైసీపీ వ్యూహకర్తగా నియమించుకుంది. లక్ష్యం సాధించుకునేందుకు ఎలాంటి అరాచకాలకైనా పాల్పడవచ్చు... అంటూ అప్పట్లో చెలరేగిపోయారు. కులాల వారీగా చిచ్చు పెట్టారు. చంద్రబాబు సామాజికవర్గంపై ఇతర కులాల్లో ద్వేషం పెంచేందుకు అదే పనిగా అబద్ధాలు ప్రచారం చేశారు. ‘32 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి లభిస్తే... అందులో 30 మంది చంద్రబాబు సామాజిక వర్గమే’ అనే ప్రచారం అలాంటిదే! చంద్రబాబు కుటుంబంలోని మహిళలను, టీడీపీ మహిళా నేతలనూ కించపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. మహిళా నేతల నైతిక స్థైర్యం దెబ్బతినేలా తప్పుడు వీడియోలు, పోస్టర్లు తయారు చేయించారు. చంద్రబాబు ప్రసంగాలను ముందూ వెనుకా కట్‌ చేసి... అసంబద్ధంగా అతికించడం మరో ‘వ్యూహం’. ఉదాహరణకు... తన ప్రభుత్వ హయాంలో అవినీతిపరులను అడ్డుకోవడానికి కఠినంగా వ్యవహరించానని, వారికి నరకం చూపించానని చంద్రబాబు ఒక సభలో అన్నారు. ఆ వీడియోను ఎడిట్‌ చేసి తన పాలనలో ప్రజలకు నరకం చూపానని చంద్రబాబు అన్నట్లుగా తయా రు చేసి, సోషల్‌ మీడియాలో పెట్టారు. డేటా చోరీ పేరిట, కోడి కత్తి దాడి డ్రామా... ఇలాంటి ఎన్నెన్నో వ్యూహాలు నడిచాయి. ఇక... వైఎస్‌ వివేకా హత్యను వైసీపీ ఎలా వాడుకుందో అందరికీ తెలిసిందే.

సోషల్‌ మీడియా వేదికగా...

తప్పుడు వ్యూహాల అమలుకు కీలకం... సోషల్‌ మీడియా. తప్పుడు పోస్టర్లు, వీడియోలు తయారు చేసి... సోషల్‌ మీడియాలో పెట్టేందుకు వేలకు వేల నకిలీ అకౌంట్లు సృష్టించారు. వేలాది మందికి ఈ పని అప్పగించి... ఒక్కో పోస్టు పెడితే రూ.5 చొప్పున చెల్లించారు. చివరకు న్యాయ వ్యవస్థనూ వదల్లేదు. తప్పుడు ప్రచారాలు, వీడియోల తయారీకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పని చేయించుకున్నారు. ఈ ఆరోపణలకు వివరణ ఇవ్వడం, అసలు వాస్తవాలు చెప్పడానికే నాడు చంద్రబాబు సర్కారు పరిమితమైంది. ఈ ప్రచారాన్ని మూలాల వద్దే నరికే ప్రయత్నం చేయలేదు.

తెలంగాణలోనూ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకున్నాయి. తమ పార్టీకి మద్దతుగా ప్రత్యర్థుల పార్టీలకు వ్యతిరేకంగా విష ప్రచారానికి పూనుకుంటున్నాయి. ఇందులో ఏ పార్టీ అతీతంగా లేదు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ తరఫున ప్రశాంత్‌ కిశోర్‌ స్థాపించిన ఐప్యాక్‌ సేవలు అందిస్తుండగా, షర్మిల పార్టీకి సైతం ఐప్యాక్‌ సహకరిస్తోంది. బీజేపీకి ‘నేషన్‌ విత్‌ నమో’ సంస్థ రాజకీయ వ్యూహాలను రచిస్తోంది. ఈ సంస్థ తన కార్యకలాపాలను బీజేపీ రాష్ట్ర పార్టీ కేంద్రంగా కొనసాగిస్తోంది. పార్టీ పేరు, ఐటీ సెల్‌ పేర్లతో కాకుండా వేర్వేరు పేర్లతో సోషల్‌ మీడియాలో గ్రూపులు ప్రారంభించి ప్రత్యర్థి పార్టీలపై అభ్యంతరకర పోస్టులు పెట్టడం వీరికి సర్వసాధారణంగా మారాయి.

Updated Date - 2022-12-15T04:04:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising