అనుకున్నంత ఇవ్వలేకపోయాం
ABN, First Publish Date - 2022-02-07T08:42:16+05:30
కరోనా ప్రభావం, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆశించినంత, అనుకున్నంత స్థాయిలో పీఆర్సీ ఇవ్వలేకపోయామని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తన ఆమోదంతోనే పీఆర్సీలో మార్పులూ, చేర్పులూ జరిగాయని చెప్పారు. ఉద్యోగులకు ఏదైనా సమస్య..
నా ఆమోదంతోనే పీఆర్సీలో మార్పులూ, చేర్పులూ: సీఎం జగన్
అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆశించినంత, అనుకున్నంత స్థాయిలో పీఆర్సీ ఇవ్వలేకపోయామని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తన ఆమోదంతోనే పీఆర్సీలో మార్పులూ, చేర్పులూ జరిగాయని చెప్పారు. ఉద్యోగులకు ఏదైనా సమస్య ఉంటే అనామలీస్ కమిటీ ఉందని, మంత్రుల కమిటీ కూడా కొనసాగుతుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం, ఉద్యోగులంతా కలసి పనిచేద్దామన్నారు. సీపీఎ్‌సపై మెరుగైన విధానం కోసం ఆలోచిస్తున్నామని, త్వరలోనే ఉద్యోగులకు వివరించి సలహాలూ, సూచనలూ స్వీకరిస్తామని వెల్లడించారు. పీఆర్సీలో మార్పులు, చేర్పులు చేసినందుకు ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం తాడేపల్లి క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ ప్రభుత్వం మీది. ఉద్యోగుల సహకారం వల్లే మంచి చేయగలుగుతున్నాను.
మీ సహకారం లేనిదే సాధ్యం కాదు. శనివారం మంత్రుల కమిటీతో ఉద్యోగ నేతల చర్చలకు ముందు మంత్రులు నాతో సంప్రదింపులు జరిపారు. ఐఆర్ ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ 9 నెలల ఐఆర్‌ను సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల రూ.5400 కోట్ల భారం అదనంగా పడుతుంది. హెచ్‌ఆర్‌ఏను జనవరి నుంచి వర్తింపజేయడం వల్ల అదనంగా మరో రూ.925 కోట్ల భారం పడుతుంది. హెచ్‌ఆర్‌ఏకు మార్పులు, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్, సీసీఏ వల్ల మొత్తం రూ.1330 కోట్లు అదనంగా రికరింగ్ వ్యయం పెరుగుతుంది. పీఆర్సీ ప్రకారం ఏటా రూ.10,200 కోట్లు, దానికి అదనంగా ఈ రూ.1330 కోట్లు వ్యయం పెరుగుతుంది. ఏడాదికి మొత్తం రూ.11,577 కోట్లు భారం పడుతుంది. ఐఆర్ రూ.5,700 కోట్లు కూడా రిటైర్ అయ్యాక చేతికి అందుతుంది. ఐఆర్ విషయంలో ఆమోదించినందుకు ఉద్యోగులకు కృతజ్ఞతలు. చేయగలిగితే నా అంత లిబరల్‌గా ఎవరూ ఉండరు. నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒక్కటే మీరు లేకపోతే నేను లేను.
గవర్నమెంటు అంటే మనది. అంత దూరం పోకుండా కూడా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇది కూడా మనసులో పెట్టుకోండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదనుకుంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి’’ అని ఉద్యోగ సంఘాల నేతలతో జగన్ అన్నారు. ‘‘కాంట్రాక్టు ఉద్యోగులనూ రోస్టర్ పద్ధతిలో రెగ్యులరైజ్ చేస్తాం. 30,000 మంది టీచర్లను ఎస్‌జీటీ నుంచి సబ్జెక్ట్ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. విద్యార్థుల సంఖ్యను బట్టి సబ్జెక్ట్ టీచర్‌ను నియమిస్తాం. పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం’’ అని సీఎం అన్నారు.
Updated Date - 2022-02-07T08:42:16+05:30 IST