CM JAGAN KCR : జగన్నాటకం!
ABN, First Publish Date - 2022-12-15T02:32:44+05:30
ఉమ్మడి ఆస్తులు ఉన్నాయని... వాటిని పంచుకోవాలని జగన్ సర్కారుకు ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు గుర్తుకొచ్చింది. ‘‘రాష్ట్ర విభజన అనంతరం ఆస్తులు పంచలేదు. తెలంగాణలో 1.42 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి.
తెలంగాణలోని ఆస్తుల విభజనపై సరికొత్త డ్రామా
మూడున్నరేళ్లుగా ఆ ఊసెత్తని జగన్
కేసీఆర్‌తో ఎన్నడూ చర్చించని వైనం
కేంద్రం, కోర్టు చెప్పినా మౌనమే
ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్
సీఎం జగన్ చిత్తశుద్ధిపై సందేహాలు
‘మళ్లీ కలయిక’పై ఇటీవల సజ్జల వ్యాఖ్యలు
ఇప్పుడు ఆస్తులపై న్యాయ పోరాటం
కేసీఆర్‌కు సెంటిమెంట్ అస్త్రం అందించడమే వ్యూహమా?
ఇన్నేళ్లు మౌనం... నేడు పోరాటం!
మొన్నటికి మొన్న... ‘సమైక్య రాష్ట్రమే మా విధానం. ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి అవకాశం దొరికినా మళ్లీ కలిసిపోవడానికే మా ఓటు’ అంటూ తెలంగాణలో అధికార పార్టీకి సెంటిమెంటు అస్త్రం అందించాలని చూశారు. అది పెద్దగా ఫలించకపోవడంతో... ‘ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కలవడం ఎలా సాధ్యం’ అంటూ మాట సర్దుకున్నారు. ఇప్పుడు... ఆస్తుల విభజన పేరిట మరో కొత్త డ్రామాకు తెరలేపారు. పంపకాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ఉన్న అవకాశాలన్నీ వదులుకుని... మూడున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఖాళీగా కూర్చుని... ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఎవరి మేలు కోసం ఈ ‘జగన్నాటకాలు?’
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆస్తులు ఉన్నాయని... వాటిని పంచుకోవాలని జగన్ సర్కారుకు ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు గుర్తుకొచ్చింది. ‘‘రాష్ట్ర విభజన అనంతరం ఆస్తులు పంచలేదు. తెలంగాణలో 1.42 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో 91 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వెంటనే ఆస్తులు పంచేలా ఆదేశాలు ఇవ్వండి’’ అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఆస్తుల గురించి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా స్పందించలేదు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం గమనార్హం. రాష్ట్రంమీద, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద శ్రద్ధతోనే ఏపీ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించిందా? లేక ఇందులో కూడా కంటికి కనిపించని రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇవి కేవలం అనుమానాలు కాదు! ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను గమనిస్తే... ఇందులోనూ ఒక జగన్నాటకం దాగుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఏం చేయాలి?
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9లోని 91 సంస్థలు, షెడ్యూల్ 10లోని 142 సంస్థలు, ఇవి కాకుండా మరో 12 సంస్థల ఆస్తులు, అప్పులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. సంస్థలతోపాటు, పంపిణీ చేయాల్సిన ఆస్తుల విలువ నికరంగా 1,42,601 కోట్ల రూపాయలు. ఇందులో సింహభాగంగా అంటే 91 శాతం హైదరాబాద్ మహానగరంలోనే ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీలో కేంద్రం పెద్దన్నపాత్ర పోషించాలి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ కూర్చొని విభజన అంశాలపై తేల్చుకోవాలని కేంద్రం పలుమార్లు చెప్పింది. తరచూ సమావేశాలు నిర్వహించుకొని, సంక్లిష్టంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఆస్తుల పంపిణీని సులభతరం చేసుకోవాలని సలహాలు ఇచ్చింది. పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు కూడా ఇదే సలహా ఇచ్చింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణలు సమావేశమై ఆస్తుల పంపిణీపై చర్చించుకున్నాయా? వివాదాలు పరిష్కారమయ్యాయా? అంటే లేనే లేదు. ఈ మూడున్నరేళ్లలో జగన్ ఒక్కసారి కూడా ఈ అంశంపై దృష్టి సారించలేదు.
అసలు ఏమైనా చేశారా?
ఆస్తుల పంపిణీ కోరుతూ జరిగిన చర్చలు, సంప్రదింపులు విఫలమయ్యాయా? కేంద్ర దౌత్యం పనిచేయలేదా? చివరి ప్రయత్నంగానే సుప్రీంకోర్టును ఆశ్రయించారా? అంటే లేనే లేదు. అధికారంలోకి వచ్చిన మొదటి ఐదారు నెలలు రాష్ట్రం పరిస్థితి గురించి అర్థం చేసుకోవడానికి సమయం తీసుకున్నారని భావించినా... ఆ తర్వాత మూడేళ్లలో విభజన హామీల అమలు, ఆస్తుల పంపిణీ గురించి ఎన్నడూ మాట్లాడలేదు. అధికారులతో సమీక్షలు నిర్వహించలేదు. తెలంగాణకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి... ఏపీకి దక్కాల్సిన ఆస్తుల గురించి చర్చించలేదు. సాగునీటి ప్రాజెక్టులపై ఒకటి రెండుసార్లు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. కానీ... ఆస్తుల పంపిణీపై ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారుల స్థాయిలో సమావేశాలు జరగలేదు. ఈ విషయంలో కేవలం అధికారుల స్థాయిలో సమావేశాలు జరిగితే ఉపయోగం లేదు. ఎందుకంటే విధాన నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వాధినేతలే. ఈ విషయంలో జగన్ సర్కారు ఇప్పటి వరకు ఒక్కసారికూడా చొరవ తీసుకోలేదు. కనీసం తన మంత్రులనైనా చర్చలకు పంపించలేదు. నిజానికి ఆస్తులు ఉన్నవి తెలంగాణలో. అందువల్ల ఏపీనే చొరవ తీసుకుని తమకు కావాల్సినవి దక్కించుకోవాలి. ఏపీనే గట్టిగా చర్చలకు పట్టుబట్టనప్పుడు కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుంది? చర్చలే జరగనప్పుడు సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? చర్చలే జరపకుండా, సంప్రదింపులు చేయకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడంలో పెద్ద జగన్నాటకమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కేసీఆర్ చేతికి మరో అస్త్రం....
తెలంగాణలో రాజకీయ వేడి తారస్థాయికి చేరుకుంది. అధికార టీఆర్‌ఎస్ బీఆర్‌ఎ్‌సగా మారింది. ఏడాదిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఆ పార్టీ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను బలంగా నమ్ముకుంది. ఈ క్రమంలో... మొన్నటికి మొన్న ‘మళ్లీ కలిసిపోవడానికే మా ఓటు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్‌ఎస్ (ఇప్పుడు బీఆర్‌ఎస్) నేతలు భగ్గుమన్నారు. తమకు బాగా కలిసి వచ్చే సెంటిమెంటు అస్త్రాన్ని బయటికి తీశారు. అయితే... ఈ వ్యాఖ్యలు ‘బూమరాంగ్’ కావడంతో సజ్జల తన స్వరం సవరించుకున్నారు. ఈసారి జగన్ సర్కారు ఆస్తుల పంపిణీ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. సుప్రీం కోర్టులో కేసు వేసింది. దీనివల్ల రెండు లాభాలున్నాయని భావిస్తున్నారు. ఒకటి... రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని, ఆస్తుల కోసం ఏకంగా సుప్రీంకోర్టులోనే న్యాయ పోరాటం చేస్తున్నామని ప్రజలకు చెప్పుకోవడం! రెండు... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎ్‌సకు తిరుగులేని ‘సెంటిమెంటు’ అస్త్రాన్ని అందించడం! తెలంగాణ ఆస్తులను తీసుకెళ్లేందుకు ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో కేసు వేసిందంటూ సహజంగానే సెంటిమెంట్‌ను రాజేస్తారని, ఇప్పటికే దీనికి తెలంగాణలో చాలా గట్టి ప్రాతిపదికనే సిద్ధం చేశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రయోజనాల పేరిట వేసిన కేసు అంతిమ ఉద్దేశం రాజకీయంగా తన మిత్రుడైన కేసీఆర్‌కు ఉపకారం చేయడమేనని భావిస్తున్నారు. ఈ డ్రామాను రక్తికట్టించేందుకు ఏపీలో కూడా ఆస్తుల పంపిణీ పేరిట ఆందోళనలు, ఉద్యమాలు పుట్టించవచ్చునని కూడా అనుమానిస్తున్నారు! అంటే... అప్పుడు ఈ నాటకం మరింత రక్తి కడుతుందన్న మాట!
సరెండర్.. సైలెంట్!
ఏపీ ప్రయోజనాలకు సంబంధించి జగన్ సర్కారుది ‘సరెండర్ - సైలెంట్’ పాలసీయే! అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల విషయంలో తెలంగాణ సర్కారుతో అన్ని రకాలుగా పోరాడింది. కార్మిక శాఖకు చెందిన ఉమ్మడి నిధులను కేసీఆర్ సర్కారు తరలిస్తుండటంతో... మొత్తం నిధులను విజయవాడలోని బ్యాంకు ఖాతాకు తరలించారు. ఇంటర్మీడియట్ బోర్డు నిధుల విషయంలో సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోరాడారు. విభజన తర్వాత పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున... అనేక ప్రభుత్వ భవనాలను ఏపీకి కేటాయించారు. సచివాలయం, బూర్గుల రామకృష్ణారావు భవన్, ఇరిగేషన్, మునిసిపల్ డెవల్‌పమెంట్ సహా అనేక భవనాలు ఏపీ ఆధీనంలో ఉన్నాయి. వాటిని తమకు అప్పగించాలని కేసీఆర్ సర్కారు కోరుతూనే ఉన్నప్పటికీ... ఆస్తుల విభజన అంశం తేలకుండా, భవనాలపై హక్కులు వదులుకోవడం వ్యూహాత్మకంగా సరికాదని చంద్రబాబు సర్కారు భావిస్తూ వచ్చింది. ఆస్తుల విభజనపై కేంద్రం నియమించిన షీలాబేడీ కమిటీ... ఎన్నికలకు కొన్ని నెలల ముందు నివేదిక సమర్పించింది. ఈ కమిటీనిగానీ, ఆస్తుల విభజన నివేదికనుగానీ తెలంగాణ సర్కారు గుర్తించలేదు. ఈ నేపథ్యంలో... ఆస్తుల పంపిణీకి తెలంగాణను ఒప్పించేలా, ప్రభుత్వ భవనాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ... జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన నెలరోజులకే మొత్తం హైదరాబాద్‌లోని భవనాలపై హక్కును వదులుకున్నారు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌ్‌సతోపాటు మరొక్క భవనం మాత్రం చాలునని లిఖితపూర్వకంగా చెప్పేశారు. దీంతో... ఆస్తుల విభజన విషయంలో తెలంగాణపై ఒత్తిడి తెచ్చేందుకు ఎలాంటి అస్త్రమూ లేకుండా పోయింది. ఇలా అన్నీ వదులుకుని, మూడున్నరేళ్లు మౌనంగా ఉండి... ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరి... జగన్ చిత్తశుద్ధిని నమ్మేదెలా?
ఆస్తులు విభజించండి!
2014లోనే రాష్ట్ర విభజన జరిగింది
ఉమ్మడి సంస్థల ఆస్తులు పంచలేదు
దీనివల్ల రాష్ట్ర ప్రజల హక్కులకు భంగం
వేగంగా ఆస్తుల విభజనకు ఆదేశించండి
సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు పిటిషన్
న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజన వేగంగా జరిగేలా ఆదేశాలివ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో ప్రభుత్వ న్యాయవాది మహ్‌ఫూజ్ నజ్కీ బుధవారం ఈ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిష్పక్షపాతంగా, సమానంగా, వేగవంతంగా ఆస్తులు, అప్పుల విభజన జరగాలని అందులో కోరారు. ‘‘2014 జూన్‌లో రాష్ట్ర విభజన జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఇప్పటికీ ఆస్తులు, అప్పుల పంపిణీ జరగలేదు. విభజన చట్టంలోని షెడ్యూలు 9లో 91 సంస్థలు, షెడ్యూల్ 10లో 142, ఇతరత్రా 12 సంస్థలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క సంస్థ ఆస్తులు, అప్పులను ఇప్పటి వరకు విభజించలేదు. సంస్థల విభజన జరగకపోవడం వల్ల రూ.1,42,601 కోట్ల లబ్ధి తెలంగాణకు దక్కుతోంది. హైదరాబాద్‌లోనే 91 శాతం ఆస్తులు ఉన్నాయి’’ అని ఏపీ సర్కారు తెలిపింది. ఆస్తుల విభజన జరగకపోవడంతో రాష్ట్ర ప్రజల ప్రాథమిక, ఇతర రాజ్యాంగ హక్కులకు తీవ్రంగా విఘాతం కలుగుతోందని పేర్కొంది. ఆ సంస్థల ఉద్యోగుల హక్కులు కూడా ప్రశ్నార్థకంగా మారాయని తెలిపింది. ‘‘విభజన జరగకపోవడం వల్ల ఈ సంస్థల్లో పనిచేస్తున్న 1,59,096 మంది ఉద్యోగుల పరిస్థితి 2014 నుంచి గందరగోళంలో ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రిటైర్ అయిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. వారిలో చాలా మందికి రిటైర్‌మెంట్ ప్రయోజనాలు అందలేదు. సంస్థల ఆస్తుల విభజన జరగకపోవడం వల్ల వాటి కార్యకలాపాలు సరిగ్గా సాగడంలేదు. దీంతో రాష్ట్ర ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. సంస్థల విభజనపై తెలంగాణ రాష్ట్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు నిర్ధారించి... వేగవంతంగా విభజన జరిగేలా ఆదేశాలు జారీ చేయాలి’’ అని సుప్రీంకోర్టును ఏపీ సర్కారు కోరింది. రాష్ట్ర ప్రజల హక్కులతోపాటు ప్రభుత్వ హక్కుల కోసం ఈ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నట్లు పేర్కొంది.
ఇవీ ఆ ఆస్తులు
ఆస్తివిలువ(కోట్లలో) తెలంగాణలో ఉన్నవి (శాతం)
షెడ్యూలు 9 24,018.53 22,556.45 (93.9ు)
షెడ్యూల్ 10 34,642.77 30,530.86 (88ు)
ఇతర సంస్థలు 1759 1759 కోట్లు (100ు)
Updated Date - 2022-12-15T04:05:43+05:30 IST