ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు..!
ABN, First Publish Date - 2022-12-16T00:47:41+05:30
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో కటాఫ్ ఇచ్చే విద్యాశాఖ ఈ ఏడాది జీరో సర్వీసుకు ఆమోదం తెలిపింది. అంటే, కొత్తగా విధుల్లో చేరిన వాళ్లూ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా అందరికీ అవకాశం రాగా.. తాము కోరుకున్న ప్రాంత పాఠశాలల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేపట్టారు.
ఊపందుకున్న టీచర్ల బదిలీ ప్రక్రియ
గురువారానికి 400 దరఖాస్తులు
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 15: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో కటాఫ్ ఇచ్చే విద్యాశాఖ ఈ ఏడాది జీరో సర్వీసుకు ఆమోదం తెలిపింది. అంటే, కొత్తగా విధుల్లో చేరిన వాళ్లూ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా అందరికీ అవకాశం రాగా.. తాము కోరుకున్న ప్రాంత పాఠశాలల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేపట్టారు. సర్దుబాట్లతో పాటు బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తమ ప్రయత్నాలు చేపట్టారు. బదిలీలకు బుధవారం మొదలైన ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ తొలి రోజు మందకొడిగా సాగినా, రెండో రోజైన గురువారం ఊపందుకుంది. 400 మంది ఉపాధ్యాయులు బదిలీలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇక, సర్దుబాట్లకు కొందరు ఉపాధ్యాయులు అధికార పార్టీనేతల సిఫార్సు లేఖలపై ఆధారపడుతూనే బదిలీలకూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటున్నారు. జిల్లాలోని 2483 పాఠశాలల్లో 8535 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మండల స్థాయిలో ఎంఈవోలు ఆప్‌డేట్ చేసిన సీనియారిటీ జాబితాను డీఈవో సైట్‌లో పొందుపర్చారు. ఇందులోనూ పొరబాట్లు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. తాము పనిచేసిన స్థానాల్లో ఎంత కాలం, పాఠశాలకు చేకూర్చిన ప్రయోజనం, తదితర వాటితో పాటు ఇతర వాటికి పాయింట్లు కేటాయిస్తారు. జీరో సర్వీసు ఇవ్వడంతో వీటికి విలువ లేకుండా పోయిందని అంటున్నారు. పుట్టిన తేది ఒక్కటే వచ్చిన వారికి సీనియారిటీ ఎలా తీసుకోవానే దానిపై స్పష్టత లేదు.
సర్దుబాటుకు ముమ్మర యత్నాలు
ఉపాధ్యాయుల అనారోగ్యమే కాదు.. ఆ ఉద్యోగి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు అనారోగ్యం ఉన్నా పరిగణలోకి తీసుకోవాలని ఆప్షన్ ఇవ్వడంతో ఈ దిశగా సర్దుబాట్లు, బదిలీలకు అడుగులు వేసే యత్నంలో ఉన్నారు. బదిలీల కంటే ముందుగా కోరుకున్న ప్రాంత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని డీఈవోపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరిది యూనియన్ నాయకుల సిఫార్సులేతే.. మరి కొందరిది అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సులు ఉన్నాయి. ఆరోగ్య సమస్యల కారణంగా బదిలీలు, సర్దుబాట్లు చేయాలని ఇప్పటి వరకు వచ్చిన 16 దరఖాస్తులను డీఎంహెచ్‌వో కార్యాలయానికి విద్యాశాఖ అధికారి పంపుతున్నారు. శుక్రవారం నుంచి ఇలాంటి దరఖాస్తులను జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిపుణుల వైద్య బృందం పరిశీలించి నిర్ధారించనున్నారు.
Updated Date - 2022-12-16T00:47:45+05:30 IST