ఏం చేశామని ఎన్నికల్లో ఓట్లడగాలి?
ABN, First Publish Date - 2022-12-31T02:05:30+05:30
.ప్రజలు ఏమి చేశారని తిడుతున్నారు...ఇలాగైతే రేపు ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు ఎలా వెళ్లాలి.....అంటూ కౌన్సిల్ సమావేశంలో వైసీపీకి చెందిన కౌన్సిలర్లు ఆవేదన వెళ్లగక్కారు.
సూళ్లూరుపేట, డిసెంబరు 30: అసలు సూళ్లూరుపేట మున్సిపాలిటీలో పాలకవర్గం ఉందా...ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారా...ప్రజల సమస్యలు తీరుస్తున్నారా...గెలిచి రెండేళ్లయినా కనీసం రోడ్లు, నీటి కుళాయిలు వేయించలేకపోతున్నాం... ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం...మేము ఎందుకు ఉన్నామో మాకే తెలియడం లేదు...ఉదయం లేచినప్పటి నుంచి వార్డుల్లోకి వెళ్లాలంటే భయమేస్తోంది....ప్రజలు ఏమి చేశారని తిడుతున్నారు...ఇలాగైతే రేపు ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు ఎలా వెళ్లాలి.....అంటూ కౌన్సిల్ సమావేశంలో వైసీపీకి చెందిన కౌన్సిలర్లు ఆవేదన వెళ్లగక్కారు. శుక్రవారం స్థానిక స్ర్తీ స్వశక్తి భవనంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. మొత్తం 6 అంశాలపై జరిగిన ఈ సమావేశంలో అన్ని అంశాలనూ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం వార్డులో నెలకొన్న సమస్యలపై సభ్యులందరూ గళం విప్పారు. ముందుగా 7వ వార్డు కౌన్సిలర్ సన్నారెడ్డి సౌజన్య మాట్లాడుతూ ‘చైర్మన్ గారూ... అడుగుతున్నానని కోపం చేసుకోవద్దు... ప్రతిసారీ అడుగుతూనే ఉన్నా... వార్డులో గుంతలు తవ్వి వదిలేశారు. అధికారులు అడిగితే సమాధానం లేదు..డీఈ గారికి తీరికే లేదు.. ఎప్పుడు ఏమి అడిగినా బిజీగా ఉన్నానని సమాధానం చెబుతారు. ఇలాగైతే మేమేందుకు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 18వ వార్డు కౌన్సిలర్ జనార్దన్ కలుగజేసుకొని మున్సిపాలిటీలో పాలకవర్గం ఉందా.. లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంటింటికీ కుళాయి పేరుతో రోడ్లను ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలేస్తున్నారు. ఆ తవ్విన రోడ్డును ఎవరు వేయాలి... అధికారులు సమాధానం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వ వార్డు కౌన్సిలర్ కడూరు లక్ష్మమ్మ జోక్యం చేసుకొని ‘నేను ఒక్కదాన్నే మిమ్మల్ని అడుగుతున్నా..ఓట్లేసిన ప్రజలు తిడుతున్నారు..సమాధానం ఏం చెప్పాలి అఽంటూ నిలదీశారు. ఇంజినీరింగ్ విభాగ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే కనీసం రోడ్లు కూడా వేయలేకపోతున్నామన్నారు. రెండు నెలల నుంచి బజారు వీధిలో రోడ్లను ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా తవ్వడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ అధికారుల తీరును తప్పుబట్టారు. అనంతరం చైర్మన్ జోక్యం చేసుకొని అన్ని సమస్యలపై ఒక సమావేశం పెట్టి చర్చించుకుని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T02:05:33+05:30 IST