మా తండ్రి మృతికి కారకులపై చర్యలు తీసుకోండి
ABN, First Publish Date - 2022-08-04T06:45:03+05:30
తమ తండ్రి ఇంద్రసేన మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుమార్తెలు భారతి, సరస్వతి డిమాండ్ చేశారు.
వామపక్ష నేతలతో కలిసి అలిపిరి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఇంద్రసేన కుమార్తెలు
తిరుపతి సిటీ, ఆగస్టు 3: తమ తండ్రి ఇంద్రసేన మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుమార్తెలు భారతి, సరస్వతి డిమాండ్ చేశారు. తమ తల్లి, వామపక్ష నేతలతో కలిసి బుధవారం రుయాస్పత్రి ముందు అలిపిరి రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇంద్రసేన కుమార్తెలు మాట్లాడుతూ.. రెండేళ్ల కిందట సారా కేసులో తమ తండ్రి ఇంద్రసేనను అదుపులోకి తీసుకున్న పోలీసులు అదేరోజు తమ వద్ద నుంచి రూ.10వేలను తీసుకుని విడిచిపెట్టారన్నారు. కానీ ఈనెల ఒకటో తేదీన చిత్తూరు పోలీసులు తమ ఇంటి వద్దకు వచ్చి విచారణ నిమిత్తం ఇంద్రసేనను తీసుకెళుతున్నామని, వెంటనే పంపిస్తామని చెప్పారన్నారు. తర్వాత స్టేషనుకు అక్కడి నుంచి జైలుకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని అందుకే తమ తండ్రి మృతి చెందాడని ఆరోపించారు. అలాగే తమ తండ్రి ఎలా చనిపోయాడని ప్రశ్నించిన తమ సోదరుడు ఫల్గుణను కులం పేరుతో దూషించడమే కాకుండా దాడికి పాల్పడిన పోలీసుపై అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా దళితులపై దాడికి పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని వామపక్ష నేతలు, జనసేన, ఎమ్మార్పీఎస్ నేతలు హెచ్చరించారు. అనంతరం అలిపిరి సీఐ అబ్బన్న బాధితులతో మాట్లాడి విచారించి న్యాయం చేస్తామని చెప్పడంతో నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సబ్‌జైలు వార్డెన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 3: తిరుపతి సబ్‌జైలు వార్డెన్ జనార్దనరెడ్డిపై అలిపిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేశారు. అలిపిరి సీఐ అబ్బన్న తెలిపిన వివరాల ప్రకారం.. పుత్తూరు మండలం టీఆర్ కండ్రిగ కాలనీకి చెందిన ఇంద్రసేన (56)ను నాటుసారా కేసులో పుత్తూరు ఎక్సైజ్ పోలీసులు సోమవారం సాయంత్రం తిరుపతి సబ్‌జైలుకు తరలించారు. మంగళవారం సాయంత్రం ఇంద్రసేనకు ఆరోగ్యం బాగలేనందున రుయాస్పత్రికి తీసుకెళ్తున్నామంటూ తిరుపతి సబ్‌జైలు సిబ్బంది ఇంద్రసేన కుమారుడు ఫల్గుణకు ఫోన్‌చేసి చెప్పారు. ఐతే తాను వచ్చేటప్పటికి తన తండ్రి ఆస్పత్రిలో మరణించి ఉన్నాడని, సోమవారం బాగా ఉన్న తన తండ్రి మంగళవారానికి ఎలా మృతిచెందాడని ప్రశ్నించాడు. దాంతో అక్కడే ఉన్న జైలు వార్డెన్ జనార్దనరెడ్డి తనపై చేయిచేసుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించాడంటూ అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి పోలీసులు సబ్‌జైలు వార్డెన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేశారు.
Updated Date - 2022-08-04T06:45:03+05:30 IST