తిరుపతికి రిజిస్ట్రేషన్ డిఐజీ కార్యాలయం
ABN, First Publish Date - 2022-01-30T04:33:32+05:30
మూడు జిల్లాలుగా విడిపోతున్న ప్రస్తుత చిత్తూరు జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ భవిష్యత్తులో ఎలా ఉండొచ్చన్న ఊహాగానాలు సాగుతున్నాయి. 1864లో ఏర్పడిన రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ అప్పట్లో నార్త్ ఆర్కాడు జిల్లాలో ఉన్న చిత్తూరు, తిరుపతి, పుత్తూరులలో ప్రారంభమైంది.
విభజనతో అనేక మార్పులు
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 29: మూడు జిల్లాలుగా విడిపోతున్న ప్రస్తుత చిత్తూరు జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ భవిష్యత్తులో ఎలా ఉండొచ్చన్న ఊహాగానాలు సాగుతున్నాయి. 1864లో ఏర్పడిన రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ అప్పట్లో నార్త్ ఆర్కాడు జిల్లాలో ఉన్న చిత్తూరు, తిరుపతి, పుత్తూరులలో ప్రారంభమైంది. ప్రస్తుతం 25సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో కొనసాగుతోంది. 1995 నుంచి చిత్తూరు రిజిస్ట్రేషన్ జిల్లాతో పాటు శ్రీబాలాజీ రిజిస్ట్రేషన్ జిల్లాను ఏర్పాటు చేశారు. చిత్తూరులో రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ డీఐజీ కార్యాలయం ఉంది. ఏటా రూ.285 కోట్లు ఆర్జిస్తున్న శ్రీబాలాజీ రిజిస్ట్రేషన్‌శాఖలో 12, చిత్తూరు పరిధిలో 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. జిల్లాల విభజన తర్వాత చంద్రగిరి, పాకాల, పిచ్చాటూరు, రేణిగుంట, తిరుపతి ఆర్వో, తిరుపతి రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు శ్రీబాలాజి జిల్లాలో యథాతధంగా కొనసాగుతాయి. కార్వేటినగరం, నగరి, పుత్తూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు చిత్తూరు పరిధిలోకి మారుతాయి. సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు.. నాయుడుపేట రెవెన్యూ డివిజన్‌లోకి చేరుతాయి. ఇక చిత్తూరు ఆర్వో, చిత్తూరు రూరల్, బంగారుపాళ్యం, పుంగనూరు, పలమనేరు, కుప్పం లు చిత్తూరు జిల్లాలో కొనసాగుతాయి. అన్నమయ్య జిల్లాలోకి కలికిరి, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, వాయల్పాడు, బి.కొత్తకోట ఎస్‌ఆర్ కార్యాలయాలు విలీనం అవుతాయి. ప్రాధాన్యం దృష్ట్యా డీఐజీ కార్యాలయం తిరుపతిలో ఏర్పడవచ్చు. చిత్తూరులో కూడా డీఐజీ కార్యాలయం కొనసాగుతుందా అనే సందేహం ఉంది. విభజన తర్వాత జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్ల పోస్టులు పెరిగే అవకాశాలున్నాయి.
Updated Date - 2022-01-30T04:33:32+05:30 IST