బీహార్‌లా పుంగనూరు
ABN, First Publish Date - 2022-12-07T02:03:19+05:30
అక్కడ గుడి కట్టాలన్నా వారే కట్టాలి. ఒక దుకాణం ప్రారంభించాలన్నా వారే రిబ్బన్ కత్తిరించాలి. ఒక బోరు వేయాలన్నా, ఒక ర్యాలీ తీయాలన్నా, ఒక ఆథ్యాత్మిక కార్యక్రమం జరపాలన్నా చేస్తే వారే చేయాలి. వారు కాక ఇంకెవరు ఏ మంచి పని తలపెట్టినా వారికి చిర్రెత్తుకొస్తుంది. పోలీసులు అనుమతివ్వరు. కాదని అడుగు ముందుకు వేస్తే కేసులు పెడతారు. అప్పటికీ వినకపోతే గుంపులుగా వచ్చి దాడులు చేస్తారు. రాజకీయాల్లోనే కాదు, రాజకీయేతరులూ తమ కటాక్షం లేకుండా కాలు కదపడానికి లేదంటారు. ఏ ఎన్నికలొచ్చినా నామినేషన్లే వేయనివ్వరు. వేస్తే తంతారు. కాయితాలు పీక్కుని చించేస్తారు. .. ఇదంతా ఏ బీహార్ గురించో అనుకుంటే పొరపాటే. అచ్చంగా మన చిత్తూరు జిల్లాలోనే మూడేళ్లుగా పుంగనూరు నియోజకవర్గంలో సాగుతున్న తంతు ఇది.
చిత్తూరు, ఆంధ్రజ్యోతి: పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి సంఘటనతో పుంగనూరు మరోమారు వార్తల్లోకి ఎక్కింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో అసలేం జరగుతోందనే చర్చ మొదలైంది. మూడేళ్లుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు సాగిస్తున్న విధ్వంసకాండకు అడ్డులేకుండా పోతున్న తీరు అందరినీ విస్మయపరుస్తోంది. ఈ మూడున్నరేళ్లలో ఏకంగా 300 మంది ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో 60 మంది మీద ఏకంగా హత్యాయత్నం కేసులే పెట్టారు. ప్రత్యర్థి ఏ మాత్రం యాక్టివ్‌గా ఉన్నా వెంటనే కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఎందుకింత కక్ష?
పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండిపోయినా ఏదో ఒక కార్యక్రమంతో క్రియాశీలంగా ఉంటున్నారు. జనంలో ఉండడమే ఆయన చేసిన నేరం అయ్యింది. ఆయన మీద కక్ష గట్టారు. కొంత కాలం కిందట రామచంద్రయాదవ్ 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 150 కంపెనీలతో మాట్లాడి పుంగనూరులో మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేశారు. దీనికి స్కూల్ గ్రౌండ్స్ ఇవ్వలేదు. సొంత స్థలంలో నిర్వహించడానికి సిద్ధమయ్యారు. రాత్రిపూట పోలీసులు మేళా ఏర్పాట్లను ధ్వంసంచేశారు. 144 సెక్షన్ పెట్టారు. రెండేళ్ల కిందట రామచంద్రయాదవ్ నియోజకవర్గంలోని పేద ప్రజలందరికీ ఉచితంగా బట్టలు, క్యాలండర్, స్వీట్లు పంపిణీ చేసేందుకు బెంగళూరు నుంచి జీఎస్టీ రసీదులతో సహా సరుకులను తెచ్చినా, వాహనాలను సీజ్ చేసి పంపిణీ జరగకుండా చేశారు. తాజాగా రైతు సదస్సు నిర్వహణకు పూనుకోవడంతో రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. పైగా ఎదురు కేసులు పెట్టారు. భవిష్యత్తులో రాజకీయంగా ఆయన ఎక్కడ బలపడుతారో అనే భయమే ఈ దౌర్జన్యాలకు తెగబడేలా చేస్తోందని భావిస్తున్నారు.
రాజారెడ్డి కాళ్లు విరిచేశారు
సదుం మండలం బూరగమందకు చెందిన టీడీపీ నాయకుడు రాజారెడ్డి పార్టీలో యాక్టివ్‌గా ఉన్నాడని, కొందరు వైసీపీ నేతలు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి కల్లూరు ఘాట్‌లో పడేశారు. అతని రెండు కాళ్లూ విరిగిపోయాయి. వేలూరు ఆసుపత్రిలో ఆరు నెలల పాటు చికిత్స చేసుకున్నా, ఆయన ఇప్పటికీ నడవలేకపోతున్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే సదుం పోలీసులు కేసు నమోదు చేయలేదు. న్యాయం చేయాలని టీడీపీ నాయకులు కల్లూరులో ధర్నా చేయగా.. వారి నిరసనను పోలీసులు భగ్నం చేశారు. రాజారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఏడాది మే 8న చిత్తూరులో పరామర్శించారు.
గుడి కడితే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంట!
టీడీపీ నేత, బోయకొండ మాజీ చైర్మన్ ఎస్‌కే రమణారెడ్డి చౌడేపల్లెలో పాడుపడ్డ మృత్యుంజయస్వామి ఆలయాన్ని పునరుద్ధరించారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఈవోతో ఫిర్యాదు చేయించి మరో నాన్‌బెయిలబుల్ కేసును నమోదు చేశారు. ఎస్‌కే రమణారెడ్డి, రతీదేవి దంపతులు దర్శనానికి వెళితే, అక్కడి సిబ్బంది గేట్లు, కౌంటర్లు మూసేశారు. పైగా ఉద్యోగులను కులం పేరుతో దూషించినట్లు ఎదురు కేసులు పెట్టారు.
ఫ పుంగనూరు నుంచి రమణారెడ్డి అనుచరులతో కలిసి కుప్పం చంద్రబాబు పర్యటనకు వెళ్లారు. తెల్లారేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఎక్స్‌కవేటర్‌తో ఆయన నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు.
ఫ చౌడేపల్లె బస్టాండు వద్ద అడ్డంగా ఉందని ఆర్‌అండ్‌బీ డీఈతో ఫిర్యాదు చేయించి టీడీపీ జెండా దిమ్మెను పోలీసులు ధ్వంసం చేశారు. అడ్డుకున్న టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
ఫ పుంగనూరు మండలం వనమలదిన్నెలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదని వైసీపీ నేత మనోహర్ అడ్డుకున్నారు. అతని మీద టీడీపీ నేతలు దాడి చేసినట్లు పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
పోలీసుల ఎదుటే కొట్టారు
సోమల ఇరికిపెంట మాజీ సర్పంచి శ్రీనివాసులు నాయుడుపైన పలు కేసులు నమోదు చేసి స్టేషన్లో ఉంచారు. పోలీసుల ముందే వైసీపీ నేతలు కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నారు.
పెద్దిరెడ్డి అరాచకాలపై పోరాటం ఆగదు : పుంగనూరులో రామచంద్రయాదవ్ స్పష్టీకరణ
పుంగనూరు, డిసెంబరు 6: పుంగనూరులో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు, అరాచకాలపై తన పోరాటం ఆగదని పారిశ్రామికవేత్త బి.రామచంద్రయాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు సమస్యలు, దోపిడీపై రైతుభేరి నిర్వహించకుండా పోలీసుల ద్వారా అడ్డుకోవడం దారుణమన్నారు. ‘నా కుటుంబాన్ని హతమార్చడానికి, వందలాది మంది వైసీపీ గుండాలు ఇంటిపై దాడి చేశారు. విధ్వంసం సృష్టించారు. దీనిపై రాజకీయాలకు అతీతంగా చాలా మంది ఇచ్చిన మద్దతు, ధైర్యాన్ని మరచిపోలేను. నాకు సంఘీభావం తెలిపిన టీడీపీ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, సీపీఐ జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, రామకృష్ణ, టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాల నేతలందరికీ ధన్యవాదాలు. పలుచోట్ల ఆందోళనలు చేపట్టిన.. దాడికి ఖండించి నాకు ధైర్యాన్నిచ్చిన ప్రజాసంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరింత నాయకులకు కృతజ్ఞతలు. వీరందరి ప్రోత్సాహంతో వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలు, దారుణాలపై గట్టిగా పోరాడతా’నని రామచంద్రయాదవ్ తెలిపారు. రైతు, ప్రజల పక్షాన ఉంటానన్నారు.
నేడు చలో పుంగనూరు
పుంగనూరు, డిసెంబరు 6: పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ను పరామర్శించడానికి బుధవారం ‘చలో పుంగనూరు’ కార్యక్రమం తలపెట్టినట్లు అఖిలభారత యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు తెలిపారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. పుంగనూరులో రాజకీయాలకు అతీతంగా 10 వేల మంది యువతకు మెగా జాబ్‌మేళా ద్వారా ఉద్యోగాలు ఇవ్వడానికి రామచంద్ర యాదవ్ ప్రయత్నించినా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తాజాగా రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా చేశారని, ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యా లు, కేసులు పెట్టడం వైసీపీ నేతలకు అలవాటన్నారు. ‘జయహో బీసీ’ సభను వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తూ, మరోవైపు పుంగనూరులో బీసీ నేతను అడ్డుతొలగించేలా దాడి చేయడం ఎక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. పుంగనూరులో ఎలాంటి పాలన ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులు, బీసీ కులాల వారు రామచంద్రయాదవ్‌ను రాజకీయాలకు అతీతంగా పరామర్శించి సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే వైసీపీ కార్యకర్తల దాడి: పలమనేరు డీఎస్పీ
పుంగనూరు రూరల్, డిసెంబరు 6: ‘పుంగనూరులో రామచంద్రయాదవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆయన ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారు’ అని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. పుంగనూరు, చౌడేపల్లె సీఐలు గంగిరెడ్డి, మధుసూదన్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సదుంలో 4న రైతుభేరి సభకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్వాహకులు వివరాలు ఇవ్వలేదన్నారు. సదుం బస్టాండు పరిధిలో ట్రాఫిక్ సమస్య ఉందని, పోలీస్ 30యాక్ట్ ఉందని పత్రికల ద్వారా తెలిపామన్నారు. సదుం సమీపంలోని కావమ్మ గుడి వద్ద సభ నిర్వహిస్తామని వారు చెప్పినా, దేవదాయశాఖ నుంచి అనుమతులు తేలేదన్నారు. రైతుభేరి సభ నిర్వహిస్తామని రామచంద్రయాదవ్ మీడియాకు చెప్పడం, ఆయన ఇంటి వద్దకు జనం చేరుతున్నట్లు తెలిసి ఎస్‌ఐ మోహన్‌కుమార్ 149 నోటీసు ఇచ్చారన్నారు. ఆయన సదుం వెళ్లడానికి కారులో బయలుదేరగా ముందస్తు అరెస్టు చేశామన్నారు. అనంతరం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆయన మంత్రిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ కార్యకర్తలు ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేశారన్నారు. ఈ సమాచారం రాగానే 15 నిమిషాల్లోపు ఎస్‌ఐ మోహన్‌కుమార్, పుంగనూరు రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని వారిని తరిమేశారన్నారు. రెండు రోజులుగా పోలీసులు సహకరించలేదని రామచంద్ర యాదవ్ చెప్పడం బాధాకరమన్నారు. 5వ తేది తెల్లవారుజామున 1.27 గంటలకు రామచంద్రయాదవ్ పీఏ వాట్సప్ ద్వారా పంపిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వైసీపీ నేతలదీ అదే మాట
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే వైసీపీ కార్యకర్తలు కొందరు దాడి చేశారన్న డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మాటలనే ముడా ఛైౖర్మన్ ఎన్.వెంకటరెడ్డియాదవ్ కూడా చెప్పారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, ప్రశాంతమైన పుంగనూరును చెడపడానికి రామచంద్రయాదవ్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆయన రాజకీయ లబ్ధికోసం ఆరాటపడుతున్నట్లు విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అలీంబాషా, వైస్ చైర్మన్ లలిత, కౌన్సిలర్లు అమ్ము, నరసింహులు, తుంగా మంజునాథ్, నవీన్‌కుమార్‌రాజు, జయకుమార్‌యాదవ్, కాళిదాసు, రేష్మ, నాయకులు చంద్రారెడ్డియాదవ్, జయకృష్ట, ఇంతియాజ్‌ఖాన్, రమణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T02:03:21+05:30 IST