పోలేరమ్మ జాతరకు దశాబ్దాల చరిత్ర
ABN, First Publish Date - 2022-09-14T06:37:42+05:30
వెంకటగిరి శక్తి స్వరూపిణిగా భక్తులు కొలిచే పోలేరమ్మ జాతరకు దశాబ్దాల చరిత్ర వుంది.1913వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో కలరా వ్యాపించి భారీ ప్రాణ నష్టం సంభవించింది.వెంకటగిరి సంస్థానాధీశులు ప్రజల సంరక్షణ కోసం శీతల యాగాన్ని ఘనంగా నిర్వహించారు.ఏటా జాతర నిర్వహిస్తామని పోలేరమ్మకు మొక్కుకున్నారు.
వెంకటగిరి/వెంకటగిరి టౌన్, సెప్టెంబరు 13 : వెంకటగిరి శక్తి స్వరూపిణిగా భక్తులు కొలిచే పోలేరమ్మ జాతరకు దశాబ్దాల చరిత్ర వుంది.1913వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో కలరా వ్యాపించి భారీ ప్రాణ నష్టం సంభవించింది.వెంకటగిరి సంస్థానాధీశులు ప్రజల సంరక్షణ కోసం శీతల యాగాన్ని ఘనంగా నిర్వహించారు.ఏటా జాతర నిర్వహిస్తామని పోలేరమ్మకు మొక్కుకున్నారు. యాగానంతరం ఆ రాళ్లను ఊరి పొలిమేరల్లో ప్రతిష్టించారు.ప్రస్తుతం పట్టణంలో నిత్యం పూజలందుకుంటున్న శిలకూడా నాడు ప్రతిష్టించిన శీతల రాళ్లలో ఒకటి.అప్పటి నుంచి ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో కలరా సోకలేదని చెబుతుంటారు. అప్పట్నుంచీ వెంకటగిరి సంస్థానాధీశుల ఆద్వర్యంలో పోలేరమ్మ జాతరను ఏటా వైభవంగా నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. వినాయక చవితి తర్వాత వచ్చే బుధవారం రాత్రి 12 గంటల తర్వాత జాతరకు మొదటి చాటింపు, మలి బుధవారం రెండో చాటింపు వేస్తారు.తర్వాత వచ్చే ఆదివారం అమ్మవారికి ఘటోత్సవం నిర్వహిస్తారు. గాలిగంగల మండపంలో రెండు పచ్చి కుండలను వుంచి పూజలు చేశాక పోలేరమ్మ అత్తగారి నివాసమైన చాకలివీధి వద్దకు తరలిస్తారు.ఆ కుండల్లో భక్తులు అంబళ్లు పోశాక డప్పు వాయిద్యాల నడుమ బాణాసంచా వెలుగుల మధ్య ఘటాలను ఊరేగింపుగా వెంకటగిరి పట్టణ నడిబొడ్డున వున్న పోలేరమ్మ ఆలయానికి తీసుకు వచ్చి అర్చిస్తారు.తరువాత ఆ కుండలను వెంకటగిరి రాజభవంతికి తీసుకు వస్తారు.అక్కడ రాజవంశీకులు తమ పరివారంతో కలిసి కుండలకు తొలిపూజలు నిర్వహిస్తారు. అలా ఘటోత్సవంతో ప్రతి ఇంటా జాతర సందడి మొదలవుతుంది. అనంతరం రెండు రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు.పోలేరమ్మ ఊరేగింపు సందర్భంగా వెంకటగిరి పురవీధులు భక్తజన సంద్రాన్ని తలపిస్తాయి.ఊరేగింపు గురువారం తెల్లవారుజామున గుడివద్దకు చేరుకోగానే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.రాజకుటుంబీకులు, రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిదులతో అమ్మవారి ఆలయం సందడిగా మారుతుంది. ప్రవాస భారతీయులు సైతం జాతరకు తప్పకుండా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొంటారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.మధ్యాహ్నం మూడు గంటలకు దున్నపోతును బలి ఇస్తారు. అనంతరం నూనె దీపంతో చేతపట్టిన రజకుడిని వీధుల్లో తిప్పుతారు.దీపం ఆరిపోకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు.బలి ఇచ్చిన దున్నపోతు రక్తంతో తయారుచేసిన అన్నాన్ని పొలిమేరల్లో చల్లుతారు.పొలి పూర్తయిన వెంటనే పోలేరమ్మ ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఊరేగింపు కౌవల్యానది తీరానికి చేరుకోగానే అమ్మవారి కళ్లను, చేతులను తొలగిస్తారు. పోలేరమ్మ విగ్రహం విరూప మండపానికి పోగానే ఆ మట్టిని భక్తులు పోటీపడి పట్టుకెళతారు. ఈ మట్టిని ఇంటిలో పెట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో పోలేరమ్మ జాతర ముగుస్తుంది.
రాజాల చేతుల మీదుగా పట్టువస్త్రాలు
పోలేరమ్మ జాతరకు వెంకటగిరి రాజాలు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 1919-1992నడుమ రాజాల ఆధ్వర్యంలోనే జాతర జరగడంతో వారి ఆధీనంలోనే అమ్మవారి నగలను భద్రపరిచేవారు. పోలేరమ్మ దేవస్థాన నిర్వహణ దేవదాయ శాఖ తీసుకున్న తరువాత నగలను దేవదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. అయితే ఏటా పట్టువస్ర్తాలను మాత్రం రాజాలు అందించే సాంప్ర దాయం కొనసాగుతోంది.టీటీడీ ఆధ్వర్యంలో కూడా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు.పలువురు వీఐపీలు కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటారు.
Updated Date - 2022-09-14T06:37:42+05:30 IST