ఆ లోటు.. పూడ్చుకునేదెలా?
ABN, First Publish Date - 2022-11-05T01:23:00+05:30
పుంగనూరు మున్సిపాలిటీలోనూ ఆదాయానికి మించి ఖర్చులున్నాయి. ఏడాదికి రూ.4.35 కోట్ల లోటు ఉంటుంది. దీనిని భర్తీ చేసుకునే మార్గం లేక.. అధికారులు సతమతమవుతున్నారు.
పుంగనూరు మున్సిపాలిటీపై ఏటా రూ.4.35 కోట్ల అదనపు భారం
పుంగనూరు మున్సిపాలిటీలోనూ ఆదాయానికి మించి ఖర్చులున్నాయి. ఏడాదికి రూ.4.35 కోట్ల లోటు ఉంటుంది. దీనిని భర్తీ చేసుకునే మార్గం లేక.. అధికారులు సతమతమవుతున్నారు. దీని ప్రభావం అభివృద్ధిపై పడుతోంది. కాకుంటే, గనులశాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్య నియోజకవర్గం కావడంతో కొన్ని ప్రత్యేక నిధులు వస్తతన్నాయి. దీనివల్ల కొంతవరకు అభివృద్ధి పనులు జరుగుతుండటం ఊరటనిచ్చే అంశం.
- పుంగనూరు
పుంగనూరు మున్సిపాలిటీ పరిధి 16.53 చదరపు కిలోమీటర్లు. జనాభా 62వేలు. తారు, సిమెంటు, మట్టి రోడ్లు 96 కిలోమీటర్లపైగా ఉన్నాయి. పది కిలోమీటర్ల వరకు మురుగునీటి కాలువలున్నాయి. సాధారణంగా రెగ్యులర్ ఉద్యోగులకు ప్రభుత్వం జీతభత్యాలు మాత్రమే ఇస్తుంది. మిగిలిన ఖర్చులన్నీ ప్రజల ద్వారా వసూలయ్యే పన్నులతోనే నడపాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల గ్రాంట్లు, పథకాల ద్వారా అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తాయి. వీటిలో 15వ ఆర్ధికసంఘం నిధులను విద్యుత్ బకాయిలకు ప్రభుత్వం సర్దుబాటు చేయించింది. ఇలా అభివృద్ధి పనులకు వెచ్చించాల్సిన 15వ ఆర్ధికసంఘం నిధులు రూ.4.80 కోట్లు కరెంటు బకాయిలకు జమయ్యాయి. దీంతో మున్సిపాలిటీపై భారం పెరిగిపోయింది. పట్టణంలో పలుచోట్ల దెబ్బతిన్న సిమెంటురోడ్లు, కల్వర్టులు, మురుగు నీటి కాలువలు, పట్టణ శివారు ప్రాంతాల్లో తాగునీటి, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు బాగు చేయించడం వంటి పనులకు నిధుల సమస్య నెలకొంది.
ఫ మున్సిపాలిటీకి ఏడాదికి వచ్చే ఆదాయం రూ.7.66 కోట్లు. ఖర్చు రూ.12.01 కోట్లు. ఈ లెక్కన ఏటా రూ.4.35 కోట్లు మున్సిపాలిటీపై అదనపు భారం పడుతోంది.
రెండునెలల్లో పన్నులు వసూలు చేస్తాం
అన్ని పన్నులను ఇప్పటికే 60 శాతం వసూలు చేశశం. మరో రెండు నెలల్లో మిగతా వసూలు చేస్తాం. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సహకారంతో రూ.కోటి మంజూరైంది. రూ.50లక్షలతో వివిధ పనులు జరుగుతున్నాయి. స్పెషల్ గ్రాంటు నిధులు రూ.20లక్షలతో ప్రతిపాదనలు పంపాం. పుంగమ్మ చెరువుకట్టపై పార్కుకు రూ.50లక్షలు, గోకుల్‌వీధిలోని పార్కు అభివృద్ధికి రూ.40 లక్షలు మంజూరయ్యాయి.
- నరసింహప్రసాద్‌రెడ్డి, కమిషనర్, పుంగనూరు
Updated Date - 2022-11-05T01:23:03+05:30 IST