గ్రామ పాలకుల్లో ఆనందం.. ఆందోళన
ABN, First Publish Date - 2022-10-07T06:49:44+05:30
నిధులొచ్చాయన్న ఆనందం ఒకవైపు.. నేరుగా తమ ఖాతాలకు కాకుండా ఖజానా శాఖకు జమ చేయడంతో తమకు వస్తాయా.. ఎప్పటిలానే మళ్లించేస్తారా అన్న ఆందోళన మరోవైపు. ఇదీ గ్రామ పాలకుల పరిస్థితి.
పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు
ఉమ్మడి జిల్లాకు రూ.22.16 కోట్లు విడుదల
నేరుగా కాకుండా ఖజానా ఖాతాకు మళ్లించిన ప్రభుత్వం
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 6: నిధులొచ్చాయన్న ఆనందం ఒకవైపు.. నేరుగా తమ ఖాతాలకు కాకుండా ఖజానా శాఖకు జమ చేయడంతో తమకు వస్తాయా.. ఎప్పటిలానే మళ్లించేస్తారా అన్న ఆందోళన మరోవైపు. ఇదీ గ్రామ పాలకుల పరిస్థితి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం అన్‌టైడ్ గ్రాంటు రూపంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రూ.22.16 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయానికి గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ నుంచి అధికారిక సమాచారం అందింది. ఈ మొత్తాన్ని తిరిగి విద్యుత్ బిల్లు బకాయిలకు జమ చేసేందుకోసం కేంద్రసూచనను సైతం అమలు చేయకుండా లోపాయికారిగా పాత సీఎ్‌ఫఎంఎస్ ఖాతాల్లోకి ప్రభుత్వం మళ్లించింది. చిత్తూరు జిల్లాలో 297 గ్రామ పంచాయతీలకు గాను 13 పంచాయతీల్లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 684 పంచాయతీలకు రూ.11.06 కోట్లు విడుదలయ్యాయి. తిరుపతి జిల్లాలో 774 పంచాయతీలకుగాను 29కి ఎన్నికలు జరగలేదు. దాంతో మిగిలిన 745 పంచాయతీలకు రూ.10.81 కోట్లు విడుదలయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఉండి కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో విలీనమైన పెద్దమండ్యం మండలంలోని 17 పంచాయతీలకు రూ.28.79 లక్షలు విడుదల చేస్తూ పొరబాటున ప్రభుత్వం చిత్తూరు జిల్లా ఖాతాలో జమ చేసింది. దీన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం ఈ మొత్తాన్ని అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదిక పంపారు. ఈ నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ చేయకుండా పాత ఖజానా విధానం (సీఎ్‌ఫఎంఎస్) ద్వారా జిల్లా ఖజానాకు పంపారు. అనంతరం సంబంధిత సర్పంచుల ఖాతాలకు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏయే పంచాయతీలకు ఏ మేరకు నిధులు కేటాయించాలన్న వివరాల జాబితాను జిల్లా ఖజానా కార్యాలయానికి, సబ్ ట్రెజరీలకు పంపిస్తారు. పాత పద్ధతి ప్రకారం ఖజానా ద్వారా నిధులు విడుదల చేస్తారని ఆదేశించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు ఇస్తే అప్పుడు పంచాయతీలకు కాసులు వచ్చే పరిస్థితి ఏర్పడనుంది. ఈ విధానంతో కథ మళ్ళీ మొదటికొస్తుందని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఖాతాకు నిధులు పడతాయో లేదో లేదా గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్ బిల్లు బకాయిలకంటూ మళ్లించేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2022-10-07T06:49:44+05:30 IST