గాజులమండ్యం గజగజ
ABN, First Publish Date - 2022-03-16T05:54:41+05:30
పడమటి మండలాలను గజగజలాడించే ఏనుగుల సమూహం ఇప్పుడు తూర్పు ప్రాంతాల పనిపడు తోంది. రేణిగుంట మండలం గాజుల మండ్యం శివారుప్రాంతం లో మంగళవారం ఉదయం మూడు గజరాజులు కనిపించాయి. మూడు రోజులుగా వడమాలపేట, రేణిగుంట మండలాల సరిహద్దులలో ఇవి సంచరించినట్టు స్థానికులు చెబుతున్నారు.
ఏనుగుల సంచారంతో భీతిల్లిన జనం
రేణిగుంట,మార్చి15: పడమటి మండలాలను గజగజలాడించే ఏనుగుల సమూహం ఇప్పుడు తూర్పు ప్రాంతాల పనిపడు తోంది. రేణిగుంట మండలం గాజుల మండ్యం శివారుప్రాంతం లో మంగళవారం ఉదయం మూడు గజరాజులు కనిపించాయి. మూడు రోజులుగా వడమాలపేట, రేణిగుంట మండలాల సరిహద్దులలో ఇవి సంచరించినట్టు స్థానికులు చెబుతున్నారు. సర్పంచ్ జి. రమే్‌షతో పాటు పలువురు తమకు తెలిసిన అటవీశాఖ, పోలీసు అధికారులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ ధర్మారెడ్డి, రేంజర్ అశోక్ కుమార్ యాదవ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే గ్రామంలో పంచాయతీ సిబ్బంది ద్వారా ఏనుగులను గ్రామంలోకి రాకుండా డప్పులు కొట్టించారు. గ్రామ ప్రజలు ఇంటినుంచి బయటికి రాకుండా చర్యలు చేపట్టారు.డీఎఫ్‌వో నరేంద్రన్ గాజుల మండ్యం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏనుగుల నుంచి గ్రామస్తులకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాని అటవీఅధికారులకు సూచించారు. తెలుపు రంగు దుస్తులు ధరించిన వారిని పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండేలా ప్రజలకు సూచించాలని ఆయన ఆదేశించారు.ఈ ఏనుగులు ఒకటి రెండు రోజుల్లో వేరేప్రాంతానికి వెళ్లి పోయే అవకాశం ఉందని తెలిపారు. ఏనుగుల వలన పంట నష్టం జరిగితే తమ పరిస్థితి ఏంటని గ్రామస్తులు అధికారులను నిలదీశారు.ఆందోళన చెందకుండా సచివాలయంలో ఫిర్యాదు చేస్తే పరిహారం వస్తుందన్నారు. ఒక చోటనుంచి మరో అటవీ ప్రాంతానికి సంచరించే క్రమంలో ఏనుగులు దారితప్పి వచ్చినట్టుగా డీఎఫ్‌వో అభిప్రాయపడ్డారు.ప్రజలు భయాందో ళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.సాయంత్రానికి గ్రామ సమీపంలో ఉన్న ఏనుగులను స్వర్ణముఖి నదినుంచి తూర్పు ప్రాంతాలకు తరలి వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Updated Date - 2022-03-16T05:54:41+05:30 IST