అంతా గొడవ గొడవ..
ABN, First Publish Date - 2022-12-31T01:44:02+05:30
దాడులు, దౌర్జన్యాలనే ఆధారంగా చేసుకుని వైసీపీ రాజకీయాలు ఈ ఏడాది కూడా కొనసాగాయి. వీటిని ఎదుర్కొని, జైళ్ళకు వెళ్లడం ద్వారా టీడీపీ జిల్లాలో పుంజుకుంది.
చిత్తూరు, ఆంధ్రజ్యోతి: దాడులు, దౌర్జన్యాలనే ఆధారంగా చేసుకుని వైసీపీ రాజకీయాలు ఈ ఏడాది కూడా కొనసాగాయి. వీటిని ఎదుర్కొని, జైళ్ళకు వెళ్లడం ద్వారా టీడీపీ జిల్లాలో పుంజుకుంది. వైసీపీ దృష్టంతా చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మీదే ఉండగా, పెద్దిరెడ్డి నియోజకవర్గం కుప్పంలో పెచ్చుమీరిన అరాచకాలు వైసీపీ ప్రతిష్టను దిగజార్చాయి. అభివృద్ధి అంగుళమైనా కదలకపోవడంతో ఆ పార్టీనేతలు అభద్రతలో కూరుకుపోయారనే వ్యాఖ్యలు పెరిగాయి. ఇక జంకు, భయం, ఉదాశీనతలను వదిలి వీధుల్లోకి కలసి వచ్చి పోరాడడం ఈ ఏడాది టీడీపీ ప్రత్యేకత. మిగిలిన అన్ని పార్టీలూ ఉనికికే పరిమితం అయ్యాయి. 2022 రాజకీయ ముద్రలు ఇవీ...
వైసీపీ: అభద్రతతో దాడులు
వైసీపీ ఈ ఏడాది కూడా ప్రత్యర్థుల్ని అడ్డుకునేందుకు దౌర్జన్యాలు, దాడులు, పోలీసులు కేసులతో వేధింపుల రాజకీయం కొనసాగించింది. కుప్పం మీద వైసీపీ కేంద్రీకరించింది. సీఎం జగన్ సెప్టెంబరు 23న కుప్పంలో మూడో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు జనం కోసం పెద్ద హడావుడే చేశారు. మరోవైపు కుప్పంలో చంద్రబాబును పర్యటించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడం చర్చగా మారింది. ఈ సందర్భంగా 60 మంది టీడీపీ నేతల మీద కేసులు పెట్టారు కూడా. కుప్పం తర్వాత పుంగనూరే ప్రధాన చర్చగా నిలచింది. పులివెందులలో కూడా లేనంతగా మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో వైసీపీ అరాచకాలు కొనసాగాయి. పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ మీద దాడులు, టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించడం వంటివి ఆ పార్టీలో పెరుగుతున్న అభద్రతను సూచిస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆదరణ లేకపోవడంతో పాటు అనేక చోట్ల ప్రజలు నిలదీయడం మొదలు పెట్టారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ఎంఎ్సబాబులకు పలుమార్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కుప్పంలో తిరుపతి గంగమ్మ మాజీ ఛైర్మెన్ పార్థసారథి ఆత్మహత్య, ఎమ్మెల్సీ భరత్ పీఏను వైసీపీ నేతలే కొట్టడం, గుడిపాలలో జడ్పీటీసీ- సర్పంచి కొట్టుకోవడం వంటివి అధికారపార్టీలోని వర్గపోరును వెల్లడించాయి.
టీడీపీ: జోష్ పెరిగింది
ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకత టీడీపీకి అనుకూలంగా మారుతోంది. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది జిల్లాలో టీడీపీ బాగా పుంజుకుందని చెప్పొచ్చు. వైసీపీ నేతల అరాచకాలు, అక్రమ కేసుల్ని టీడీపీ నేతలు ఈ ఏడాది ధీటుగానే ఎదుర్కొన్నారు. బెదిరింపులకు లొంగకుండా, జైళ్లకు కూడా వెళుతున్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు సార్లు, జిల్లా కేంద్రం చిత్తూరులో రెండుసార్లు, మొత్తం ఐదుసార్లు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో పర్యటించారు. అలాగే పలువురిని పరామర్శించారు. కరోనాతో మరణించిన టీడీపీ నేత కటారి ప్రవీణ్ భార్య, మాజీ మేయర్ కటారి హేమలతను, తల్లిని కోల్పోయిన టీడీపీ నేత గురజాల మహదేవసందీ్పను పరామర్శించారు. సదుంలో వైసీపీ నాయకుల చేతుల్లో తీవ్రంగా గాయపడిని రాజారెడ్డిని కూడా సందీప్ ఇంట్లోనే పరామర్శించి ధైర్యం చెప్పారు. కుప్పం పర్యటనలో పోలీసు కేసులతో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సహా14 మందిని చిత్తూరు జిల్లా జైలులో చంద్రబాబు పరామర్శించారు. పోలీసుల జీపు ఎక్కించడంతో తీవ్రంగా గాయపడ్డ మాజీ మేయర్ హేమలతను కూడా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇవన్నీ టీడీపీ కేడర్‌లో మనోధైర్యాన్ని పెంచాయి. ఇక క్యాడర్ బలంగా ఉన్నా చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలు లేని లోటు ఈ ఏడాదీ కొనసాగింది. కుప్పంలో 2022లోనూ చంద్రబాబు, పాత నాయకత్వం మీదే ఆధారపడడం ఆ నియోజకవర్గంలో అసంతృప్తిని పెంచుతోంది.
బీజేపీ, జనసేన: ఉనికి మాత్రమే
చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది జనసేన ఉనికికే పరిమితం అయ్యింది. యువకుల్లో జనసేనపై అభిమానం ఉన్నా, దాన్ని ఓటు బ్యాంకుగా మలచుకునే నాయకులు లేరు. బీజేపీ గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఇక ఏడాదికి మూడుసార్లు కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి జిల్లాలో పర్యటించి ప్రెస్మీట్లు పెట్టడం మినహా జిల్లాలో కాంగ్రెస్ ఉనికి పెద్దగా లేదనే చెప్పుకోవాలి.
వామపక్షాలు: పోరే వారి దారి
ఈ ఏడాది కూడా వామపక్ష నాయకులు నిరసనలు, ఆందోళనలతోనే గడిపారు. ఏదైనా సమస్య వస్తే వెంట నిలబడతారనే నమ్మకం జనంలో మిగిల్చారు. విజయా డెయిరీ అమూల్‌కు అప్పగించడం, పెన్షన్లను రద్దు చేయడం వంటి అంశాల మీద ధర్నాలు చేశారు.
Updated Date - 2022-12-31T01:44:04+05:30 IST